ICC Women's World Cup 2022: South Africa Second Team To Enter Semi Finals - Sakshi
Sakshi News home page

World Cup 2022: సెమీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్‌ చేరాలంటే!

Published Fri, Mar 25 2022 7:55 AM | Last Updated on Fri, Mar 25 2022 10:52 AM

South Africa second team to enter semi finals - Sakshi

వెల్లింగ్టన్‌: మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గురువారం వెస్టిండీస్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌ వర్షార్పణం కావడం ఆ జట్టుకు మేలు చేసింది. వాన వల్ల మ్యాచ్‌కు 26 ఓవర్లకు కుదించగా ఒక దశలో  సఫారీ స్కోరు 22/4 వద్ద నిలిచింది. ఆట ఆగిపోయే సమయానికి ఆ జట్టు 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 61 పరుగులు చేసింది. మళ్లీ వర్షం కురవడంతో ఇక మ్యాచ్‌ తిరిగి మొదలయ్యే అవకాశమే రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి  ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. మెగా ఈవెంట్‌లో రద్దయిన మ్యాచ్‌ ఇదొ క్కటే! దీని వల్ల 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరగా వెస్టిండీస్‌ 7 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఇంగ్లండ్‌ సునాయాస విజయం 
క్రైస్ట్‌చర్చ్‌: ఇంగ్లండ్‌ అమ్మాయిల జట్టు పాక్‌పై సునాయాస విజయంతో సెమీస్‌ వైపు అడుగులేస్తోంది. గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట పాక్‌ 41.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. సీమర్‌ క్యాథరిన్‌ బ్రంట్‌ (3/17), స్పిన్నర్‌ సోఫీ (3/18) పాక్‌ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. వీళ్లిద్దరి దెబ్బకు... ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (32; 4 ఫోర్లు), సిద్రా నవాజ్‌ (23; 1 ఫోర్‌) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలోనే వికెట్‌ మాత్రమే కోల్పోయి 107 పరుగులతో ఛేదించింది. ఓపెనర్‌ డానీ వ్యాట్‌ (76 నాటౌట్‌; 11 ఫోర్లు) కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ (24 నాటౌట్‌) రాణించారు. 

తప్పనిసరిగా గెలవాల్సిందే! 
భారత జట్టు సెమీస్‌ చేరాలంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మిథాలీ సేన ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. సఫారీని ఓడిస్తే వెస్టిండీస్‌ (7)ను వెనక్కి నెట్టి 8 పాయింట్లతో జట్టు ముందంజ వేస్తుంది. ఇంగ్లండ్‌ ఖాతాలో కూడా 6 పాయింట్లే ఉన్నప్పటికీ వారికి ఆఖరి పోరులో ఎదురయ్యేది కూన బంగ్లాదేశ్‌ కావడంతో ఇంగ్లండ్‌కూ మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు ఒకే రోజు ఉన్నాయి. అయితే మన మ్యాచ్‌ కూడా వర్షం వల్ల రద్దయితే అప్పుడు భారత్, విండీస్‌ ఖాతాలో 7 పాయింట్లుంటాయి. అప్పుడు విండీస్‌కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న భారత్, ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మన జట్టు పూర్తి సత్తాను ప్రదర్శించాల్సి ఉంది.

చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement