మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి | Mahalaksmiki Aarti Diwali offer | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి

Published Thu, Oct 16 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి

మహాలక్ష్మికి హారతి ఇవ్వడమే దీపావళి

సందర్భం- 23న దీపావళి
 
భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ పరమార్థంతోనే ఏర్పడ్డాయి. అందుకనే పైకి కనిపించే వేడుకలు, వినోదాలతోనే సరిపుచ్చకుండా పండుగలలోని అంతరార్థాన్ని తెలుసుకుని మరీ వాటిని జరుపుకోవాలి. శరదృతువు అయిన ఆశ్వయుజ, కార్తిక మాసాలలో వచ్చే పెద్ద పండుగలు దసరా, దీపావళితో పాటు మరికొన్ని పండుగలు మన బాధ్యతలను గుర్తు చేస్తాయి.
 
ధనత్రయోదశి

ధర్మశాస్త్ర గ్రంథాలలో దీన్ని యమదీప త్రయోదశి అని చెప్పారు. కొన్ని పురాణాలు, బౌద్ధమతాచారాల సమ్మేళనంతో ధనత్రయోదశిగా మారింది. దానికి రెండు కథనాలున్నాయి. ఒక యువరాణి తన భర్తకు ఈ తిథినాడు రాసిపెట్టి ఉన్న మరణాన్ని తప్పించటానికి ఇల్లంతా దీపాలు వెలిగించింది. నగలు కుప్పలుగా పోసింది. ఆ వెలుగులో దారి కనపడక యముడు వెనక్కు వెళ్లిపోయాడు. అందరూ ఈ రోజు ఇలా చేస్తే ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్థిల్లుతారు. కనుక ఇది ధనత్రయోదశి అయింది. ధన్వంతరి పాలసముద్రం నుంచి ఈ రోజు అమృతాన్ని పైకి తెచ్చాడు కాబట్టి ఆయన పేరిట ఇది ధనత్రయోదశి అయింది. ఈ రోజు దీపం పెట్టటం, లక్ష్మీపూజ, శక్తిని బట్టి బంగారం, వెండి, నూతన వస్తువులు ఎంతైనా కొనుగోలు చేయవచ్చు.
 
నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి పండుగ జరుపుకోవాలి. పండుగల తిథులన్నిటిలో ఒక దుర్మార్గుడి పేరుతో ఏర్పడిన ప్రత్యేకత నరక చతుర్దశికే ఉంది! స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారిని శిక్షించి తీరాలనే సందేశాన్ని ఇచ్చే పండుగ నరకచతుర్దశి.
 
భూదేవి తల్లి అయినా, పుట్టినవాడు ప్రజాకంటకుడు అయ్యాడు. నరకుడు అంటే నరులను ప్రేమించేవాడు అనే అర్థంతో తల్లిదండ్రులు పేరు పెడితే నరులను పీడించేవాడు అనే అర్థాన్ని తెచ్చుకున్నాడు. ‘అసుర’ బిరుదును కూడా కలుపుకుని నరకాసురుడు అయ్యాడు. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మించింది. భూలోకంలో నరకాసురుడిగా అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్న తన కుమారుడిని శిక్షించడానికి భర్తతో పాటు ఆమె కూడా యుద్ధానికి వెళ్లింది. శ్రీకృష్ణుని కంటే మరింత చొరవను, పరాక్రమాన్నీ చూపించింది. నిర్దాక్షిణ్యంగా నరకాసురుడిని సంహరించింది. ఆ దుర్మార్గుని మరణానికి ప్రజలతోపాటు తాము కూడా ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకున్న ఆదర్శప్రాయులైన తల్లిదండ్రులు సత్యభామాశ్రీకృష్ణులు.
 
దీపావళి

ఆశ్వయుజ అమావాస్యనాడు దీపావళి పండుగ. దీపం నుంచి దీపాన్ని వెలిగించినట్లు తరాల మధ్య అంతరాలు ఉన్నా ఒకే వెలుగు కొనసాగుతుండాలని పరమార్థం. దీపావళినాడు మహాలక్ష్మిపూజ ప్రధానం. అసలైతే అమ్మవారి దగ్గర, ఇంటిముందు, దేవాలయాల్లో; ఏనుగులు, గుర్రాలు, గోవులు ఉండేచోట దీపాలు వెలిగించడమే అసలైన దీపావళి పండుగ.
 
దీపావళినాడు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆమె మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో ఉన్న ఆమె అక్కగారిని సాగనంపాలి. ఆమెపేరు జ్యేష్ఠాదేవి. ఆమెను వెళ్లగొట్టేందుకు స్త్రీలు చీపురు, చేట పట్టుకుని చప్పుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో చెప్పిన ఈ విషయంలో స్వచ్ఛత, పరిశుభ్రత సంపదలకు మూలమనే శాశ్వత సత్యం దాగుంది. ఈ ఆశ్వయుజ అమావాస్య పిల్లల్ని, పెద్దల్ని, స్త్రీ, పురుషుల్ని చీకటిలోంచి వెలుగులోకి నడిపిస్తుంది.
 
కార్తీకం-పాడ్యమి

కార్తికమాసంలోవచ్చే శుద్ధ పాడ్యమికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నట్లు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో మొదటిది గోక్రీడనం. ఈ పాడ్యమినాడు గోపూజ చేస్తే పశుసంపద వర్థిల్లుతుంది. పాడిపంటలకు లోటు ఉండదు. ఇందులో భాగం గా ఉదయాన్నే ఆవులకు నీరాజనం ఇవ్వాలి. సాయంకాలం ఆవుల మెడలో పూలదండలు వేసి పూజించాలి. అలాగే ఆవుపేడతో గోవర్ధన పర్వతాన్ని చేసి పాడ్యమి పొద్దున దాన్ని పూజించాలి. పాడ్యమి మధ్యాహ్నం రెల్లుగడ్డితో పేనిన తాడును తూర్పు దిక్కున గల స్తంభానికి కట్టి పూజించాలి.
 
భగినీహస్త భోజనం

కార్తిక శుద్ధ ద్వితీయను యమద్వితీయ (విదియ) అంటారు. ఆ రోజున యమున తన సోదరుడైన యముడికి భోజనం పెట్టింది. కాబట్టి కార్తిక శుద్ధ విదియనాడు అన్నదమ్ములు తప్పకుండా అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనం తిని రావాలి. దీనినే భగినీహస్త భోజనం అంటారు.
 
ధర్మరాజు వంటి మహానుభావునికి కూడా భీష్మాదులు, మహర్షులు ఈ ధర్మాచరణను బోధించారు. ఉత్తములు ఆచరిస్తే సామాన్యులు కూడా వారి దారిలో నడుస్తారు. అందుకే కార్తిక శుద్ధ ద్వితీయ (విదియ) నాడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తప్పకుండా భోజనం చేసి, వస్త్రాభరణాలతో సత్కరించి రావాలని ధర్మరాజుకు వివరించారు.
 
- డా॥పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
 
 సరసిజ నిలయే సరోజ హస్తే
 ధవళ తరాంకుశ గంధమాల్యశోభే
 భగవతి హరివల్లభే మనోజ్ఞే
 త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్... అనే శ్లోకంతో శ్రీమహాలక్ష్మిని పూజించి దీపాలు వెలిగిస్తే సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతారని, ‘దీపైః నీరాజనాదత్ర సైషా దీపావళిః’... అంటే దీపాలు వెలిగించడం, మహాలక్ష్మి అమ్మవారికి హారతులు ఇవ్వడమే దీపావళి అనీ  ధర్మశాస్త్రం చెబుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement