
అమెరికాలోనూ మనోళ్లే టార్గెట్
చైన్ స్నాచర్ల బారిన పడుతున్న భారత మహిళలు
సాక్షి, హైదరాబాద్: ఇక్కడే కాదు... అమెరికాలోనూ చైన్ స్నాచర్ల టార్గెట్ భారత మహిళలేనట! మూడు నెలల్లో అక్కడ మొత్తం 13 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైతే అందులో 11 మంది భారత సంతతికి చెందిన మహిళలే బాధితులు. అమెరికాలోని ఫ్రీమాంట్ పోలీసు విభాగ అధికారిణి జెనీవా బొస్క్వస్ ఇటీవల ఈ వివరాలు వెల్లడించారు. షాపింగ్ ప్రాంతాలతో పాటు నివాస సముదాయ పరిసరాల్లో నడుచుకొంటూ వెళుతన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసుల చోరీలకు తెగబడుతున్నారన్నారు. బాధితుల్లో ఎక్కువగా ఇండో-అమెరికన్ మహిళలే ఉన్నారన్నారు.
‘బరువైన’ నగలపై గురి...
భారత సంస్కృతి ప్రతింబింబించేలా ఇండో-అమెరికన్ మహిళలు అధిక బరువుండే బంగారు గొలుసులు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. వీటి విలువ మార్కెట్‌లో 300 నుంచి 3,000 డాలర్లు ఉంటోంది. దీంతో వీటిపై చైన్ స్నాచర్లు కన్నేశారు. ఇలాంటి మహిళలనే టార్గెట్ చేసి కొట్టేసిన నగలను గుర్తింపునడగని షాపుల్లో సులువుగా అమ్మేస్తున్నారు. ఫ్రీమాంట్ హబ్ షాపింగ్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళుతుండగా బైక్‌పై వచ్చిన దుండగులు తన మెడలోని గొలుసు లాక్కెళ్లారని ఓ భారత సంతతి మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన ఆఫ్రికన్ మెడలో గొలుసు తెంపుకొని వెళ్లాడనేది మరో మహిళ ఫిర్యాదు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను దుస్తుల లోపల ధరించాలని బొస్క్వస్ సూచిస్తున్నారు.