భారతీయ గృహాలలో నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. సొంత బ్యాంకు ఖాతాలున్న స్త్రీల సంఖ్య హెచ్చుతోంది. దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది. ఇళ్ళలో కాకుండా ఆరోగ్య వసతులున్నచోట శిశు జననాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. అదే సమయంలో స్త్రీలలో నూటికి 30మంది పదిహేనో ఏట నుంచే భౌతిక హింసకు గురవుతున్నారు. అయినా వారిలో 77 శాతం మంది నోరు విప్పలేక, గృహహింసను గుట్టుగా భరిస్తున్నారు. కొండను అద్దంలో చూపుతూ ‘5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5) తన జాతీయ నివేదికలో ప్రస్తావించిన వెలుగునీడలివి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన ఈ నివేదిక దేశంలో మారుతున్న ధోరణులను ప్రతిఫలిస్తూనే, మరింత పురోగతికి అవసరమైన వ్యూహాల గురించి అప్రమత్తం చేస్తోంది. తాజాగా వెల్లడైన సమాచారం అందుకే అంత కీలకమైనది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, తదితర అంశాలకు సంబంధించి విశ్వసనీయ, తులనాత్మక సమాచారం అందించడం ‘ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్’ ప్రధాన ఉద్దేశం. అందుకే వరుసగా అనేక విడతల్లో ఈ సర్వే చేస్తుంటారు. ఆ వరుసలోదే ఈ 5వ సర్వే. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో (2017 మార్చి నాటికి) 6.37 లక్షల ఇళ్ళను శాంపుల్‌గా తీసుకొని, ఈ సర్వే సాగింది. అలా జిల్లా స్థాయి వరకు ఉన్న పరిస్థితిని ప్రతిఫలించే ప్రయత్నం సాగింది. ఆ సర్వే తాలూకు జాతీయ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు విడుదల చేసింది. మునుపటి ‘ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–4’ (2015–16) నాటికీ, ఆ తర్వాతి ‘ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్–5’ (2019–21) నాటికీ మధ్య వివిధ అంశాల్లో జరిగిన పురోగతికి ఈ తాజా నివేదిక ఓ దర్పణం.
గత విడత సర్వేతో పోలిస్తే, ఈ సర్వే పరిధిని విస్తరించారు. మరణాల నమోదు, ప్రీ–స్కూల్ చదువు, పిల్లల టీకాకరణ విస్తరణ, ఋతుక్రమ పరిశుభ్రత, ప్రతి ఒక్కరిలో బీపీ – షుగర్ లాంటి అనేక అంశాల సమాచారం సేకరించారు. తద్వారా ఇప్పటికే అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకూ, పటిష్ఠీకరణకూ వీలుంటుంది. అవసరాన్ని బట్టి విధానపరంగా కొత్త వ్యూహాలను సర్కారు సిద్ధం చేసుకోగలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించిన సూచికల్లో ఎంతో కొంత మెరుగుదల సాధించాయన్నది ఈ 5వ సర్వే లెక్క. సొంత ఆరోగ్య సంరక్షణ, ప్రధానమైన వస్తువుల కొనుగోలు, బంధువుల సందర్శన – ఇలా ఇంటికి సంబంధించి 3 ప్రధాన అంశాల్లో వివాహిత మహిళల నిర్ణయాత్మక భాగస్వామ్యం ఇప్పుడు పెరిగిందని సర్వే మాట. సొంతంగా వాడుకొనే బ్యాంక్, లేదా పొదుపు ఖాతా ఉన్న ఆడవారి సంఖ్య గత నాలుగేళ్ళలో 53 నుంచి 79 శాతానికి పెరగడం చెప్పుకోదగ్గ విశేషం.
మతాలకు అతీతంగా మహిళలు ఇప్పుడు తక్కువమంది సంతానానికే జన్మనిస్తున్నారు. అలా దేశ జనాభా వృద్ధి నిదానిస్తోందని ఈ సర్వే తీపి కబురు చెబుతోంది. గతంలో మహిళల మొత్తం సంతాన సాఫల్య రేటు (టీఎఫ్‌ఆర్ – సగటున ప్రతి మహిళా తన జీవితకాలంలో జన్మనిచ్చే శిశువుల సంఖ్య) జాతీయస్థాయిలో 2.2 కాగా, ఇప్పుడది 2కు తగ్గింది. అన్ని మతాల స్త్రీలలోనూ తగ్గుదల కనిపించగా, ముస్లిమ్ స్త్రీలలో ఆ రేటు 2.62 నుంచి 2.36కు సర్రున పడిపోయింది. ఇది సర్వే చెబుతున్న సత్యం. అసలిప్పటి దాకా సాగిన 5 విడతల సర్వేలనూ పరిశీలిస్తే, సంతాన సాఫల్య రేటు హిందువుల (41.2 శాతం) కన్నా ముస్లిమ్‌లలోనే (46.5 శాతం) ఎక్కువగా తగ్గిందన్నది గమనార్హం. అంటే, సమీప భవిష్యత్తులో ఈ దేశంలో హిందువుల కన్నా ముస్లిమ్‌ల సంఖ్య మించిపోతుందంటూ దుష్ప్రచారంతో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నవారి మాటలన్నీ వట్టి డొల్లవే అన్నమాట.
అక్షరాస్యులా, నిరక్షరాస్యులా అన్న దాన్ని బట్టి సంతాన సాఫల్య రేటు ఉంటోందన్నది మరో కీలక అంశం. చదువుకున్న మహిళల్లో ఆ రేటు తక్కువగా ఉంటోందంటే, కుటుంబ నియంత్రణను పాటించడంలో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీ పురుషుల్లో దాదాపు అందరికీ కుటుంబ నియంత్రణ విధానాలపై అవగాహన ఉందట. అయితే, 56.4 శాతమే వాటిని పాటిస్తున్నారు. అంటే, సామాజికంగా, ఆర్థికంగా దిగువ శ్రేణి వారిలో ప్రభుత్వాలు మరింత చైతన్యం తేవాలన్నమాట. అలాగే, ఇవాళ్టికీ దేశంలో గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆడవారి పనే అన్న భావన ఉన్నట్టు సర్వే చాటింది. ఆ బాధ్యత తమకు లేదన్న పురుషుల భావన ఏళ్ళ తరబడిగా సమాజంలో మారని ఆధిపత్య ధోరణికీ, లింగ దుర్విచక్షణకూ మచ్చుతునక. హరియాణా, హిమాచల్‌లతో పోలిస్తే పంజాబ్‌లో బాల్య వివాహాలు తగ్గనే లేదు. ఈ వైఖరిని మార్చేందుకు ప్రభుత్వ ప్రచారోద్యమాలు తప్పవు.
రెండేళ్ళ లోపు వయసు పిల్లల్లో పూర్తిగా టీకాలు వేయించుకున్నవారి శాతం ఒకప్పుడు 62. గత నాలుగేళ్ళలో అది 77 శాతానికి పెరిగింది. ఆ వయసు పిల్లల్లో నాలుగింట మూడొంతుల మందికి పైగా టీకాలు పూర్తిగా అందుతున్నాయనడం సంతోషకరమే. అదే సమయంలో స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. మన జీవనశైలిలో రావాల్సిన మార్పులను ఇది మరోసారి గుర్తు చేస్తోంది. మొత్తం మీద, దేశం అందుకోవాల్సిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించి ఈ 5వ విడత సర్వే అందించిన 34 సూచికల డేటా ప్రభుత్వాల భవిష్యత్ కార్యాచరణకు కరదీపిక. ఇక, రానున్న 2023–24లో జరిగే 6వ సర్వే మరింత లోతైన సమాచారం అందిస్తుందని ఆశించవచ్చు.
సంతోషాలు... సవాళ్ళు...
Published Tue, May 10 2022 3:08 AM | Last Updated on Tue, May 10 2022 9:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment