దంబుల్లా: ఫామ్ కోల్పోయి వన్డే ప్రపంచ కప్ జట్టుకు దూరమైన జెమీమా రోడ్రిగ్స్ ఇప్పుడు టి20ల్లో పునరాగమనంతో సత్తా చాటింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రదర్శనతో గురువారం జరిగిన తొలి టి20లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
మరో ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 31; 4 ఫోర్లు) కూడా రాణించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), ఆంధ్రప్రదేశ్ బ్యాటర్ సబ్బినేని మేఘన (0) విఫలం కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. చివర్లో దీప్తి శర్మ (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడింది.
లంక బౌలర్లలో ఇనొక రణవీర 3, ఒషాది రణసింఘే 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లంతా సమష్టిగా కట్టడి చేయడంతో చేతిలో వికెట్లున్నా ఛేదనలో శ్రీలంక వెనుకబడిపోయింది. రాధా యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇదే వేదికపై ఇరు జట్ల మధ్య రేపు రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది.
చదవండి: IRE Vs IND T20 Series: ఆ ఐదుగురు ఆటగాళ్లతో జర జాగ్రత్త.. లేదంటే టీమిండియాకు కష్టమే..!
Comments
Please login to add a commentAdd a comment