న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు.
‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్‌లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
అందరినీ కలుపుకొనిపోయేలా
జీ20 సదస్సు
‘సెపె్టంబర్‌లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్‌లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు.
తెలుగు కూడా ప్రాచీన భాషే
‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment