Laser Technology
-
అంతరిక్ష యుద్ధంలో చల్లగా చావు దెబ్బ
అంతరిక్ష యుద్ధంలో చైనా నానాటికీ దూసుకుపోతోంది. ఇంధన ఆయుధ పరిజ్ఞానంలో అతి గొప్ప పురోగతి సాధించినట్లు చైనా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక కూలింగ్ సిస్టం ఒకదాన్ని కనిపెట్టినట్టు చంగ్ షాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత హెచ్చు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్లను పెద్దగా వేడెక్కనేయకుండా, నిరంతరం శక్తివంతంగా, ఎంతటి పెను దాడికైనా నిత్యం సిద్ధంగా ఉంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని వర్సిటీ వర్గాలను ఉటంకిస్తూ సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఈ విధానం సఫలమైందన్న వార్త నిజమైతే చైనా అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలు అతి శక్తివంతమైన లేజర్ కిరణాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విచ్చలవిడిగా ప్రయోగించగలవు. అప్పుడిక యుద్ధం తీరు తెన్నులే సమూలంగా మారిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేíÙంచాయి. పరిశోధన వివరాలను చైనీస్ జర్నల్ ఆక్టా ఆప్టికా సైనికాలో ప్రచురితమయ్యాయి. వేడే అసలు శత్రువు ఇలాంటి అతి శక్తివంతమైన లేజర్ ఆయుధాలను ప్రయోగించే క్రమంలో భరించలేనంత వేడి ఉద్భవిస్తుంది. ఇది సదరు ఆయుధాలకే తీవ్రంగా నష్టం చేస్తుంది. దీంతో ఆయుధం పాడవకుండా ఉండేందుకు ఆ వేడిని సంపూర్ణంగా తట్టుకునే కూలింగ్ వ్యవస్థను కనిపెట్టినట్టు చైనా చెబుతోంది. లేజర్ ఆయుధాల అభివృద్ధిలో ఇలా వాటిని చల్లబరచడమే అతి పెద్ద సాంకేతిక సవాలు. అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... ఇలాంటి అత్యాధునిక లేజర్ ఆయుధ వ్యవస్థల తయారీలో అమెరికా చాలాకాలంగా ఎంతో ముందుంది. నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రా రెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రయోగించినప్పుడు అద్భుతాలు చేశాయి. శబ్ద వేగాన్ని మించి దూసుకుపోగల సూపర్ సానిక్ క్షిపణులను సైతం ధ్వంసం చేసి చూపించాయి. అయితే భారీ పరిమాణం, బరువు కారణంగా వాటిని అటకెక్కించారు. పైగా వాటి పరిధి మహా అయితే కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ లేజర్ కాంతి పుంజం విధ్వంసక శక్తిని ఎన్నో రెట్లు పెంచినట్లు లేజర్ కాంతిపుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ బృందం చెబుతోంది. స్పేస్ ఎక్స్ పైకీ ప్రయోగం? కూలింగ్ సిస్టమ్ సాయంతో పనిచేసే ఈ అధునాతన లేజర్ క్షిపణి వ్యవస్థ సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే చాలా చవకైనది. ఎంతో ప్రభావవంతమైనది కూడా. పైగా దీన్ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే స్పేస్ ఎక్స్ తాలూకు స్టార్ లింక్ వంటి ఉపగ్రహ వ్యవస్థల పైకి ఈ లేజర్ ఆయుధాలను ప్రయోగించే యోచనలో చైనా ఉన్నట్టు చెబుతున్నారు. హెచ్ యు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధాల ప్రయోగం విషయంలో ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు –లేజర్ కాంతి పుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ షెంగ్ ఫు –సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ
న్యూఢిల్లీ: 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎర్ర కోట సమీపంలో శనివారం మోహరించారు అధికారులు. ఈ లేజర్ వెపన్ ఆకాశంలో 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడమే కాక జామ్ చేయగలదు. అలానే 1-2.5 కిలోమీటర్ల దూరంలోని లేజర్ వెపన్ టార్గెట్లను వాటేజ్‌ను బట్టి చేధించగలదని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ, ఉత్తర భాగాలలో పెరిగిన డ్రోన్ ఆధారిత కార్యకలాపాలకు ఇది తగిన సమాధానం అవుతుందని భావిస్తున్నామన్నారు అధికారులు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను గుర్తు చేసుకుని వారికి నివాళులు ఆర్పించారు. ‘ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత మాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన లక్షలాది మంది కుమారులకు, కుమార్తెలకు మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనందరం స్వతంత్ర భారతంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం అంటే వారి ప్రాణత్యాగ ఫలితమే. వారి త్యాగాలను మనం స్మరించుకోవాలి. అలానే మా భద్రత కోసం ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసులతో సహా ఇతర భద్రతా సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది’ అన్నారు నరేంద్ర మోదీ. అలానే స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో (అరవింద్ ఘోష్) ను ఆయన జయంతి సందర్భంగా ప్రధాని జ్ఞాపకం చేసుకున్నారు. -
లేజర్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : ఇన్నాళ్లూ ఫార్మా, ఐటీ రంగాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ ఇకపై లేజర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) డైరక్టర్ ప్రొఫెసర్ సందీప్ త్రివేదీ వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన 2 వేర్వేరు బృందా లు గురువారం టీఐఎఫ్ఆర్ను సందర్శించాయి. లేజర్ టెక్నాలజీపై పరిశోధనలకు వీలుగా హైదరాబాద్ టీఐఎఫ్ఆర్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసే ఫోటానిక్ ఇన్నొవేషన్ సెంటర్ (ఎపిక్)కు కేంద్రం రూ.896 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బ్రిటన్ భాగస్వామ్యంతో జరిగే ఈ పరిశోధనల కోసం యూకే రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ (యుక్రి) మరో రూ.25 కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. లేజర్ పరిశోధనకు అనువైన మానవ వనరులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటంతో యుక్రి అనుబంధ సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ కౌన్సిల్ (ఎస్టీఎఫ్సీ) ఆసక్తి చూపుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ టీఎఫ్‌ఐఆర్‌లో 150 టెరావాట్ల సామర్థ్యమున్న లేజర్ కిరణాలను సృష్టించి, పరిశోధనలు చేస్తున్నట్లు త్రివేదీ వెల్లడించారు. భవిష్యత్తులో ఎపిక్‌లో జరిగే పరిశోధనల ద్వారా ఒక పెటా వాట్ (సుమారు వేయి టెరావాట్లు) సామర్ద్యమున్న లేజర్ కిరణాలను సృష్టిస్తామన్నారు. కృత్రిమ నక్షత్రాల తరహా.. అత్యంత సామర్థ్యమున్న లేజర్ కిరణాల ద్వారా అంతరిక్ష పరిశోధనలతో పాటు కేన్సర్, ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరింత మెరుగ్గా చేసేందుకు వీలుంటుందని సందీప్ త్రివేదీ వెల్లడించారు. ఎపిక్‌లో సృష్టించే అధిక సామర్థ్యం ఉన్న లేజర్ కిరణాలను ‘కృత్రిమ నక్షత్రాలు’గా అభివర్ణిస్తూ, ఈ కిరణాల నుంచి వెలువడే ఎలక్ట్రాన్లు, రేడియేషన్, ప్లాస్మా కిరణాలు వివిధ రంగాల్లో పరిశోధనలకు కల్పిస్తాయన్నారు. సీసీఎంబీ, ఐఐసీటీ, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో ఎపిక్ ఏర్పాటు ద్వారా లేజర్ టెక్నాలజీ హబ్‌గా మారుతుందని చెప్పారు. యుక్రి అనుబంధ ఎస్టీఎఫ్సీ చైర్మన్ మార్క్ థాంప్సన్ మాట్లాడుతూ.. లేజర్ టెక్నాలజీ పరిశోధనలో భారత్, బ్రిటన్ భాగస్వామ్యం ద్వారా అనేక అద్భుత ఫలితాలు సాధించామన్నారు. 20 యూనివర్సిటీల వీసీల బృందం బ్రిటన్‌కు చెందిన 20 యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల బృందం టీఐఎఫ్ఆర్ను గురువారం సందర్శించింది. ఎక్స్టర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఈ బృందంలో ఆస్టన్, బర్మింగ్‌హామ్, కాన్వెంట్రీ, మాంచెస్టర్, బ్రిస్టల్, ఎడిన్‌బరో, నాటింగ్‌హాం తదితర యూనివర్సిటీలకు చెందిన వీసీలు ఉన్నారు. లేజర్ టెక్నాలజీ సంబంధ పరిశోధనలకే పరిమితం కాకుండా, ఇతర రంగాల్లోనూ టీఐఎఫ్‌ఆర్‌తో సంయుక్త భాగస్వామ్యంలో పరిశోధనలకు ఉన్న అవకాశాలపై వీసీల బృందం చర్చించింది. ఈ కార్యక్రమంలో సంస్థ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.చంద్రశేఖర్, కొలాబా విభాగం భౌతిక శాస్త్రవేత్త రవీంద్రన్ పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్క్లేవ్
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కన్క్లేవ్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి ఆర్.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 23 రాష్ట్రాలకు చెందిన 300 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 190 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులతో పాటు పారిశుధ్ధ్యం, ఆరోగ్యం, పర్యావరణం తదితర వాటిపై వివిధ రకాల పనిముట్లు, నమూనాలను ఈ స్టాల్స్‌లో ప్రదర్శించారు. స్టాల్స్‌ను ప్రారంభించిన అనంతరం ఉపరాష్ట్రపతి వాటి పనితీరు, ఉపయోగాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాంక్రిపాల్‌యాదవ్, ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ ఆలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్ఐఆర్డీపీఆర్ డీజీ డాక్టర్ డబ్ల్యూఆర్.రెడ్డి, డిప్యూటీ డిజీ రాధికారస్తోగి తదితరులు పాల్గొన్నారు. పంట రక్షణకు లేజర్ పరికరం చిన్న, సన్నకారు రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అడవి పందులు, ఇతర జంతువుల కారణంగా 20 శాతం పంటను కోల్పొతున్నారు. దీని నివారణకు కరీంనగర్ జిల్లా పోలారం గ్రామానికి చెందిన బి.నాగరాజు లేజర్ టెక్నాలజీతో సౌండ్ సిస్టాన్ని కనుగోన్నాడు. కేవలం రెండు వేల రూపాయలతో పంటను కాపాడుకోవచ్చునని తెలుపుతున్నాడు. రాత్రి సమయంలో పంటలోకి ఏ జంతువులు వచ్చిన లేజర్ కిరణంతో అనుసంధానమైన స్పీకర్ ద్వారా చప్పుడు అవుతుందన్నారు. దీంతో జంతువులు పారిపోతాయన్నారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక పౌష్టికాహారం హైదరాబాద్‌లోని మూడు పాఠశాలలకు చెందిన త్రిపురా, కీర్తి, జెస్సికాలు గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులతో పాటు నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్తగా చాక్లెట్ తరహాలో చిరుధాన్యాలు, విటమిన్స్‌తో కూడిన బిస్కెట్లను తయారు చేశారు. వారానికి మూడు బిస్కెట్లను తింటే గర్భిణులలో రక్తహీనత, ఫొలిక్ యాసిడ్, విటమిన్స్‌ల సమస్య ఉండదని తెలుపుతున్నారు. ప్రస్తుతం గర్భిణులు మందు బిల్లలను వేసేందుకు అనాసక్తి చూపుతారన్నారు. గ్రామాల్లో వారికి సరైన పౌష్టికాహారం లేక పుట్టే పిల్లలు సైతం విటమిన్స్ లోపంతో అనారోగ్యంగా పుడతారని, ఈ బిస్కెట్లను తీసుకుంటే వాటిని నివారించవచ్చునని తెలుపుతున్నారు. ఇది కేవలం 20 రూపాయలకు చొప్పున దొరుకుతుందన్నారు. సోలార్ సెల్ఫ్ ఆటో వాటరింగ్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్‌తో పండిస్తున్న పంటలకు ఖర్చు తగ్గించేందుకు సోలార్ సెల్ఫ్ ఆటో వాటరింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చర్లపల్లికి చెందిన మేఘన తెలిపారు. ఇది సోలార్ సిస్టమ్‌తో పూర్తిగా పని చేస్తుందన్నారు. నేలను తడిగా ఉంచడంతో పాటు అతి తక్కువ ఖర్చు అవుతుందన్నారు. చిటికెలో చిరుధాన్యాల డ్రింక్స్ కాఫీ, టీ తరహాలో చిరుధాన్యాలతో ఇన్స్టెంట్ డ్రింక్స్‌ను తయారు చేశారు. కాఫీ, టీలను అందించే యంత్రాన్ని ఉపయోగించి రాగి, జొన్న, తైదులు(అంబలి) తదితర మిలెట్ ద్రవాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఇది మార్కెట్లోకి విక్రయించేందుకు సిద్ధమవుతున్నామని హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. అలాగే మైదాను ఉపయోగించకుండా రాగి, సజ్జ, జోన్న, మొక్కజోన్న బిస్కెట్లను తయారు చేస్తున్నామన్నారు. ఇక్రిశాట్‌తో మొట్టమొదటిసారిగా పేటెంట్ హక్కులను పొందామన్నారు. త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఎకో టూత్‌బ్రెష్‌తో ఆరోగ్యం మెండు విజయనగరానికి చెందిన వి.రమేష్, తేజలు ఎకో టూత్‌బ్రెష్‌లను తయారు చేశారు. తాటి పీచును ఉపయోగించి ఈ బ్రెష్‌ను ఉపయోగించుకోవచ్చు. కట్టెతో తయారైన ఈ బ్రెష్‌కు తాటి పీచును జోడించారు. పీచు పాడైన అనంతరం తిరిగి తీసి వాడుకునే సౌకర్యం ఉంది. పది రోజులకు ఒక్కసారి పీచును తీసి వేసి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని రమేష్ తెలిపారు. రూ.10కి ఒక టూత్‌బ్రెష్‌ను విక్రయించేందుకు నిర్ణయించామన్నారు. ఒక్కసారి కొనుగోలు చేస్తే 3–4 సంవత్సరాల వరకు వాడవచ్చునన్నారు. పర్యావరణానికి సైతం ఇది ఎలాంటి హాని ఉండదన్నారు. ప్లాస్టిక్‌తో చేస్తున్న టూత్‌బ్రెష్‌లతో ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. చిగుళ్లకు సైతం ఈ బ్రెష్‌ల వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు. -
ఇక రైలు ప్రమాదాలకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రయాణీకులకు ఇక ఎలాంటి బెంగ అవసరం లేదు. దట్టమైన మంచు ఆవరించినా రైళ్లు భద్రతపై రాజీపడకుండా గంటకు వంద కిమీ వేగంతో పరిగెత్తేలా రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణీకుల రైళ్లలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలను అమర్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇన్ఫ్రా రెడ్, లేజర్ టెక్నాలజీతో కూడిన ఈ పరికరాలు రెండు కిలోమీటర్ల వరకూ ట్రాక్‌ల్లో ఎలాంటి లోపాలున్నాయో ఇట్టే పసిగడతాయి. త్రినేత్రగా పిలిచే ఈ పరికరం పనితీరును ఇప్పటికే పరీక్షించారు. ప్రయాణీకుల రైళ్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పరికరంలో ఉండే ఇన్ ఫ్రా రెడ్, లేజర్ కిరణాలు రెండు కిలోమీటర్ల దూరం వరకూ ట్రాక్‌ల పరిస్థితిని పరిశీలించి, ఎలాంటి లోపాలున్నా ట్రైన్లో అమర్చిన స్ర్కీన్‌పై డిస్ప్లే చేస్తాయి. దెబ్బతిన్న ట్రాక్‌లు, పగుళ్లను కూడా ఇవి పసిగట్టి అప్రమత్తం చేయనుండటంతో రైలు ప్రమాదాలనూ అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా పరీక్షించిన క్రమంలో ట్రాక్‌లపై ఉన్న చిన్న వస్తువులను సైతం కనీసం 500 మీటర్ల ముందుగా ఈ పరికరం గుర్తించిందని రైల్వే అధికారులు చెప్పారు.త్రినేత్ర పరికరం ద్వారా రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం, లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు వంటి పలు అనర్ధాలను ఎదుర్కోవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు. త్వరలోనే ఈ పరికరం అన్ని రైళ్లలో అందుబాటులోకి రానుంది. -
లేజర్ టెక్నాలజీతో చిత్రసీమకు లాభం
‘‘నూతన సాంకేతిక విప్లవంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో లేజర్ టెక్నాలజీతో సినిమా ప్రదర్శనకు శ్రీకారం చుట్టాం. తక్కువ లాభాపేక్షతో ఈ టెక్నాలజీని చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు చేరువ చేయనున్నాం’’ అని ఎబిలిటీ మీడియా ఫ్యాక్టర్ (ఎం.ఎం.ఎఫ్) అధినేతల్లో ఒక్కరైన మామిడాల శ్రీనివాస్ తెలిపారు. లేజర్ టెక్నాలజీ ద్వారా సినిమాలను ఎలా ప్రదర్శించవచ్చో ఎబిలిటీ మీడియా ఫ్యాక్టర్, యునెటైడ్ మీడియా వర్క్స్ (యు.ఎం.డబ్ల్యు) సంస్థలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కొన్ని చిత్రాల క్లిప్పింగ్స్ చూపించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘ఎల్.సి.డి టెక్నాలజీని కూడా మార్కెట్ ధరల కన్నా తక్కువకే అందిస్తున్నాం. ఈ విధానం వల్ల సినిమా విడుదల ఖర్చులో 60 నుంచి 70 శాతం సేవ్ అవుతుంది. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన టెక్నాలజీ ఇస్తున్నాం’’ అన్నారు. ఎం.ఎం.ఎఫ్ భాగస్వామి విఎల్ మల్లికార్జున్ గౌడ్, యుఎండబ్ల్యు కంట్రీ హెడ్ అముల్గాడ్గే, హిటాచీ నేషనల్ హెడ్ రాజగోపాల్, నిర్మాత సంగిశెట్టి దశరథ తదితరులు పాల్గొన్నారు.