story of film
-
Oscars 2025: యూకే ఓకే చెప్పిన ఈక్వాలిటీ కథ..
మన దేశంలో అందరికీ సమాన న్యాయం జరగడం సులభమేనా?న్యాయానికి కులం, మతం,ప్రాంతం ఉంటాయా?కంటికి కనిపించేది, చెవికి వినిపించేదంతా న్యాయమేనా?సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’ సంధించే ప్రశ్నలివి. యు.కె. ప్రభుత్వ నిర్మాణ భాగస్వామ్యంతో నిర్మితమైన ఈ సినిమాను ఇప్పుడు ఆ దేశం తన అఫిషియల్ ఎంట్రీగా ఆస్కార్‌కు పంపింది. ‘లాపతా లేడీస్’తో పాటు ఆస్కార్‌లో ‘సంతోష్’ కూడా భారతీయ మహిళల కథను పోటీకి నిలపనుంది.ఈ వ్యవస్థ ఎలా నడుస్తోందో వ్యవస్థతో తలపడినప్పుడే సగటు మనిషికి తెలుస్తుంది. సామాజిక వ్యవస్థలో తన కంటే పై వర్గం ఎలా వ్యవహరిస్తుందో తెలిసొస్తే పాలనా వ్యవస్థలో తన కంటే పై అధికారి ఆ పై అధికారి ఎలా వ్యవహరిస్తారో తెలిసొస్తుంది. ప్రతి వ్యవస్థకు వర్షించే కళ్లు, కాటేసే కోరలు ఉంటాయి.ఎవరి మీద వర్షించాలో, ఎప్పుడు కాటేయాలో దానికి తెలుసు. అది మారాలని అందరికీ ఉంటుంది. వ్యవస్థ కూడా తాను మారాలని అనుకోవచ్చు. కాని మారదు. మారాలనుకున్నా మనుషులు మారనివ్వరు. ఏదో కొద్ది వెసులుబాటులో కాసింతో కూసింతో గాలి ఆడి పనులు అవుతుంటాయి అంతే.డాక్యుమెంటరీ మేకర్ సంధ్యా సూరి తీసిన ‘సంతోష్’ సినిమా మన భారతీయ వ్యవస్థ– అది కుల వ్యవస్థ కాని పాలనా వ్యవస్థ గాని ఎలా వ్యవహరిస్తుందో ఒక బాలిక చావు ఆధారంగా చర్చిస్తుంది. ఒక మహిళా కానిస్టేబుల్ కళ్లతో సామాజిక వ్యవస్థను, న్యాయ వ్యవస్థను చూసి ప్రేక్షకుల మనసుల్లో ప్రశ్నలు నాటుతుంది.కథ ఏమిటి?‘సంతోష్’ సినిమాలో ప్రధాన పాత్రధారి సంతోష్ సైని అనే మహిళా పోలీస్ కానిస్టేబుల్. ఈ పాత్రను చాలా ప్రతిభావంతమైన నటిగా పేరు పొందిన షహానా గోస్వామి పోషించింది. ఉత్తరప్రదేశ్‌లాంటి ఒక కల్పిత రాష్ట్రంలో సంతోష్‌కు ఒక కానిస్టేబుల్‌కు పెళ్లవుతుంది. కానీ డ్యూటీలో ఉండగా భర్త హఠాత్తుగా మరణిస్తాడు. ‘నా కొడుకును మింగింది’ అని అత్తగారు సూటి పోటి మాటలంటే అమ్మ గారింట్లోని వారు తిరిగొచ్చిన కూతురిని రకరకాలుగా బాధలు పెడతారు. దాంతో గత్యంతరం లేక భర్త మరణం వల్ల వచ్చే కారుణ్య నియామకంలో ఆమె కానిస్టేబుల్ అవుతుంది. కాని పోలీసులంటే బయట ఉండే మనుషుల్లాంటి వారేనని అక్కడ దారుణమైన పురుషస్వామ్యం, కుల పెత్తనం, అవినీతి, మత ద్వేషం ఉంటాయని తెలుసుకుంటుంది. ఆ సమయంలోనే ఒక అట్టడుగు వర్గం బాలిక శవం ఊరి బావిలో దొరుకుతుంది. అగ్ర కులాల వారే ఆమెను చంపి బావిలో వేశారని గ్రామస్తులు విచారణకు వెళ్లిన సంతోష్‌కు చెబుతారు. అక్కడి నుంచి ఆమె ఎలాంటి ప్రయాణం చేసిందనేదే కథ.మహిళలపై హింసకు వ్యతిరేకంగాలండన్లో పుట్టి పెరిగిన బ్రిటిష్ ఇండియన్ సంధ్యా సూరి గతంలో ‘ఐ ఫర్ ఇండియా’ డాక్యుమెంటరీలో ‘ఫీల్డ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో చాలా అవార్డులు పొందింది. భారతదేశంలో స్త్రీలపై సాగే హింస మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని ఇండియాలోని ఎన్జిఓలతో పని చేస్తున్నప్పుడు ‘నిర్భయ’ ఘటన ఆమెను హతాశురాలిని చేసింది. ఆ సమయంలో నిరసనలు చేస్తున్న స్త్రీలను అదుపు చేసే మహిళా కానిస్టేబుళ్ల కళ్లలోని బాధ, ఆవేదన చూసినప్పుడు ఆమెకు ‘సంతోష్’ సినిమా తీయాలని అనిపించింది. అయితే దీని నిర్మాణం కోసం ఆమె యు.కె/జర్మన్/ఫ్రెంచ్ దేశాల ఫిల్మ్ ఫండింగ్ ఏజెన్సీల భాగస్వామ్యం కోరింది. సునీతా రాజ్వర్ (పంచాయత్ ఫేమ్), సంజయ్ బిష్ణోయ్ తదితరులు ఇందులో నటించారు.ఆస్కార్ ఎంట్రీమేలో జరిగిన 77వ కాన్స్‌లో బహు ప్రశంసలు పొందిన ‘సంతోష్’ను 97వ ఆస్కార్ అవార్డుల పోటీలో తన దేశ అఫిషియల్ ఎంట్రీగా పంపాలని యూకే భావించడం ఈ కథకు, దర్శకురాలికి దక్కిన గౌరవంగా భావించాలి. ఇప్పటికే మన దేశం నుంచి వెళుతున్న లాపతా లేడీస్ స్త్రీల కథకాగా ‘సంతోష్’ కూడా స్త్రీల కథే కావడం విశేషం.ఇవి చదవండి: మునుపటి కాలం కాదు ఇది, కానీ.. -
తెలివైన కాపీ..!
ఆ సీన్ - ఈ సీన్ పేరుకు పెద్ద దర్శకులే కానీ సినిమా కథలను కాపీ కొట్టడంలో వారు కొన్ని సార్లు తమ స్థాయిని పక్కన పెట్టేస్తారు. బాగా నచ్చేసిన కథను కాపీ కొట్టేసి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తమ సొంత క్రియేషన్‌గా మార్చేసుకొంటారు. ఎంతో చరిత్ర ఉన్న, సొంతంగా ఎన్నో సూపర్‌హిట్స్‌ను కొట్టిన వాళ్లు కూడా కాపీ రాయుళ్లే. బాలీవుడ్లో మంచి ఫామ్‌లో ఉన్న మలయాళ దర్శకాగ్రేసరుడు ప్రియదర్శన్ కూడా అలాంటి కాపీరాయుడే. ఈయన సినిమాలనేకం తెలుగులో రీమేక్ అయ్యాయి. అలాంటి వాటిలో ఒకటి ‘చంద్రలేఖ’ మరి ఈ సినిమా కథ విషయంలో ప్రియదర్శన్ చేసిన జిమ్మిక్ అలాంటిలాంటిది కాదు. ఇంతకీ ఎలాంటిదంటే... లూసీ(శాండ్రా బులక్) షికాగో రైల్వేస్టేషన్లో టికెట్ కలెక్టర్. రద్దీగా ఉండే స్టేషన్లో ఒకరోజు తోపులాటలో పట్టాలపై పడి స్పృహ కోల్పోయిన పీటర్ కాలెన్ అనే యువకుడిని ఆమె గమనిస్తుంది. ఎవరూ పట్టించుకోకపోయినా అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి, అతడి అడ్రస్ కనుక్కొని ఇంట్లో వాళ్లకు సమాచారం ఇస్తుంది. దీంతో షాక్ తిన్న అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హడావుడిగా ఆస్పత్రికి వస్తారు. లూసీని తమ అబ్బాయి ప్రియురాలిగా భావిస్తారు. ఆ పరిస్థితుల్లో అది కాదు.. అని చెబితే వాళ్లు ఫీల్ అవుతారని ఆమె పీటర్‌కు ప్రియురాలినని ఒప్పుకొంటుంది. ఆ కుటుంబం ఆమెను ఎంతో ఆదరిస్తుంది. అయితే కోమాలో ఉన్న పీటర్ ఎవరో, ఏమిటో కూడా లూసీకి తెలీదు. ఈ పరిస్థితుల నడుమ ధనిక పీటర్ కుటుంబం నేపథ్యంతో లూసీ తన కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కరించుకొంటుంది. ఇదే సమయంలో ఆమె పీటర్ తమ్ముడు జాక్‌తో ప్రేమలో పడుతుంది. అసలు విషయం తెలుసుకొన్న జాక్ లూసీకి దగ్గరవుతాడు. వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాకా పీటర్ కోమాలోంచి బయటకు వస్తాడు. లేస్తూనే లూసీని తన ప్రియురాలు అని అంటాడు, ఇంట్లో వాళ్లు పీటర్-లూసీల పెళ్లికి అన్నీ సిద్ధం చేస్తారు. దీంతో అసలు ప్రేమికులు అయిన లూసీ-జాక్‌లు ఇబ్బందుల్లో పడిపోతారు. అలాంటి పరిస్థితుల నడుమ వారు త మ ప్రేమను సఫలం చేసుకొనే మెలోడ్రామానే మిగతా కథ... ఇది ‘వైల్ యు వర్ స్లీపింగ్’ సినిమా కథ. శాండ్రా బులక్ ప్రధాన పాత్ర పోషించగా రూపొందిన రొమాంటిక్ సూపర్‌హిట్ కథ. ఈ కథ వింటేనే మనకు ‘చంద్రలేఖ’ సినిమా గుర్తుకు రాకమానదు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్లు ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘చంద్రలేఖ’ సినిమా కథ అచ్చంగా పైన చెప్పుకొన్నదే. కాకపోతే ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లేది హీరోయిన్(రమ్యకృష్ణ), ఆమెను హాస్పిటల్‌కు తీసుకొచ్చి ఆమె ప్రియుడిగా లాక్ అయిపోయేది హీరో (నాగార్జున). ఆ తర్వాత హీరోయిన్ చెల్లెలు(ఇషా)తో హీరో ప్రేమలో పడటం... రమ్యకృష్ణ కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించుకొని తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడం, కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్‌కి, హీరోకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకోవడం, అప్పుడు హీరో, హీరోయిన్ చెల్లెలు ప్రేమకథకు సంబంధించిన డ్రామా అంతా కాపీనే! హాలీవుడ్లో కథ హీరోయిన్ ఓరియెంటెడ్‌గా నడిస్తే... తెలుగులోకి వచ్చే సరికి హీరోను ప్రధానపాత్రగా మార్చారు. అంతే తేడా! ‘వైల్ యు వర్ స్లీపింగ్’ సినిమా కథను మొదటగా మలయాళంలో ‘చంద్రలేఖ’ పేరుతో తెరకెక్కించారు ప్రియదర్శన్. మోహన్‌లాల్ హీరోగా రూపొందిన ఆ సినిమా అక్కడ సూపర్‌హిట్ కావడంతో మనోళ్లు రీమేక్ చేశారు. ఈ సినిమా సల్మాన్‌ఖాన్ హీరోగా హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ప్రతిచోటా దీన్ని మలయాళంలో వచ్చిన ‘చంద్రలేఖ’కు రీమేక్ అని పరిచయం చేశారు. ప్రియదర్శన్ విరచిత కథగా చెప్పారు. కానీ... ఎవరు ఎక్కడ రీమేక్ చేసినా అసలు మూలం మాత్రం హాలీవుడ్‌దే. ఈ విషయాన్ని మాత్రం మార్చలేం ఎందుకంటే... ‘వైల్ యు వర్ స్లీపింగ్’ హాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ గా ఉంటుంది మరి! - బి. జీవన్ రెడ్డి