
సాక్షి, హైదరాబాద్: ఆ ప్రాంతానికి వెళ్తే బుద్ధుడి జీవితచక్రం కళ్లముందు కదలాడుతుంది.. ఆ మహనీయుని బోధనలు అడుగడుగునా ప్రేరణ కల్పించేలా వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ప్రధాన బౌద్ధ స్థూపాలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు ఆ ప్రాంతం దేశంలోనే ప్రధాన బౌద్ధపర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అంతర్జాతీయ పర్యాటకులనూ ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంటోంది. అదే నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం. 249 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణాల పరంపరలో కీలకమైన మహాస్తూపం ప్రత్యేక తరహాలో సిద్ధమవుతోంది. నంద్యాలలో చెక్కిన శిల్పాలు ఇటీవలే బుద్ధవనం చేరుకున్నాయి. వాటిని ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆకాశ గుమ్మటం... ఆకర్షణీయం..
మహాస్తూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 70 అడుగుల ఎత్తు, 140 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. పైన గుమ్మటం తరహాలో నిర్మాణం ఉంటుంది. అదే ప్రధాన మందిరం. లోపలి వైపు నిలబడి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది. పైకప్పునకు ఆకాశం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 16 వరసల్లో గులాబీ పూరేకుల తరహాలో తీర్చిదిద్దా రు. ఈ ఏర్పాటు సిమెంటుతో కాకుండా అల్యూమినియం ఫ్యాబ్రికేషన్‌తో ఏర్పాటు చేయటం విశేషం. అందులోనే నాలుగు దిక్కులా ఒక్కోటి 9 అడుగుల ఎత్తులో ఉండే నాలుగు బుద్ధుడి భారీ రాతి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ధర్మచక్ర ప్రవర్ధన ముద్రలో ఇవి ఉంటాయి. వీటి మధ్య ఒక్కోటి మూడు అడుగుల ఎత్తుతో మరో 4 విగ్రహాలుం టాయి. అవి ధ్యాన ముద్ర, భూస్పర్శ ముద్ర, అభయముద్ర, వర్ణముద్రల్లో ఉంటాయి.
వీటి ప్రతిష్ట పూర్తయితే ప్రధాన నిర్మాణం పూర్తయినట్టే. ప్రధాన ద్వారం వద్ద అష్టమంగళ చిహ్నాలు, బుద్ధుడి జాతకచిహ్నాలను రాతితో చేయించిన 104 ప్యానెల్స్‌పై చెక్కించి ఏర్పాటు చేయించారు. మధ్య 17 అడుగులతో ధర్మచక్ర స్తంభం ఠీవిగా నిలబడి ఆకట్టుకుంటోంది. ఇక బుద్ధచరిత్ర వనంలో బుద్ధుడి జీవితగాథలోని ప్రధానఘట్టాలు ప్రతి బింబించేలా 10 కాంస్యవిగ్రహాలు ఏర్పాటు చేయించారు. బుద్ధుడి జాతక కథలను తెలిపే 40 రాతి ఫలకాలను ఏర్పాటు చేశారు. శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా 27 అడుగుల ఎత్తుతో ఔకాన బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయించింది. మన దేశంలోని ప్రధాన 5 బౌద్ధ స్తూపాలు, వివిధ దేశాల్లోని ప్రధాన 8 స్తూపాల సూక్ష్మ నమూనాలతో మినియేచర్ పార్కును ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులతోపాటు సాధారణ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నామని ఆ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు.