రూప పుట్టగుంట, శుభా తటవర్తి
యూఎస్‌లోని ఉన్నతస్థాయి బాధ్యతల్లోకి భారత సంతతి మహిళలు రావడం ఇటీవలి కాలంలో సాధారణం అయింది! స్త్రీ సాధికారతకు ఇది శుభరూప తరుణంలా కనిపిస్తోంది. తాజాగా రూప రంగ పుట్టగుంట ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయ్యారు. శుభా తటవర్తి విప్రో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదవి చేపట్టనున్నారు.
రూప రంగ పుట్టగుంట ప్రస్తుతం వాషింగ్టన్ ‘డీసీ రెంటల్ హౌసింగ్ కమిషన్’ అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆమెను వాషింగ్టన్ డీసీ జిల్లా ఫెడరల్ జడ్జిగా నామినేట్ చేశారు. ఆమె ఎంపికను సెనెట్ ఆమోదిస్తే కనుక అమెరికాలో ఫెడరల్ జడ్జి అయిన తొలి భారత సంతతి మహిళగా రూప గుర్తింపు పొందుతారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కావడానికి ముందు 2013 నుంచి 2019 వరకు ఆమె క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నారు.
రూపతోపాటు మరో తొమ్మిది మందిని అత్యున్నస్థాయి న్యాయ సంబంధ స్థానాలకు నామినేట్ చేసిన వైట్ హౌస్.. ‘‘ఉన్నత అర్హతలు, సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ నిష్ణాతులు అమెరికాలోని భిన్నజాతుల ప్రజలకు ప్రయోజనకరమైన సేవలను అందిస్తారని అమెరికా అధ్యక్షుడు బలంగా విశ్వసిస్తున్నారు..’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. రూపకు ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా కూడా రెండేళ్ల పాటు అనేక కేసులను పరిష్కరించిన అనుభవం ఉంది. 2008 నుంచి 2011 వరకు ఆమె లా క్లర్క్‌గా పని చేశారు. 2007లో ఒహియో స్టేట్ మోర్టిజ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ‘లా’లో పట్టభద్రురాలయ్యారు.
ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్న సీనియర్ టెకీ శుభా తటవర్తి మంగళవారం విప్రో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సి.టి.ఓ.) గా నియమితులయ్యారు. వాల్‌మార్ట్ నుంచి విప్రోకి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్‌లో పదేళ్లు సేవలు అందించారు. వాల్‌మార్ట్‌లో సీనియర్ డైరెక్టర్‌గా, పేపాల్‌లో హెడ్ ఆఫ్ ప్రాడక్ట్‌గా ఆమె అనుభవం విప్రో సి.టి.వో. అయేందుకు తోడ్పడింది. రూప కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment