పంజాబ్: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమైనాయి. పర్యావరణ ప్రేమికులు విభిన్న రకాల కాలుష్యరహిత విగ్రహలను రూపొందించి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రెజా మాత్రం ఇంకొంచెం వెరైటీగా ఆలోచించాడు. చాక్లెట్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి, పాలల్లో నిమజ్జనం చేసి, ఈ పాలను పేదపిల్లలకు పంచి పెట్టే వినూత్న కార్యక్రమాన్ని 6 యేళ్ల క్రితమే చేపట్టాడు. వృధాని అరికట్టి, పర్యావరణానికి హితం చేకూరేలా ఉన్న ఇతని ఆలోచనను అందరూ ప్రశంశిస్తున్నారు. కాగా ఈ యేడాది కూడా 2 వందల కిలోల బెల్జియం డార్క్ చాక్లెట్లతో గణేశ్ విగ్రహాన్నితయారు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు.
ప్రతి వినాయక చవితికి చాక్లెట్‌తో ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాన్ని తయారు చేస్తున్నామని, ఈ విధంగా 2016 నుంచి చేస్తున్నామని అన్నారు. అయితే ఈ యేడాది విగ్రహాన్ని మాత్రం ప్రొఫెషనల్ షెఫ్ టీమ్ పది రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. ఇది అంత తేలికైన విషయం కాదని, తయారు చేసే సమయంలో ఏ కొంచెం లోపం తలెత్తినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేవారని తెలియజేశారు. కానీ దేనిమీదైనా అత్యంత అభిమానం ఉన్నట్లయితే, కష్టం కూడా సరదాగానే ఉంటుందని అన్నారు. చాక్లెట్‌తో తయారు చేసిన ఈ గణేశ్ విగ్రహాన్ని మూడో రోజు 45 లీటర్ల పాలల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. అనంతరం ఆ పాలను పేద పిల్లలకు పంచిపెడతామని అన్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతీ యేట దాదాపుగా 5 వందలకుపైగా పిల్లలకు ఒక్కొక్కరికి గ్లాసెడు చాక్లెట్ మిల్క్ పంచుతున్నామని తమ అనుభవాలను పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment