Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ.. | Oscars 2025: Sandhya Suri film selected as UK official entry for Oscars | Sakshi
Sakshi News home page

Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..

Published Fri, Sep 27 2024 12:21 AM | Last Updated on Fri, Sep 27 2024 8:23 AM

Oscars 2025: Sandhya Suri film selected as UK official entry for Oscars

‘ఆస్కార్‌’కు మన లేడీస్‌

మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?
న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?
కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?
సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్‌’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్‌ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్‌’తో పాటు ఆస్కార్‌లో  ‘సంతోష్‌’ కూడా భారతీయ మహిళల కథను  పోటీకి నిలపనుంది.

ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.

ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.

డాక్యుమెంటరీ మేకర్‌ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్‌’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్‌ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.

కథ ఏమిటి?
‘సంతోష్‌’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్‌ సైని అనే మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. 

దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్‌ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.

మహిళలపై హింసకు వ్యతిరేకంగా
లండన్‌లో పుట్టి పెరిగిన బ్రిటిష్‌ ఇండియన్‌ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్‌ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్‌జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్‌’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్‌/ఫ్రెంచ్‌ దేశాల ఫిల్మ్‌ ఫండింగ్‌ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్‌వర్‌ (పంచాయత్‌ ఫేమ్‌), సంజయ్‌ బిష్ణోయ్‌ తదితరులు ఇందులో నటించారు.

ఆస్కార్‌ ఎంట్రీ
మేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్‌’ను 97వ ఆస్కార్‌ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్‌ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్‌ స్త్రీల కథకాగా ‘సంతోష్‌’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.

ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement