స్టోరీ టెల్లర్: వారణాసి వినయ్
‘అన్నం గురించి చెప్పండి’ అని అడిగితే... ‘రోజూ తింటాం’ అనేవాళ్లే ఎక్కువ. ‘మీకు తెలిసిన వరివంగడాల గురించి చెప్పండి’ అని అడిగితే... ఒకటి, రెండు మాత్రమే చెప్పేవాళ్లు ఎక్కువ. అంతేనా! ‘కాదు... ఎంతో ఉంది’ అంటున్నాడు బెంగళూరుకు చెందిన ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ వినయ్ వారణాసి. భారతీయ సంస్కృతిలో అన్నం, సంప్రదాయ వరి ధాన్యాల ప్రాముఖ్యతను చెబుతున్న వినయ్ ప్రసంగాలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి.
మనం ఎప్పుడూ వినని కొత్త కథలు కాదు. అయితే వాటిని కొత్తగా ఎలా చెప్పవచ్చో వినయ్ ప్రసంగాలు వింటే అర్థం అవుతుంది. అన్నంతో సంబంధం ఉన్న వివిధ ఆచారాలు, వాటి పట్ల రుషులకు ఉన్న భక్తి, మనిషి జీవితాన్ని నిలబెట్టడంలో దాని విలువైన పాత్ర, దైవత్వానికి దాని ప్రతీకాత్మక సంబంధం గురించి వివరిస్తాడు.
అన్నదానం చేసే ప్రక్రియను పౌరాణిక కథల ద్వారా చెబుతాడు. ‘మన దేశంలో బియ్యం అనేది సామాజిక, ఆర్థిక కరెన్సీ’ అంటున్న వినయ్ ‘స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్’ అనే సంస్థతో కలిసి బడులను నుంచి వ్యవసాయ కళాశాలల వరకు వరి ధాన్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
‘ఎన్నో రకాల వరి వంగడాలను పునరుద్ధరించడంపై మేము దృష్టి సారించాం. ప్రతి దానికి దాని ప్రత్యేకమైన ఆకృతి. రంగు, వాసనకు పేరు ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు కన్యాకుమారిలో కనిపించే అనికొంబస్ ఇప్పుడు అంతరించిపోయింది. అనేక దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి’ అంటుంది ‘స్పిరిట్ ఆఫ్ ఎర్త్’ ఫౌండర్ షీలా బాలాజి. ప్రాచీన వరి వంగడాల పునర్జీవానికి వాటి గురించి అవగాహన కలిగించడం అనేది కీలకం.
హైబ్రిడ్ వరి వంగడాల వైపు ఎక్కువగా దృష్టి సారించడం వల్ల అనేక సంప్రదాయ వరి రకాలు క్షీణించాయి. ఎక్కువమంది ఈ పురాతన రకాలపై ఆసక్తి చూపితే సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతుంది. పెరిగిన డిమాండ్ మన వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడుతుంది. దీనికి అవగాహన కల్పించడం అవసరం. ఆ పనిని సగర్వంగా భుజాల కెత్తుకున్నాడు వినయ్ వారణాసి.
ఇక వినయ్ మల్టీ టాలెంట్ విషయానికి వస్తే... ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్ మాత్రమే కాదు ఆర్కిటెక్ట్, డిజైన్ రిసెర్చర్, క్లాసిక్ మ్యూజిక్ లిరిసిస్ట్, డిజైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘అన్‌బైండ్’ ఫౌండర్.
Comments
Please login to add a commentAdd a comment