ఆ సీన్ - ఈ సీన్
పేరుకు పెద్ద దర్శకులే కానీ సినిమా కథలను కాపీ కొట్టడంలో వారు కొన్ని సార్లు తమ స్థాయిని పక్కన పెట్టేస్తారు. బాగా నచ్చేసిన కథను కాపీ కొట్టేసి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తమ సొంత క్రియేషన్‌గా మార్చేసుకొంటారు. ఎంతో చరిత్ర ఉన్న, సొంతంగా ఎన్నో సూపర్‌హిట్స్‌ను కొట్టిన వాళ్లు కూడా కాపీ రాయుళ్లే. బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మలయాళ దర్శకాగ్రేసరుడు ప్రియదర్శన్ కూడా అలాంటి కాపీరాయుడే. ఈయన సినిమాలనేకం తెలుగులో రీమేక్ అయ్యాయి.
అలాంటి వాటిలో ఒకటి ‘చంద్రలేఖ’ మరి ఈ సినిమా కథ విషయంలో ప్రియదర్శన్ చేసిన జిమ్మిక్ అలాంటిలాంటిది కాదు. ఇంతకీ ఎలాంటిదంటే...
లూసీ(శాండ్రా బులక్) షికాగో రైల్వేస్టేషన్‌లో టికెట్ కలెక్టర్. రద్దీగా ఉండే స్టేషన్‌లో ఒకరోజు తోపులాటలో పట్టాలపై పడి స్పృహ కోల్పోయిన పీటర్ కాలెన్ అనే యువకుడిని ఆమె గమనిస్తుంది. ఎవరూ పట్టించుకోకపోయినా అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి, అతడి అడ్రస్ కనుక్కొని ఇంట్లో వాళ్లకు సమాచారం ఇస్తుంది. దీంతో షాక్ తిన్న అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హడావుడిగా ఆస్పత్రికి వస్తారు. లూసీని తమ అబ్బాయి ప్రియురాలిగా భావిస్తారు. ఆ పరిస్థితుల్లో అది కాదు.. అని చెబితే వాళ్లు ఫీల్ అవుతారని ఆమె పీటర్‌కు ప్రియురాలినని ఒప్పుకొంటుంది.
ఆ కుటుంబం ఆమెను ఎంతో ఆదరిస్తుంది. అయితే కోమాలో ఉన్న పీటర్ ఎవరో, ఏమిటో కూడా లూసీకి తెలీదు. ఈ పరిస్థితుల నడుమ ధనిక పీటర్ కుటుంబం నేపథ్యంతో లూసీ తన కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కరించుకొంటుంది. ఇదే సమయంలో ఆమె పీటర్ తమ్ముడు జాక్‌తో ప్రేమలో పడుతుంది. అసలు విషయం తెలుసుకొన్న జాక్ లూసీకి దగ్గరవుతాడు. వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాకా పీటర్ కోమాలోంచి బయటకు వస్తాడు. లేస్తూనే లూసీని తన ప్రియురాలు అని అంటాడు, ఇంట్లో వాళ్లు పీటర్-లూసీల పెళ్లికి అన్నీ సిద్ధం చేస్తారు.
దీంతో అసలు ప్రేమికులు అయిన లూసీ-జాక్‌లు ఇబ్బందుల్లో పడిపోతారు. అలాంటి పరిస్థితుల నడుమ వారు త మ ప్రేమను సఫలం చేసుకొనే మెలోడ్రామానే మిగతా కథ... ఇది ‘వైల్ యు వర్ స్లీపింగ్’ సినిమా కథ. శాండ్రా బులక్ ప్రధాన పాత్ర పోషించగా రూపొందిన రొమాంటిక్ సూపర్‌హిట్ కథ. ఈ కథ వింటేనే మనకు ‘చంద్రలేఖ’ సినిమా గుర్తుకు రాకమానదు.
కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్‌లు ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘చంద్రలేఖ’ సినిమా కథ అచ్చంగా పైన చెప్పుకొన్నదే. కాకపోతే ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లేది హీరోయిన్(రమ్యకృష్ణ), ఆమెను హాస్పిటల్‌కు తీసుకొచ్చి ఆమె ప్రియుడిగా లాక్ అయిపోయేది హీరో (నాగార్జున). ఆ తర్వాత హీరోయిన్ చెల్లెలు(ఇషా)తో హీరో ప్రేమలో పడటం... రమ్యకృష్ణ కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించుకొని తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడం, కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్‌కి, హీరోకి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు అనుకోవడం, అప్పుడు హీరో, హీరోయిన్ చెల్లెలు ప్రేమకథకు సంబంధించిన డ్రామా అంతా కాపీనే! హాలీవుడ్‌లో కథ హీరోయిన్ ఓరియెంటెడ్‌గా నడిస్తే... తెలుగులోకి వచ్చే సరికి హీరోను ప్రధానపాత్రగా మార్చారు. అంతే తేడా!
‘వైల్ యు వర్ స్లీపింగ్’ సినిమా కథను మొదటగా మలయాళంలో ‘చంద్రలేఖ’ పేరుతో తెరకెక్కించారు ప్రియదర్శన్. మోహన్‌లాల్ హీరోగా రూపొందిన ఆ సినిమా అక్కడ సూపర్‌హిట్ కావడంతో మనోళ్లు రీమేక్ చేశారు. ఈ సినిమా సల్మాన్‌ఖాన్ హీరోగా హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ప్రతిచోటా దీన్ని మలయాళంలో వచ్చిన ‘చంద్రలేఖ’కు రీమేక్ అని పరిచయం చేశారు. ప్రియదర్శన్ విరచిత కథగా చెప్పారు. కానీ... ఎవరు ఎక్కడ రీమేక్ చేసినా అసలు మూలం మాత్రం హాలీవుడ్‌దే. ఈ విషయాన్ని మాత్రం మార్చలేం ఎందుకంటే... ‘వైల్ యు వర్ స్లీపింగ్’ హాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ గా ఉంటుంది మరి!
- బి. జీవన్ రెడ్డి
తెలివైన కాపీ..!
Published Sun, Jul 5 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement