భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన పెళ్లి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. త్వరలో ఈ నిర్ణయం చట్టం రూపం దాల్చుతుంది. బాల్య వివాహాలను నిరోధించడానికి, చిన్న వయసులో గర్భాలను నిరోధించడానికి, యువతుల శారీరక మానసిక ఆరోగ్యాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కొందరు భిన్న రంగాల మహిళా ఆలోచనాపరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?
డిసెంబర్ 15, బుధవారం కేంద్ర కేబినెట్ స్త్రీలకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. వివాహానికి అవసరమైన వయసు 21 సంవత్సరాలుగా ప్రతిపాదించింది. గతంలో ఈ వయసు అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21గా ఉండేది. ఇప్పుడు స్త్రీ, పురుషులకు ఒకే వయసు నిర్ణయించినట్టు అయ్యింది. దీని వల్ల జెండర్ తటస్థత పాటించినట్టు భావిస్తోంది. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఆడపిల్ల వయసు వివాహానికి 18 ఏళ్లు ఉండాలి. ఇస్లాంలో అమ్మాయి ఈడేరిన తర్వాత వివాహానికి యోగ్యురాలిగా భావిస్తారు. స్పెషల్ మేరేజ్ యాక్ట్, 1954 ప్రకారం అబ్బాయి వయసు 21, అమ్మాయి వయసు 18గా ఉంది. తాజా ప్రతిపాదన చట్టం దాలిస్తే 21 ఏళ్లు ఉమ్మడి వయసు అవుతుంది.
బాల్య వివాహాలను నిరోధించేందుకు, యువతుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండటం కోసం, బాలింత–శిశు మరణాల నివారణకు, పోషకాహార సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం చెబుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015–16లో బాల్య వివాహాలు 27 శాతం ఉంటే 2019–20లలో వీటి శాతం 23కు చేరింది. ఈ శాతాన్ని ఇంకా తగ్గించడంలో వివాహ చట్టబద్ధ వయసు పెంపుదల ఉపయోగపడుతోందని భావిస్తోంది.
2020 కమిటీ
స్త్రీల శారీరక పోషక విలువల స్థాయికి, పెళ్లి వయసుకూ మధ్య సమన్వయం, సంబంధం గురించి అంచనాకు రావడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ జయా జైట్లీ అధ్యక్షతన 2020లో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 16 యూనివర్సిటీల విద్యార్థినీ విద్యార్థుల అభిప్రాయాలను తీసుకుంది. అలాగే 15 ఎన్‌జిఓల సహాయంతో గ్రామీణ ప్రాంతాలలోని అన్ని వర్గాల యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించింది. వీటన్నింటి ఆధారంగా కమిటీ యువతుల వివాహ వయసును 21కి పెంచమని రికమండ్ చేసింది. అంతేకాదు అమ్మాయిల చదువు అవకాశాలను పెంచమని, వారి రాకపోకల సౌకర్యాలను పెంచమని, అలాగే ఉపాధికి అవసరమైన ట్రైనింగులను పెంచాలని సూచించింది.
ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన నిపుణుల, ఆలోచనాపరుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
ఆడపిల్లలకు డబ్బు ముఖ్యం అని చెప్పాలి
ఒకప్పుడు డబ్బుకు పెద్ద విలువ ఇవ్వొద్దని తల్లిదండ్రులు చెప్పేవారు. ఇప్పుడు డబ్బుకు విలువ ఇవ్వండని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లకు ఆర్థికంగా తన మీద తాను ఆధారపడే వీలు కల్పించాలి. ఇందుకు బాగా చదివించాలి. వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచడం మంచిది. దాని వల్ల చదువుకుంటారు. ఉద్యోగాలు చేయాలనుకుంటారు. డబ్బు గురించి ఆలోచిస్తారు. కొన్ని వర్గాలలో తల్లిదండ్రులు పనికి వెళ్లాల్సి రావడం వల్ల ఇంట్లో ఆడపిల్లను ఉంచడం ఎందుకు అని పెళ్లి చేస్తున్నారు. పది ఫెయిల్ అయిన ఆడపిల్లకు పెళ్లి తప్పనిసరి అవుతోంది. పెళ్లి చేసి పంపాక అక్కడ అమ్మాయి ఇమడలేకపోతే పుట్టింటి సపోర్ట్ ఉండటం లేదు. అమ్మాయికి తన కాళ్ల మీద తాను నిలబడే ఆర్థిక శక్తి, స్కిల్స్ ఉండటం లేదు. దీని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా కాకుండా వీళ్లను ఉపాధి పొందే ట్రయినింగుల్లోకి మళ్లించాలి. ఆ మేరకు తల్లిదండ్రులకు చైతన్యం కలిగించాలి. చట్టం తేవడం ఒక విషయం అయితే దానిని గట్టిగా అమలయ్యేలా చూడటం ఒక విషయం. ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలి.
– పి.సత్యవతి, రచయిత
పంచాయతీలు జాగ్రత్త తీసుకోవాలి
అమ్మాయి పెళ్లి వయసు 21 పెంచుతూ తీసుకున్న నిర్ణయం మంచిది. దీనిని తల్లిదండ్రులకు, యువతులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలి. ఎలా చేస్తే చట్టబద్ధమో ఎలా చేస్తే చట్టవిరుద్ధమో విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా పల్లెటూళ్లలో పంచాయతీలు అక్కడ జరుగుతున్న పెళ్లిళ్లను గమనించి ఈ నిర్ణయం అమలయ్యేలా చూడాలి. అప్పుడు దాదాపుగా ఈ నిర్ణయం వల్ల ఉపయోగం కలుగుతుంది. గ్రామాల్లో పెళ్లి చేసుకోమనే తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎదిరించడం కష్టసాధ్యమైన పని. అలాంటి వారికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వారు సర్పంచ్ చేతో మరెవరి చేతో ఈ విషయాన్ని చెప్పించి చదువు, ఉపాధిలో రాణించవచ్చు. పెళ్లి వయసు 21 చేయడం అంటే అమ్మాయిలు పరిణితితో నిర్ణయం తీసుకునే వీలు కల్పించడం. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు ఈ వయసు నియమం వల్ల తగ్గితే అదీ మంచిదే.
– ఓల్గా, రచయిత
టీనేజ్‌లో పెళ్లి అయితే హైరిస్క్
పదకొండు నుంచి పదమూడేళ్ల వయసు అమ్మాయిల్లో రుతుక్రమం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశలో వాళ్ల శరీరం గురించి వారికి సరైన అవగాహన ఉండదు. పెద్దవాళ్లు చెప్పరు. పద్దెనిమిది ఏళ్లు నిండగానే పెళ్ళి చేస్తే అవగాహన లేమి కారణంగా త్వరగా గర్భం దాల్చుతుంటారు. టీనేజ్‌లో రక్త హీనత సమస్య ఎక్కువ. ఈ వయసు గర్భవతుల్లో హైబీపీ రిస్క్ కూడా ఎక్కువగా చూస్తుంటాం. దీని వల్ల వీరికి ఫిట్స్ రావడం, నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకని అమ్మాయిలకు తమ శరీరం గురించి, సెక్స్‌ఎడ్యుకేషన్ అవగాహన కల్పించాలి. అప్పుడే లైంగికపరంగా వచ్చే జబ్బుల గురించి కూడా అవగాహన ఉంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగున్నవారు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం గురించి కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. 21 ఏళ్లకు పెళ్లి అయితే పిల్లలు కోసం ప్లానింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తల్లి సరైన జాగ్రత్తలు తీసుకునే అవగాహన ఉంటే, రాబోవు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
– డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్
లక్ష్యానికి రూపం రావాలంటే 21 ఏళ్లు నిండాలి
మా ఊరు మొయినాబాద్ మండలంలోని యత్‌బార్‌పల్లి. మా ఊళ్లో పద్దెనిమిదేళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లి చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉంటుంది. దానికి ఒక రూపం రావాలంటే డిగ్రీ వరకు చదువుకోవాలి. మా ఇంట్లో కూడా నీకు పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేస్తాం అన్నారు. కేంద్రప్రభుత్వం అమ్మాయిలకు పెళ్లివయసు 21 ఏళ్లు చట్టం తీసుకువస్తుందని వినగానే చాలా సంతోషం వేసింది. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఈ విషయం తెలియాలి. మా కాళ్ల మీద మేం నిలబడాలి. నేనిప్పుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. డిగ్రీ చేసి, జాబ్ తెచ్చుకోవాలి. మా అమ్మనాన్నలను మంచిగా చూసుకోవాలి. నాకో తమ్ముడు ఉన్నాడు. కానీ, అమ్మనాన్నల బాధ్యత నాది కూడా. జాబ్ చేయాలి అలాగే వ్యవసాయం కూడా చేయాలి. మా నాన్న రైతు. నేనూ పొలం పనులు చేస్తుంటాను. రైతుల కష్టాలు చూస్తూ పెరిగాను కాబట్టి, రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నది నా లక్ష్యం.
– బి.భవానీ, విద్యార్థిని
చట్టం సరే... చైతన్యం ఇంకా మంచిది
ఉత్తరాది రాష్ట్రాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి దక్షిణాదితో పోలిస్తే. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు. కింది వర్గాలలో కూడా బి.టెక్, ఎంటెక్‌లు చేస్తున్నారు. 18 ఏళ్లు అంటే చదువు విషయంలో అటూ ఇటూ కాని వయసు. 21కి పెళ్లి వయసు పెంచడం వల్ల చదువు కొనసాగించి ఉద్యోగాల్లోకి వెళ్లే వీలుంటుంది. ఆ మేరకు ఈ నిర్ణయం మంచిది. అయితే ఈ విషయాన్ని చట్టం తెచ్చి చెప్పడం కన్నా చైతన్యం చేయడం ద్వారా చెప్తే బాగుంటుంది. ఒక రకంగా ఇప్పుడు పెళ్లిళ్లు అయ్యే సరికి అమ్మాయికి కొన్ని వర్గాల్లో 24 వస్తోంది. 20 ఏళ్లకు పెళ్లి చేయాలన్నా అబ్బాయిలు సెటిల్ కాకపోవడం వల్ల పెళ్లికొడుకు దొరకని పరిస్థితి ఉంది. 20 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లకే ఇప్పటి విద్య, ఉపాధి, సామాజిక పరిస్థితులు దారి తీస్తున్నాయి. మిగిలిన వర్గాల్లో ఎర్లీ మేరేజస్ తగ్గించాలంటే చైతన్యస్థాయిని పెంచడం ఇంకా మంచి మార్గం అని నా అభిప్రాయం.
– ముదిగంటి సుజాతా రెడ్డి, రచయిత
డిగ్రీ చదువు పూర్తవ్వాలి
నా మనవరాలికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చాక పెళ్లి అయ్యింది, ఇప్పుడు పిల్లలు. ఉద్యోగం చేసుకుంటూ, కుటుంబాన్ని చక్కదిద్దుకుంటోంది. ఏ సమస్య అయినా పరిష్కరించుకోగలదు. నా రోజుల్లో స్కూల్ చదువు పూర్తికాగానే పెళ్లి చేసేశారు. దీంతో కాలేజీ చదువులు చదువుకోలేకపోయాను. పెళ్లయ్యాక బాధ్యతల్లోనే జీవితమంతా గడిచిపోయింది. మా అమ్మాయికీ పెద్దవాళ్ల జోక్యంతో చిన్న వయసులోనే పెళ్లి చేశాను. తన సమర్థత వల్ల పెళ్లి తర్వాత కూడా చదువుకుంది, బ్యూటీషియన్‌గా ఎదిగింది. అందరికీ ఆ అవకాశం ఉండదు. సాధారణంగా అమ్మాయిల బాధ్యత త్వరగా తీర్చుకోవాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, అమ్మాయి అత్తింటికి వెళ్లాక అక్కడ పరిస్థితులకు ఇమడలేకపోయినా, జీవితాన్ని చక్కదిద్దుకునే సామర్థ్యం లేకపోయినా కుటుంబానికి, తనకూ అన్యాయమే జరుగుతుంది. ఆడ–మగ ఇద్దరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆనందంగా బతకాలంటే అవగాహన కూడా రావాలి. అందుకని, డిగ్రీ చదువు పూర్తయ్యాక అమ్మాయికి పెళ్లి అయితే అన్ని విధాల బాగుంటుంది.
– తుమ్మ సత్యవతి, గృహిణి
కలలు నెరవేరాకే పెళ్లి
ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లలకు జీవితంలో సాధించాల్సిన కలలు ఎన్నో ఉంటాయి. కానీ, పెళ్లి కారణంగా పెద్దవాళ్లు ఆ కలలను చంపేస్తున్నారు. బయట అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తల్లిదండ్రుల భయాలకు కారణం అవుతున్నాయి. దీని వల్లే అమ్మాయిలకు పద్దెనిమిది నిండకుండానే పెళ్లి చేసి భారం దించుకున్నాం అనుకుంటున్నారు. చిన్నవయసులో పిల్లలు పుట్టినా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. అలాగే, ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మాది రంగారెడ్డి జిల్లాలోని తోల్‌కట్ట అనే ఊరు. పేదింటి అమ్మాయిని. నాన్న ఊరూరు తిరుగుతూ పాతబట్టలు తీసుకొని, కొత్త ప్లాస్టిక్ టబ్బులు అమ్ముతుంటారు. వాటిని సేకరించుకుని వస్తే మేం అవన్నీ ఇంటి వద్ద సపరేట్ చేసి, మరొకరికి ఇచ్చి డబ్బులు తీసుకుంటాం. మా అమ్మనాన్నలకు నేను అన్నయ్య, తమ్ముడు సంతానం. నాకూ పెళ్లి చేస్తామన్నారు. కానీ, నేను బతిమాలుకున్నందుకు నన్ను కాలేజీకి పంపిస్తున్నారు. ఇంకో ఏడాదిలో పెళ్లి చేస్తామన్నారు. నాకు పోలీస్ అవ్వాలన్నది కల. ఇప్పుడు ఈ చట్టం వస్తే నా కల నెరవేరుతుంది.
– నిఖిత, విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment