vinayaka chaturthi
-
వినాయక చవితి వేడుకల్లో తమన్నా సందడి!
వినాయక చవితి వచ్చిందంటే సినీతారల సందడి మామూలుగా ఉండదు. ఎప్పటిలాగే ముంబయిలోని ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు గ్రాండ్ నిర్వహించారు. ముంబయిలోని ముకేశ్ నివాసం యాంటిలియాలో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌లోని ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. కొందరు సతీసమేతంగా విచ్చేసి గణనాధుని పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా సందడి చేసింది.ముకేశ్ అంబానీ నిర్వహించిన గణపతి పూజలో టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెతో పాటు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ లాంటి సూపర్ స్టార్స్ పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో మెరిశారు. అయితే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి మిస్సయిన సెలబ్రిటీ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వినాయక చవితి వేడుకలకు హాజరు కావడం విశేషం.అంతేకాకుండా జాకీ ష్రాఫ్ తన కుమారుడైన టైగర్ ష్రాఫ్‌లో కలిసి వచ్చారు. ఈ వేడుకల్లో కాజల్ అగర్వాల్, అమీర్ ఖాన్ కుమారులు జునైద్, ఆజాద్‌లు కూడా పాల్గొన్నారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తన భర్త హిమాలయాతో కలిసి హాజరయ్యారు. గాయం నుంచి కోలుకున్న సల్మాన్ ఖాన్ తన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రితో కలిసి సందడి చేశారు. మరో బాలీవుడ్ జంట రితీష్, జెనీలియా దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ జంట, రాజ్‌కుమార్‌రావు సతీమణి పాత్రలేఖతో కలిసి గణపతి ఉత్సవాలకు హాజరయ్యారు. -
ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి
-
రాష్ట్ర ప్రజలకు గణనాథుని ఆశీస్సులు ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. రేపు(శనివారం)వినాయకచవితి సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని, గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. -
వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'వినాయక చవితి' ప్రారంభం కానుంది. మరి కొన్ని రోజులు దేశం మొత్తం వాడవాడల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా గణేష్ ఉత్సవాల్లో మునిగి తేలుతారు. గత ఏడాది ఈ పండుగ సందర్భంగా రూ. 300 కోట్లు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది ఎంత బిజినెస్ జరగవచ్చు? ఎలాంటి వస్తువుల వ్యాపారం ఎక్కువగా ఉంటుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిఏఐటి రిపోర్ట్.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అందించిన సమాచారం ప్రకారం.. ప్రతి సంవత్సరం వినాయకుని విగ్రహాల బిజినెస్ రూ. 20 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తుంది. గతంలో చైనా నుంచి విగ్రహాలు దిగుమతయ్యేవి, కానీ క్రమంగా వీటి దిగుమతి భాగా తగ్గింది. దీంతో దేశీయ మార్కెట్లో బిజినెస్ ఊపందుకుంది. ప్రస్తుతం మన దేశంలో పర్యావరణాన్ని కలుషితం చేయకూడదనే ఉద్దేశ్యంతో మట్టి, ఆవు పేడతో కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి నిమజ్జనం కూడా చాలా సులభంగా ఉంటుంది. విగ్రహాలు తయారు చేసేవారు సంవత్సరం పొడువునా.. లేదా కొన్ని నెలలు అదేపనిలో నిమగ్నమైపోతారు. అయితే వినాయక చవితి ప్రారంభానికి ముందే దేశంలో బిజినెస్ మొదలైపోతుంది. ఇదీ చదవండి: మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు.. హోండా, కేటీఎమ్, కవాసకి ఈ ఏడాది కూడా అప్పుడే పండుగ శోభ మొదలైపోయింది.. హైదరాబాద్ నగరంలో ఏ వీధిలో చూసిన వినాయక విగ్రహాలు ఏర్పాటు వేగంగా జరుగుతోంది. కేవలం విగ్రహాలు మాత్రమే కాకుండా పూజా సామగ్రి, అలంకార వస్తువుల వ్యాపారం కూడా బాగా ఊపందుకుంటాయి. కొంతమంది బంగారం కొనుగోలు చేయడం కూడా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇలా గణేష్ చతుర్థి సందర్భంగా కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ ఏడాది గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారస్తులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
వినాయక చవితి స్పెషల్: సేమిలా లడ్డు.. ఇలా చేసుకోండి
ఈసారి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు, ఇతర నైవేద్యాలతో పాటు... వైవిధ్యభరితమైన మరెన్నో స్వీట్లను తినిపించి ప్రసన్నం చేసుకుందాం.... సేమియా లడ్డు తయారీకి కావల్సినవి: కావలసినవి: వేయించిన సేమియా – కప్పు; కోవా – అరకప్పు; పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – టీస్పూను; బాదం పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: ►బాణలిలో పంచదార వేసి సన్నని మంటమీద కరగనివ్వాలి. ► పంచదార కరుగుతున్నప్పుడే కోవా వేసి తిప్పాలి ∙పంచదార కరిగి మిశ్రమం దగ్గర పడినప్పుడు సేమియా, బాదం పలుకులు వేసి కలపాలి. ► అన్ని చక్కగా కలిసిన తరువాత రోజ్‌వాటర్ వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించేయాలి ∙ఇప్పుడు మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుంటే వర్మిసెల్లి లడ్డు రెడీ. -
18న వినాయకచవితి.. 28న నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతితో ముడిపడిన పండగల్లో ఎంతో పరమార్థం ఉంది. ప్రధానంగా వినాయకచవితి సందర్భంగా నిర్వహించుకునే కార్యక్రమాల్లో సామాజిక ప్రగతికి, సంఘటిత జీవనానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఎన్నో ముడివడి ఉన్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ సాగే గణేష్ ఏకతా యాత్ర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. వినాయకుడు అందరివాడు అన్ని పండుగల్లోకెల్ల వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం. పిల్లా, పెద్ద అందరికీ వినాయకుడు అంటే మక్కువ చూపిస్తారు. దీన్ని పండుగలా కాకుండా.. సొంతింట్లో పుట్టినరోజును జరుపుకున్నట్టుగా భావిస్తారు. వినాయకుడిని తమ వాడిగా అన్వయించుకుంటారు. ఈ పండుగ ఎప్పుడు అన్నదానిపై ఈ సారి భిన్నవాదనలు తెరపైకి వచ్చాయి. (వినాయకుడిని పూజిద్దాం ఇలా..) 18కే భాగ్యనగర్ మొగ్గు వినాయకచవితి ఎప్పుడనే విషయంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఒక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీనే వినాయకచవితి పండుగని పేర్కొంది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని తెలిపింది. అంతకు ముందు 19న వినాయక చవితి, 29న నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించిన సంగతి విదితమే. అయితే.. ఈ ఏడాది తిథి రెండు రోజులు ఉండడం వల్ల.. పండుగ ఎప్పుడనే దానిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. శృంగేరి-కంచి పీఠాధిపతులు గణేష్ ప్రతిష్ట 18వ తేదీనే చేసుకోవాలని సూచించారట. కాబట్టి.. గ్రేటర్ పరిధిలోని మండపాలు 18వ తేదీనే వినాయక చవితి నిర్వహించుకోవాలని సూచించింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ. సంబరం తెచ్చే పండగ భాజాభజంత్రీలు, తప్పెట్లు, కోలాటాలు, కీలుగుర్రాల నృత్యాలు, పండరిభజనలు, కర్రసాము విన్యాసాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో గణేషుడి నవరాత్రులు సందడిగా ఉంటాయి. ఇక నిమజ్జనం గురించి చెప్పనక్కర్లేదు. భాగ్యనగరం అంతా ఏకతా యాత్ర కోలాహలంగా, సందడితో సాగుతుంది. ఈ పండుగ వల్ల ఎంతో మందికి ఉపాధి, మరెంతో మందికి చేతినిండా పని. మట్టి వినాయకుడికి జై వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహం కూడా తుదిమెరుగులు దిద్దుకుంటోంది. The #Khairatabad #Ganesh #Idol in making! #VinayakaChavithi #GaneshChaturthi #Hyderabad #Telangana 📸: @BelieverHemanth pic.twitter.com/HIFcGpULDr — Hi Hyderabad (@HiHyderabad) September 3, 2023 పర్యావరణానికి పెద్దపీట వినాయక ప్రతిమలతో పాటు మట్టి పాత్రలను, ప్రమిదలను, చేనేత పూజా వస్త్రాలను, ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన పద్ధతుల్లో పండించిన పెసరపప్పు, బెల్లం, పసుపు, కుంకుమ, అక్షింతలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, 21 రకాల ఆకులను సైతం పల్లెల నుంచి సేకరించి గణపతి కిట్లను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. Ganapati Bappa Morya ♥️#GaneshChaturthi #GaneshChaturthi2023 pic.twitter.com/ByLNMYSef0 — poorna_choudary (@poornachoudary1) September 1, 2023 -
వినాయక చవితి సెప్టెంబర్ 18నే
సాక్షి, హైదరాబాద్: ఈ సంవత్సరం వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 18 సోమవారం రోజునే నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. శోభకృత్నామ సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి రోజునే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్నందున అదే రోజున వినాయక చవితిగా నిర్వహించుకోవాలని నిర్ధారించినట్టు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతిలు ఓ ప్రకటనలో తెలిపారు. చవితి తిథి 18న ఉదయం 9.58కి ఆరంభమై 19వ తేదీ ఉదయం 10.28కి ముగుస్తుందని తెలిపారు. దీని ప్రకారం చవితి తిథి మధ్యాహ్నం సమయానికి 18నే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కార్యాలయాలకు, ప్రభుత్వ సలహాదారులకు తెలిపినట్టు వెల్లడించారు. జూలై 22, 23 తేదీల్లో వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో జరిగిన షష్ఠమ విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతుల సమక్షంలో పండుగల తేదీలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. చదవండి: Hyderabad: నా ఫ్లెక్సీలు తొలగిస్తారా?.. కార్పొరేటర్‌పై కేసు నమోదు -
వచ్చే నెల 19నే వినాయక చవితి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం భేటీ అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, వచ్చే నెల18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. వచ్చే నెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. పొలిటికల్ ఫ్లెక్సీలు వద్దు.. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గణేష్ పూజా విధానం తెలిపే బుక్‌తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించాం. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించింది. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చెప్పాం. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు తెలిపారు. పండుగ ఘనంగా నిర్వహిస్తాం.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. 30వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించాం. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతోంది. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తాం. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఒకేరోజు వస్తున్నాయి. ఆరోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించింది. గణేష్ మండపాల పర్మిషన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే.. -
Ganesh Laddu: రాత్రికి రాత్రే గణేష్ లడ్డూను మాయం చేసిన పిల్లలు
బంజారాహిల్స్: గణేశ్ మండపంలో లడ్డూ చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.70 జర్నలిస్టు కాలనీ సమీపంలోని అశ్విని లే అవుట్ పావనీ హోమ్స్‌లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం చేతిలో నిర్వాహకులు పది కిలోల లడ్డూ ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఫిలింనగర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన పిల్లలు లడ్డూను దొంగిలించి పరారయ్యారు. ఆదివారం ఉదయం లడ్డూ కనిపించకపోవడంతో మండపం నిర్వాహకులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో అదే అపార్ట్మెంట్లో పని చేస్తున్న ఎమ్మార్సీ కాలనీకి చెందిన ఓ మహిళ కుమారుడు మరో ఇద్దరు పిల్లలతో కలిసి లడ్డూ తీసుకుని పరారైన దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల వయసున్న ఆ బాలుడిని విచారించగా తన తల్లి చెప్పడంతోనే ఈ దొంగతనం చేసినట్లు తెలిపాడు. లడ్డూను స్వాధీనం చేసుకున్న నిర్వాహకులు చోరీకి పాల్పడిన ముగ్గురు పిల్లలను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. గణేశుడి చేతిలో ఉన్న లడ్డూని పది మందికి పంచితే దోషాలు తొలగిపోతాయని, డబ్బు కలిసి వస్తుందనే నమ్మకంతోనే మహిళ ఈ పని చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తుండగానే అదే ప్రాంతంలో మరో గణనాథుడి మండపంలో లడ్డూ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా లడ్డూ దొంగతనాలపై ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: నిమజ్జనంలో అపశ్రుతి -
వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి?
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం గణేశ చతుర్థి. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు చేసే సంప్రదాయం ఉంది. ఈ స్వామి ఆరాధన వల్ల అన్ని శుభాలు లభిస్తాయని ప్రతీతి. భక్తితో పూజిస్తే చాలు అపారమైన కృపావర్షం కురిపించే సులభ ప్రసన్నుడు విఘ్నరాజు గురించి కొన్ని విశేషాలు... చదవండి: పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా.. వినాయకుడికి, విద్యకు సంబంధం ఏమిటి? చదువంటే గణపతికి ఇష్టం. నారదుడు, బృహస్పతి ద్వారా కేవలం అరవై నాలుగు రోజుల్లో విద్యలు నేర్చిన ఘనుడు. ఆయన సామర్థ్యం గురించి ఓ చిన్న ఇతివృత్తం ఉంది. వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నప్పుడు వేగంగా రాసే లేఖకుడు ఉంటే బావుండునని అనుకున్నాడట. గణపతి దగ్గరకు వచ్చాడట. ‘లక్ష శ్లోకాలు చెబుతాను వేగంగా రాసిపెడతావా!’ అని అడిగాడట.‘అలాగే రాస్తాను కానీ, మీరు వెంట వెంటనే చెబుతుండాలి. చెప్పడం ఆపితే నేను మాయం అవుతా!’ అన్నాడట గణపతి. ‘సరే! నేను చెప్పే శ్లోకాలను అర్థం చేసుకుని రాయగలిగితే నేనూ వేగంగా చెబుతా!’ అన్నాడట వ్యాసుడు. అలా సరస్వతి నది తీరాన మహాభారత రచన మొదలైంది. వ్యాసుడు ప్రతి వంద శ్లోకాల మధ్యలో అతి కఠినమైనవి చెబుతుండేవాడట. వినాయకుడు వాటిని అర్థం చేసుకుని రాసేలోపు మిగతా వంద గుర్తు తెచ్చుకునేవాడట. చివర్లో మరో పది శ్లోకాలు చెప్పాల్సి ఉండగా అనుకోకుండా వ్యాసుడి కవిత్వ ధార ఆగిపోయింది! తన నిబంధన ప్రకారం వినాయకుడు మాయమయ్యాడు. తన రచన ఆ మేరకు అసంపూర్ణంగా మిగిలిపోయిందని విచారించాడట వ్యాసుడు. సరే తానే రాస్తానని తాళపత్రాలు తీసి చూస్తే ఏముంది? ఆయన చెప్పాల్సిన పది శ్లోకాలు అక్కడే ఉన్నాయట. అంటే ఆ శ్లోకాలన్నీ విఘ్నాధిపతికి ముందే తెలిసుండాలి. అంటే వ్యాసుడు తన రచన ఎలా ముగిస్తాడో ముందుగానే వూహించాడు! వ్యాసుడు గణపతికి కృతజ్ఞతతో ‘నీ పుట్టినరోజున పుస్తకాలను ఉంచి పూజించే విద్యార్థులు సర్వశుభాలూ పొందుతారు. వారికి సకల విద్యలు అబ్బుతాయి’ అని ఆశీర్వదించాడట. నాటినుంచి వినాయక చవితినాడు చేసే పూజలో పిల్లలు తమ పుస్తకాలను, కలాలను ఉంచి, పుస్తకాలకు పసుపు కుంకుమలు అలంకరించి పూజించడం ఆచారంగా మారింది. క్షేమం, లాభం కూడా.. ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వీటిలోని ఆంతర్యం ఇదే! వినాయకుని నక్షత్రం ‘హస్త’. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, ఉండ్రాళ్లుగా తయారు చేసి చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి నివేదన చేస్తారు. పత్రిపూజ: అదేవిధంగా వినాయకునిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. బుధునికి ఆకుపచ్చ రంగు ప్రీతికరమైనది. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. మూషిక వాహనం: మూషికం అంటే ఎలుక వాసనామయ జంతువు. తినుబండారాల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. పంజరంలో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పట్టినప్పుడు మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు – వినాయకుడు. చదవండి: గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము -
Ganesh Chaturthi 2022: హైదరాబాద్‌లో గణేష్.. జోష్
సాక్షి, హైదరాబాద్: భక్తకోటి ఇష్టదైవం బొజ్జ గణపయ్య మరికొద్ది గంటల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి ఉత్సవాల కోసం నగరం శోభాయమానమైంది. వినాయక చవితి వేడుకలకు మండపాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మహానగరం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మరోవైపు వినాయక విగ్రహాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితర వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహ దారులకు ఇరువైపులా అమ్మకాలతో సందడి నెలకొంది. పర్యావరణహిత మట్టి ప్రతిమల పట్ల నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లక్షలాది విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశాయి. ధూల్‌పేట్, ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల అమ్మ కాలు మంగళవారంఆఖరి రోజు జోరుగా సాగాయి. విగ్రహాల తరలింపు, పూలు, పండ్లు, పూజావస్తువుల కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున రహదారులపైకి చేరడంతో నగరంలోని అనేక చోట్ల మంగళవారం ఉదయం నుంచే ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వైవిధ్యమూర్తులు.. వైవిధ్యభరితమైన విగ్రహమూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తిని ప్రతిబింబించే విగ్రహాలు, మహాభారత్ వినాయకుడు, అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా ఆకృతిలో, ముంబై గణేశుడిగా.. ఇలా అనేక రకాల రూపాల్లో కొలువైన వినాయకుడు నవరాత్రి ఉత్సవాలకు సిద్ధంగా ఉన్నాడు. బహు ముఖ వినాయకుడు మరో ప్రత్యేక ఆకర్షణ. భక్తుల మదిని దోచే వివిధ రకాల భంగిమలు, ఆకృతు లతో, చక్కటి రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకు న్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 50 వేలకు పైగా మండపాల్లో నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. సందడిగా మార్కెట్లు.. ధరలకు రెక్కలు వినాయక చవితి సందర్భంగా పూజ కోసం వినియోగించే 21 రకాల పత్రి, బంతిపూలు,మామిడి ఆకులు, మారేడు కాయల అమ్మకాలతో మార్కెట్లలో సందడి నెలకొంది. పండుగ సందర్భంగా పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లలో బంతిపూలు కిలో రూ.70 వరకు ఉంటే పూల దుకాణాల వద్ద కిలో రూ.150 వరకు విక్రయించారు. బుధవారం ఒక్క రోజే సుమారు 21 టన్నులకు పైగా బంతి పూల విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. చామంతి పూలు హోల్‌సేల్‌గా కిలో రూ. 170 వరకు ఉంటే రిటైల్‌గా రూ.250 వరకు అమ్మారు. అలాగే గులాబీ, కనకాంబరాల ధరలు సైతం భారీగా పెరిగాయి. సెంట్ గులాబీలు హోల్‌సేల్ మార్కెట్లో రూ.200 కిలో చొప్పున, కనకాంబరాలు రూ.1000కి కిలో చొప్పున విక్రయించారు. పూల మార్కెట్ కిటకిట గోల్కొండ: వినాయక చవితిని పురస్కరించుకుని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుడిమల్కాపూర్‌లోని పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తడి, పొడి పూలు అంటూ విడివిడిగా బంతి, చామంతులను విక్రయించారు. ఒక్కరోజే మార్కెట్‌కు వంద వాహనాల్లో రికార్డుస్థాయిలో బంతిపూలు వచ్చాయని వర్తకుల సంఘం ప్రతినిధి దేవర శ్రీనివాస్ తెలిపారు. -
చాక్లెట్ గణేశ్.. పిల్లలకు పలహారం..
పంజాబ్: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు ప్రారంభమైనాయి. పర్యావరణ ప్రేమికులు విభిన్న రకాల కాలుష్యరహిత విగ్రహలను రూపొందించి తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రెజా మాత్రం ఇంకొంచెం వెరైటీగా ఆలోచించాడు. చాక్లెట్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి, పాలల్లో నిమజ్జనం చేసి, ఈ పాలను పేదపిల్లలకు పంచి పెట్టే వినూత్న కార్యక్రమాన్ని 6 యేళ్ల క్రితమే చేపట్టాడు. వృధాని అరికట్టి, పర్యావరణానికి హితం చేకూరేలా ఉన్న ఇతని ఆలోచనను అందరూ ప్రశంశిస్తున్నారు. కాగా ఈ యేడాది కూడా 2 వందల కిలోల బెల్జియం డార్క్ చాక్లెట్లతో గణేశ్ విగ్రహాన్నితయారు చేసినట్టు గురువారం మీడియాకు వెల్లడించారు. ప్రతి వినాయక చవితికి చాక్లెట్‌తో ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాన్ని తయారు చేస్తున్నామని, ఈ విధంగా 2016 నుంచి చేస్తున్నామని అన్నారు. అయితే ఈ యేడాది విగ్రహాన్ని మాత్రం ప్రొఫెషనల్ షెఫ్ టీమ్ పది రోజుల పాటు శ్రమించి తయారు చేశారని తెలిపారు. ఇది అంత తేలికైన విషయం కాదని, తయారు చేసే సమయంలో ఏ కొంచెం లోపం తలెత్తినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించేవారని తెలియజేశారు. కానీ దేనిమీదైనా అత్యంత అభిమానం ఉన్నట్లయితే, కష్టం కూడా సరదాగానే ఉంటుందని అన్నారు. చాక్లెట్‌తో తయారు చేసిన ఈ గణేశ్ విగ్రహాన్ని మూడో రోజు 45 లీటర్ల పాలల్లో నిమజ్జనం చేస్తామని తెలిపారు. అనంతరం ఆ పాలను పేద పిల్లలకు పంచిపెడతామని అన్నారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతీ యేట దాదాపుగా 5 వందలకుపైగా పిల్లలకు ఒక్కొక్కరికి గ్లాసెడు చాక్లెట్ మిల్క్ పంచుతున్నామని తమ అనుభవాలను పంచుకున్నారు. -
మట్టి విగ్రహాలను పూజించండి
-
రోడ్లపై నిమజ్జనానికి ప్రయత్నం, అడ్డుకుంటున్న పోలీసులు
-
‘తెలుగు వారందరికి వినాయక చవితి శుభాకాంక్షలు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ వినాయక చవితి సందర్భంగా అమెరికాలోని తెలుగు వారితో పాటు భారత ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా గణేష్ చతుర్థిని జరుపుకునే తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఆమెరికాలోని తెలుగు వారికి, భారత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గణేష్ చతుర్థి, హిందూ పండుగలను జరుపుకునే ప్రతి ఒక్కరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అన్ని అడ్డంకులను అధిగమించి, వివేకంతో, ఆశీర్వాదంలో కొత్త ఆరంభాల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్న’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. (చదవండి: ఒబామా ట్వీట్ : తదుపరి అధ్యక్షుడు అతడే..) To everyone celebrating the Hindu festival of Ganesh Chaturthi in the U.S., India, and around the world, may you overcome all obstacles, be blessed with wisdom, and find a path toward new beginnings. — Joe Biden (@JoeBiden) August 22, 2020 -
ప్రగతిభవన్‌లో వినాయక చవితి వేడుకలు
-
స్వయంభూ గణేష్: వచ్చే ఏడాదైనా ప్లాన్ చేసుకోండి!
విద్యకు , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు. ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజలు అందుకునేది విఘ్నాలను తొలగించే ఆ బొజ్జ గణపయ్యే. అలాంటి ఆది దేవుడు ‘విఘ్నేశాధిపత్యం’ దక్కించుకున్న భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకొంటాం. చిన్నా, పెద్దా భక్తులందరికీ ఎంతో ఇష్టమైన లంబోదరుడి పండుగ అంటే సంబరాలు మామూలుగా ఉండవు. వాడవాడలా గణనాథులను కొలువుదీర్చి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగే గణేషుని ఉత్సవాలు ముంబైలో మరింత అట్టహాసంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మహమ్మారి కరోనా కారణంగా మునుపటిలా వేడుకలు నిర్వహించే వెసలుబాటు లేకుండా పోయినా.. ఉన్నంతలోనే అన్ని జాగ్రత్తలు పాటిస్తూ గణపతిని పూజించేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కొలువుదీరిన తాత్కాలిక మంటపాలలో లంబోదరుడి ప్రతిష్టాపన మొదలైంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి రోజుకే పరిమితం గాకుండా మహారాష్ట్రలో ఏడాదంతా పూజలు అందుకునే స్వయంభూ విఘ్నేశ్వరాలయాల(అష్ట వినాయకయాత్ర) గురించి కొన్ని వివరాలు.. 1. శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో భీమా నది ఒడ్డున ఉన్న సిద్ధాటెక్ పట్టణంలో ఉంది. గజాననుడు ఇక్కడ శ్రీ సిద్ధి వినాయకగా కొలువుదీరాడు. సాధారణంగా అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. అయితే సిద్ధాటెక్లో గల ఈ దేవాలయంలో మాత్రం లంబోదరుడి తొండం కుడివైపునకు తిరిగి కనపడుతుంది. దీనితో పాటు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది. 2. శ్రీ మయూరేశ్వర్ మందిర్/శ్రీ మోరేశ్వర్ టెంపుల్ పుణె జిల్లాలోని మోర్గావ్లో ఉంది ఈ ఆలయం. పుణె నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నదీ తీరంలో కొలువుదీరిన అష్టవినాయక యాత్ర టూర్లో ఇది మొదటిది అని చెప్పవచ్చు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది. 3. బల్లాలేశ్వర దేవాలయం రాయ్‌గఢ్‌లో జిల్లాలోని పాలి గ్రామంలో కలదు. రోహా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరస్‌గడ్ కోట, అంబా నదికి మధ్య కొలువుదీరిన ఈ ఆలయంలో గణనాథుడు రాతి సింహానం మీద ఆసీనుడైన బల్లాలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. గజాననుడి అపర భక్తుడైన బల్లాల్ పేరు మీదుగా దీనికి బల్లాలేశ్వర ఆలయం అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పాలిలో సంపన్నుడైన వ్యాపారవేత్త కళ్యాణ్, తన భార్య ఇందుమతి, కొడుకు బల్లాల్‌తో కలిసి నివసించేవాడు. ఆ ఊరిలో పిల్లలంతా రాళ్లను దేవతా మూర్తులుగా భావిస్తూ పూజలు చేస్తూ ఆటలాడుకునేవారు. అలా ఓ రోజు గ్రామ శివారులో ఓ పెద్ద రాయిని చూసిన బల్లాల్.. దానిని గణేషుడిగా పేర్కొంటూ పూజలు చేయడం ప్రారంభించాడు. ఆకలిదప్పులు మరచి పిల్లలంతా గణనాథుని స్మరణలో మునిగిపోయి రేయింబవళ్లు అక్కడే ఉండిపోయారు. దీంతో పిల్లల జాడ తెలియక కంగారుపడిన పెద్దలంతా అకకడి చేరుకుని, దీనికంతటికి బల్లాల్ కారణమంటూ తిట్టిపోస్తూ తండ్రి కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన కళ్యాణ్ కొడుకు లాక్కొచ్చి చెట్టుకట్టేసి విపరీతంగా కొట్టాడు. అంతేగాక గణేషుడిగా పూజలు అందుకున్న రాయిని పగులగొట్టాడు. నిన్ను కాపాడటానికి ఎవరూ రారు అంటూ దేవుడిని తిడుతూ బల్లాల్ను అక్కడే వదిలి వెళ్లిపోతాడు. తన ఇష్టదైవాన్ని దూషించడంతో తండ్రిపై కోపగించుకున్న బల్లాల్ అతడి కళ్లు పోవాలని శపిస్తాడు. ఆ తర్వాత ఒక్కడే ఒంటరిగా అక్కడ ఉండిపోయి లంబోదరుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. బల్లాల్ బాధను చూడలేక సాధువు రూపంలో వచ్చిన గజాననుడు అతడి గాయాలన్నింటి మాన్పి, ఏం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. ఇందుకు ఆ బాలుడు.. ‘‘నువ్వు ఇక్కడే కొలువుదీరి.. శరణుజొచ్చిన వారిని కాపాడు తండ్రి’’అని కోరతాడు. బల్లాల్ కోరికను మన్నించిన పార్వతీ పుత్రుడు అతడిని ఆలింగనం చేసుకుని, నా పేరు ముందు నీ పేరును జోడించి బల్లాలేశ్వరుడిగా కొలువుదీరతాను అని చెబుతాడు. లంబోదరుడు నిజంగా దేవుడు ఉంటే నిన్ను రక్షిస్తాడని అనికలిసి ఈ దేవాలయాన్ని మోరేశ్వర్ విఠల్ సింద్కర్ 1640లో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 4. గిరిజాత్మజ దేవాలయం పుణె జిల్లాలోని లెన్యాద్రి(గణేష్ పహర్ లేదా సులేమాన్ గుహలు)లో ఉంది. హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీ దేవి పుత్రుడైన(గిరిజ ఆత్మ నుంచి వచ్చినవాడు) వినాయకుడిని కేవ్ నంబర్ 7 వద్ద దర్శించుకోవచ్చు. ఇందుకోసం సుమారు 300 మెట్లు ఎక్కాలి. కాస్త కష్టంతో కూడుకున్నదైనా పైకి వెళ్లినట్లయితే లంబోదరుడితో పాటు కొండ చుట్టుపక్కల గల ప్రకృతి అందాలన వీక్షించవచ్చు. 5. చింతామణి దేవాలయం చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. పుణెకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి(ఆభరణం) రూపం కలిగి ఉంటాడు. అష్టవినాయక ఆలయాల్లో ఇది పెద్దది. 6. విఘ్నేశ్వర దేవాలయం పుణెకు 85 కిలోమీటర్ల దూరంలో గల ఓజార్ వద్ద కూకడి నది తీరాన గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరాన్ని బంగారంతో తయారు చేశారు. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగావ్ మరియు జున్నార్ ల నుండి ఇది 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలో వెళ్లవచ్చు. 7. మహాగణపతి దేవాలయం పుణె జిల్లాలోని రాజన్గావ్లో కలదు. మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. 8. వరదావినాయక దేవాలయం మహాడ్ గ్రామంలో వరదా వినాయక దేవాలయం కలదు. పరిసరాల్లో గల ఒక సరస్సు ఒడ్డున లభించిన విగ్రహాన్ని దేవాలయం లోపల ప్రతిష్టించారు. 1725లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పీష్వా పాలకులు దీనిని పునరుద్ధరించారు. 1892 నుంచి ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. స్వయంభూ వినాయకుడితో పాటు మూషిక, నవగ్రహ దేవతలు, శివలింగం కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్ఠాదశ శక్తి పీఠాల వలె అష్ఠ గణపతులు కూడా పురాతనమైనవి. గణేష, ముద్గాల పురాణాలలో వీటి ప్రస్తావన ఉంది. ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే క్షేత్రాలుగా భాసిల్లుతున్న ఈ ఆలయాలను కరోనా అంతమైన తర్వాత హాయిగా కుటుంబంతో కలిసి దర్శించి తరించండి. -
గణేశ్ చుతుర్ధి: సెలబ్రిటీల పూజలు
-
వినాయకుడిని పూజిద్దాం ఇలా..
సాక్షి, ఉట్నూర్: భారతీయతలో ప్రకృతి ఆరాధన దాగి ఉంది. హిందూ దేవతారాధన, పండుగలకు ప్రపంచంలోనే ఎంతో విశిష్టత ఉంది. చెట్టు, పుట్ట, రాయి, రప్పా, నీరు, నిప్పు, భూమి, గాలి, ఆకాశం ఇలా దేనిని పూజించిన వాటి వెనుక ఉన్న పరమార్థం ప్రకృతిని ఆ రాధించడమే. ప్రతీ పూజ, ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక శాస్త్ర విజ్ఞానం (సైన్సు) దాగుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వినాయకచవితి పూజలోనూ అలాంటి అంశాలే ఉన్నాయి. వినాయక చవితి రోజున వినాయకుడిని ఏకవింశతి (21) పత్రాలతో పూజించడం సంప్రదాయం. ప్రకృతి వనరులను మానవ ఆరోగ్యానికి ఉపయోగించుకోవడంతో పాటు వాటిని దైవ సమానంగా చూసుకోవాలని ప్రతీ పూజ తెలియజేస్తోంది. గణపతికి సమర్పించే 21 రకాల పత్రి.. వాటి విశిష్టత.. పూజ సందర్భంలో పఠించాల్సిన మంత్రాల గురించి ఓ సారి పరిశీలిద్దాం. ఓం సముఖాయ నమః మాచీపత్రం పూజయామి.. మాచీ పత్రం: తెలుగులో దీనిని మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. ఓం గణాధిపాయనమః బృహతీ పత్రం పూజయామి.. బృహతీ పత్రం: దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇవి వంగ ఆకుల మాదిరి, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర, వ్యాధులను నయం చేస్తుంది. దంతధావనానికి కూడా ఉపయోగిస్తారు. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి.. బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా కూడా లభ్యమవుతుంది. ఇవి శివుడికి ఇష్టమైనవి. మహాలక్ష్మికి ఊడా ఇష్టమైనవిగా వేద పండితులు చెబుతుంటారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది. ఓం గుహాగ్రజాయనమః అపామార్గ పత్రం పూజయామి.. అపామార్గ పత్రం: తెలుగులో ఉత్తరేణి అంటారు. గింజలు సన్నటి ముళ్లను కలిగి ఉంటాయి. ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారుట, అర్ష మొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి.. కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. దురుద, కంటి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఓం గజానయ నమః దూర్వా యుగ్మం పూజయామి.. దూర్వా యుగ్మం: దూర్వా యుగ్మం అంటే గరిక. ఇందులో తెల్లగరిక, నల్ల గరిక అనే రకాలున్నాయి. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి.. దత్తూర పత్రం: దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పేను కొరుకుడు, నొప్పులు, రుతువ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. ఓం గజకర్ణాయనమః తులసీ పత్రం పూజయామి.. తులసీ పత్రం: హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓం భిన్నదంతాయనమః విష్ణుక్రాంత పత్రం పూజయామి.. విష్ణు క్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతోంది. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి.. బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు ఆకు. ఇందులో రేగు, జిట్రేగు, గంగరేగు అనే మూడు రకాలున్నాయి. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి.. చూతపత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. వీటిని వాడని హైందవ గృహాలు ఎక్కడ ఉండవు. ఇది రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతోంది. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి.. దాడిమీ అంటే దానిమ్మ మొక్క. విరేచనాలు, గొంతు నొప్పి, తగ్గిస్తుంది. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవతలకు ఇష్టమైన ఆకు దేవదారు. అజీర్తి, పొట్ట వ్యాధులను తగ్గిస్తుంది. ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి ధవనం, మరువం అంటారు. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జుట్టు రాలడం, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. ఓం హేరంభాయ నమః సింధువార పూజయామి.. వావిలి అంటారు. జ్వరం, గాయాలు, చెవిపోటు, మూర్ఛవ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి. ఓం శూర్సకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి.. జాజీ పత్రం: ఇది సన్న జాజిగా పిలువబడే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దీనిని లతా దూర్వా, దేవ కాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబంధిత వ్యాధులు, నూలి పురుగులను నివారిస్తోంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు. ఓం ఇభవక్రాయ నమః శమీ పత్రం పూజయామి.. జమ్మి చెట్టు ఆకులను శమీ పత్రాలంటారు. మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుంది. ఓం వినాయక నమః అశ్వత్థ పూజయామి.. అశ్వత్థ పత్రం: రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మలబద్దకం, కామె ర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, నోటి పూత, చర్మవ్యాధులను నివారిస్తుంది. జీర్ణశక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి.. తెల్లమద్ది ఆకులను అర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల నివారణకు బాగా పని చేస్తుంది. ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి.. జిల్లేడు ఆకులను అర్క పత్రాలంటారు. ఇవి చర్మవ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు, వ్రణాలను తగ్గిస్తాయి. -
కూల్ నాయక్
లార్డ్‌లా ఉండడు గణేశుడు. మనం ఉండనివ్వం కదా..! ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకుంటాం. క్రికెట్ టీమ్‌లోకి తీసుకుంటాం. ‘గురూ లిఫ్ట్..’ అనీ అడగగలం. మనలాగే.. ఓ మనిషిలాగే.. హ్యూమన్–ఫ్రెండ్లీ గాడ్! ప్రసన్నవదనుడు. కోపమెరుగని కూల్ నాయక్. నాయకుడు గంభీరంగా ఉంటాడు. తీక్షణమైన అతడి చూపుకే అరికాళ్లు చల్లబడిపోతాయి. మాటకైతే వెన్ను ఝల్లుమంటుంది. ‘దళపతి’లో రజనీకాంత్ నాయకుడు. ‘నాయకుడు’లో కమల్ హాసన్ నాయకుడు. గణపతి దగ్గరున్న చనువు దళపతి దగ్గర ఉండదు మనుషులకు. వినాయకుడి దగ్గరుండే చొరవ నాయకుడి దగ్గర ఉండదు. వీర గణపతి, శక్తి గణపతి, మహా గణపతి.. తక్కిన ఏకవింశతి గణపతుల్నీ (21 మంది), అవాంతర భేద గణపతుల్నీ (11 మంది) బాలగణపతిలానే భావించి ఆయనతో ఆటలు ఆడతాం. ‘పోనీలే.. పిల్ల గ్యాంగ్..’ అనుకుంటాడేమో బాస్! ఆయన ముందు ఎన్ని వేషాలు వేసి, ఆయన చేత ఎన్ని వేషాలు వేయించినా వేడుక చూస్తుంటాడు తప్ప, రజనీకాంత్‌లా.. ‘వీడు సూర్యా.. రెచ్చగొట్టకండి’ అని మండపంలోంచి లేచి, చూపుడు వేలెత్తి వార్నింగ్ ఇవ్వడు. కమల్‌హాసన్‌లా.. ‘ఏయ్.. ఎవడికి తెల్సు వాడిల్లు. ఎవడికి తెల్సు? ఏయ్ సామీ నీకు తెలుసా?’ అని ఆరా తియ్యడు.. పంచె పైకి ఎగ్గట్టి. ఎన్ని అవతారాలు ఉన్నా.. భక్తుల దగ్గర మాత్రం ఆయన ‘కూల్’నాయకే. ప్రసన్న గణపతి. నిధీ శర్మ అని ఒక అమ్మాయి ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటుంది. ఈసారి చాక్లెట్ గణపతిని పెట్టుకుంది! ఎవరైనా అడిగితే వాళ్లకు కూడా చిన్న చిన్న చాక్లెట్ గణపతుల్ని తయారుచేసి ఇస్తోంది. విఘ్నేశ్వరుడితో తనకు ఏనాటి నుంచో ఎకో–ఫ్రెండ్షిప్ ఉందని అంటోంది. ప్రతి వినాయక చవితికీ ఏకదంతుణ్ణి కెమికల్ రహితుడిగా సృష్టించుకుని, పూజించుకుని నీళ్లలో నీటిలా గంగమ్మ తల్లి ఒడిలో వదిలేస్తుందట. మరి ఈసారి చాక్లెట్ వినాయకుడు కదా! నీటిలోనే కలిపేస్తుందా? లేదు. పాలలో కలిపి బాగా షేక్ చేసి.. చుట్టుపక్కల వాళ్లందరికీ ప్రసాదంలా పంచిపెట్టబోతోంది! ‘‘ఆ ప్రసాదం ఒంట్లోకి వెళ్లి సర్వ రోగాల నుంచి నిరోధకత ఇస్తుంది’’ అని నమ్ముతోంది నిధీ శర్మ. శాస్త్రం అంగీకరిస్తుందా? అది తెలియదు కానీ, వినాయకుడు మాత్రం అనుగ్రహించకుండా ఉండడు. భక్తుల్ని ఆయన ఒక్కనాడైనా ఆగ్రహించినట్లు రుగ్వేదంలో లేదు, శైవ సంప్రదాయంలో లేదు, గణేశ ముద్గల బ్రహ్మాండ బ్రహ్మ పురాణాలలోనూ లేదని అంటారు. కనుక ఆ చాక్లెట్ భక్తురాలికి ఆయనిచ్చే వరాలేవీ సంఖ్య తగ్గిపోవు. ఆమెలాగే.. ముంబైలోని ఘట్కోపర్లో ఒకాయన ఈయేడు డిఫరెంట్‌గా శానిటైజర్ గణేశ్‌ని ప్రతిష్టించాడు. ఆ స్వామి వారి విగ్రహం దగ్గరకు వెళ్లి చేతులు జోడించే ముందు.. ఆయన అభయహస్తం నుంచి శానిటైజర్ వచ్చి అరిచేతుల్లో పడుతుంది! సెన్సర్లు బిగించిన టెక్–గణేశ్ ఆయన. ‘కనీస జాగ్రత్త గణపతి’. మట్టి ముద్దతో ఏమైనా చేయొచ్చు. అలాగే భక్తితో వినాయకుడికి ఎలాంటి ఆకృతినైనా తేవచ్చు. సరళసాధ్యుడు (ఫ్లెక్సిబుల్) కనుకే పిల్లల చేతిలో ‘క్లే’ లా.. బహురూప, భావస్వరూప మూర్తి అయ్యాడు. అడుగుల్ని పెంచినా, తగ్గించినా ఏమనడు గజాననుడు. అసలైతే మట్టితో చేయాలి ఆయన రూపాన్ని. అదొదిలి హంగుల్ని దిద్దినా.. తెలుసుకుంటార్లే అని వదిలేస్తాడు. ఇప్పుడు మండపాలు పెట్టడానికి, పదిమంది చేరడానికి వీల్లేకపోయాక.. తెలిసి రాకుండా ఉంటుందా? చేతుల్లో పట్టేంత మట్టి గణపతి ప్రతిమను ఇళ్లల్లో పెట్టుకుంటున్నాం ఈసారి. మంచికే. ఆరోగ్య సిద్ధి గణపతికి ప్రణామాలు. ఘట్కోపర్లోని శానిటైజర్ గణేశుడు -
దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..!
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాలతో సహా.. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతాయి. ప్రతి వీధిలో ఒక గణేష్ మండపం తప్పనిసరి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు బొజ్జ గణపయ్య దగ్గర చేరతారు. ఇక చిన్నారుల సంతోషానికి హద్దే ఉండదు. వినాయకుడి చేతిలో లడ్డు, వాహనం ఎలుక ఎంత ముఖ్యమో.. గణేష్ మండపంలో మ్యూజిక్ సిస్టమ్ అంతే ముఖ్యం. ఇక ఉదయం, సాయంత్రం ఓ ఐదారు గంటల పాటు వినాయకుడి పాటలతో హోరెత్తిస్తారు. ప్రస్తుతం ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా కొన్ని వందల కొత్త పాటలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్ని పాటలు వచ్చినప్పటికి మన తెలుగు సినిమాల్లోని కొన్ని వినాయకుడి పాటలు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అలా కమర్షియల్ చిత్రాల్లో బాగా పాపులర్ చెందిన లంబోదరుడి పాటలు.. దండాలయ్యా.. ఉండ్రాలయ్యా వెంకటేష్, టబు జంటగా నటించి కూలీ నం.1 చిత్రంలో వినాయకుడిని కొలుస్తూ.. వచ్చే ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’ పాట ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1999లో వచ్చిన ఈ చిత్రంలో వినాయకుడి గురించి వచ్చే ఈ పాట ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇప్పటికి ప్రతి గణేష్ మంటపం దగ్గర ఈ పాట ప్లే కావాల్సిందే. వక్రతుండ మహకాయ కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన ‘దేవుళ్లు’ సినిమాలో గణేశుడ్ని కీర్తిస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా నటించి, పాడిన ‘వక్రతుండ మహకాయ’ పాట ఇప్పటికి వినాయక చవితి ఉత్సవాల్లో వినిస్తూనే ఉంటుంది. (గణేశ్ ఉత్సవాలకు 127 ఏళ్లు) జై జై గణేషా.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో 2006 లో విడుదలైన ‘జై చిరంజీవి’ సినిమాలోని ‘జై జై గణేషా’ పాటకు మాస్లో సూపర్ క్రేజ్. ఇక మెగస్టార్ చిరంజీవి చిందేసిన పాట కావడంతో ప్రతి గణేషుడి మంటపం దగ్గర ఈ పాట హోరెత్తాల్సిందే. గణపతిబప్పా మోరియా హిందీలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన ‘ఎనీ బడీ కెన్ డ్యాన్స్’ (ఏబీసీడీ)సినిమాలోని ‘గణపతిబప్పా మోరియా’ పాట దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మన తెలుగు నాట కూడ గణేష్ మండపాల్లో ఈ పాట తప్పక వినిపిస్తుంది. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు) ఇక మహేశ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’లో జగడమే పాటలో ఒక బిట్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ ఒక బిట్ సాంగ్ ఉంది. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, రవితేజ నటించిన ‘పవర్’ సినిమాలో వినాయకుడి పాటలు ఉన్నాయి. ఇక రామ్ హీరోగా నటించిన ‘గణేష్’ సినిమాలో వినాయకుడిపై ఒక పాట ఉంది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘డిక్టేటర్’ మూవీలో వినాయకుడిని కీర్తిస్తూ.. ‘గం గం గణేషా’ అనే పాట తెరకెక్కిందే. ఇక నాని, నాగార్జున నటించిన దేవదాస్ చిత్రంలోని ‘లక లక లకుమికరా’ పాట కూడా బొజ్జ గణపయ్యను కొలిచే పాటే. అలానే నాగ చైతన్య, తమన్న జంటగా వచ్చిన 100 పర్సెంట్ లవ్‌లో కూడా ‘తిరు తిరు గణనాథ’ అంటూ లంబోదరుడి పాట ఉంది. -
ప్రణవ స్వరూపునికి ప్రణతులు
వినాయకచతుర్థి రోజు అందరూ ప్రాఃతకాలానే లేచి అభ్యంగన స్నానమాచరించి పట్టుబట్టలు లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు, ఆనక స్వామికి ఇష్టమైన కుడుములు, అపూపములు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకథను చదువుకొని, కథాక్షతలని శిరస్సున ధరించి, బ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరు కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసు లగ్నం చేసి, ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటాము. రేపు వినాయక చవితి సందర్భంగా ఈ పండుగ ప్రాధాన్యతను, వినాయకుని విశిష్టతను మరోసారి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం. విఘ్ననిర్మూలన కై అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు. గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలంనుండి ఆరాధనలందుకుంటున్న దైవం, వేదాలలో స్తుతించబడి, గణాలకు అధిపతియై, శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా ‘గ’ శబ్దం బుద్దికి ‘ణ’ శబ్దం జ్ఞానానికి ప్రతీక. సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటిలోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా ‘గణపత్యధర్వ శీర్షం’లో వర్ణించారు. గణాలంటే అక్షరాలతో ఏర్పడే ఛందస్సు– గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ ‘గణపతి’. అంతేకాకుండా ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడు అని కీర్తించారు. విష్ణుస్వరూపునిగా... సృష్టి ఆదిలో దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథునితో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం. శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం’. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’గణపతిని పెట్టినట్టు మన పురాణగాధ, దీనిలో అంతరార్థం ఏమిటంటే–మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –– అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది. మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది. ఈ బుద్ధి, సిద్ధి. ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి. ఆయన ఆసనంలో గల అంతరార్థం తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు! ఆయన భంగిమలను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడిపాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో లలితాసనం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. భారతీయ ప్రతిమలలో ఇది కాస్త అరుదైనప్పటికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆసనాన్ని సూచిస్తుంటాయి. ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. కర్మయోగులకు ఈ రెండూ అవసరమే కదా! ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట. తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు. గణ పతి నవ రాత్రులు ఎందుకు? భాద్రపదమాసంలో వానలు పడుతూ, ఎక్కడికక్కడ చిత్తడిగా, బురదగా ఉంటుంది. గుంటల్లో నీళ్ళు నిలిచి సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వినాయకునికి ఔషధ గుణాలున్న పత్రితో పూజ చేయడంవల్ల ఇంట్లో వాతావరణం బాగుండి, సూక్ష్మ క్రిములను నశింపజేస్తుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉంది. కొన్నిచోట్ల రానురాను మరుగున పడుతోంది. కొందరు పూజ ముగిసిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని తొలగించినప్పటికీ పత్రిని మాత్రం కనీసం తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉంచి తర్వాత నదిలో నిమజ్జనం చేస్తారు. అంటే, పదిరోజులపాటు మనం ఔషధ గుణాలున్న పత్రి నుండి వచ్చే గాలిని పీలుస్తాం. తొమ్మిది రోజుల తర్వాత సమీపంలోని నదిలోనో, చెరువులోనో నిమజ్జనం చేయడం వల్ల కూడా లాభమే చేకూరుతుంది. పత్రిలోని ఔషధ గుణాలలో కొన్నయినా ఆ నీటిలో చేరతాయి. ఆ రకంగా అవి నీటిలోని క్రిములను నశింపజేస్తాయి. ఆ నీటిని తాగినప్పుడు అనారోగ్యాలు కలగవు. తొమ్మిదిరోజులు జరిపే పూజ వల్ల ఆరోగ్యపరంగా సత్ఫలితం కలుగుతుందని నమ్మటం మూఢనమ్మకం కాదు! శాస్త్రీయంగా ఇది నిజమే. వినాయక వ్రతం ఆచారం వెనుక ఉన్న ఆయుర్వేద పరమైన కారణం ఇది. గణనాయకుడి అవతారాలెన్ని? వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. అవి 1. వక్రతుండుడు; 2. ఏకదంతుడు; 3 మహోదరుడు; 4. లంబోదరుడు; 5. గజాననుడు; 6. వికటుడు; 7. విఘ్నరాజు; 8. ధూమ్ర వర్ణుడు. – డి.వి.ఆర్.భాస్కర్ -
లచ్చిరాజుపేటకు అచ్చిరాని వినాయక చవితి
సాక్షి, పార్వతీపురం(విజయనగరం): వినాయకుడు ఆదిదేవుడు. వినాయకుని పూజకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొంటారు. వినాయకుని విగ్రహం మండపానికి తీసుకువచ్చేందుకు యువత తహతహలాడుతుంటారు. చందాలు ఎత్తుకుంటారు. మండపాన్ని రంగులతో అలంకరిస్తారు. చిన్నా పెద్దా అని తేడాలేకుండా నృత్యాలు చేస్తూ, భజనలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే... విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట గ్రామ ప్రజలకు ఆ సంతోషం దూరమయ్యింది. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలు వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉంటున్నారు. వినాయక చవితి అంటేనే ఆ గ్రామ ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. వినాయక చవితి ఏర్పాట్లు చేస్తామని ఆలోచన చేస్తేనే చాలా... ఏదో ఒక రూపంలో అశుభం జరుగుతుందన్నది గ్రామస్తుల నమ్మకం. గతంలో రెండు పర్యాయాలు వినాయక చవితి ఏర్పాట్లు చేసే సమయంలో మరిపి అచ్చియ్య(40), కోరాడ గంగవేణి(25)చనిపోయారు. దీంతో 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మానేశారు. తాజాగా మరో ఘటన.. గ్రామ యువత అంతా చేయిచేయి కలిపి ఈ ఏడాది వినయాక చవితిని జరుపుకోవాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా ఓ రోజు ఆలస్యంగా మంగళవారం ఉదయం గ్రామంలోని కొందరు యువత వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు పార్వతీపురం పట్టణానికి వచ్చారు. అయితే యువత వినాయక విగ్రహం కొనుగోలు చేయకముందే వారికి ఒక ఫోన్ వచ్చింది. గ్రామానికి చెందిన అంబటి నారాయణమ్మ(80) అనే వృద్ధురాలు మృతి చెందిందని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో యువత విగ్రహం కొనుగోలు చేయకుండానే వెనుదిరిగారు. దీనికి పరిష్కారం ఏమిటనే విషయాన్ని గ్రామ పెద్దలు పండితులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. సరదాగా చేద్దామనుకున్నాం.. వినాయక చవితిని పండగలా జరుపుకోవాలనుకున్నాం. మాకు తెలిసి 20 సంవత్సరాలుగా ఈ పండగ చేయలేదు. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే ఎందుకు జరుగుతుందని భావించాం. యువకులంతా కలసి వినాయక చవితి ఏర్పాట్లు చేసుకుందామనుకున్నాం. ఒక రోజు ఆలస్యంగా అయినా ఫరవాలేదు.. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి చవితి పండగను చేద్దామని భావించాం. విగ్రహం కొనుగోలు చేయడానికి నేను పార్వతీపురం వచ్చాను. ఇంతలోనే ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఊరిలో వృద్ధురాలు చనిపోయిందని. దీంతో మా లచ్చిరాజు పేటకు వినాయక చవితి అచ్చిరాదని మరోసారి రుజువైంది. – వెంకటరమణ, లచ్చిరాజు పేట -
వినాయక ఉత్సవాలకు సిటీ సిద్ధం
-
హద్దు దాటవద్దు
శ్రీకాకుళం సిటీ: ఉత్సవ ఉత్సాహం హద్దు మీరకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులకు ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ పలు సూచనలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయవద్దని హితవు పలికారు. నిబంధనలివే.. వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ, మున్సిపాలిటీ లేదా పంచాయతీ, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. విగ్రహాన్ని పెట్టదలచిన ప్రదేశం, కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లను ముందుగానే సమీపంలో ఉన్న పోలీస్ స్టేష న్కు సమర్పించాలి. మైక్ ఉపయోగించేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి. విగ్రహాల ఎత్తు, ఎన్ని రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారో ముందుగానే తెలియజేయాలి. నిమజ్జనానికి వెళ్లే దారి, ప్రదేశం, తేదీ, సమయం, వాహనం, తదితర వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. వాహనానికి సంబంధించి ట్రాన్సిట్ డిపార్టుమెంట్ అధికారుల వద్ద నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. పూజా మండపం వద్ద మైక్ శబ్దం 10 డెసీబుల్స్ మించరాదు. శబ్ద కాలుష్యం చేయకూడదు. అనుమతి ఇచ్చిన సమయంలోనే మైక్ ఉపయోగించాలి. అసభ్యకర పాటలు, కార్యక్రమాలు నిర్వహించకూడదు. వివాదాస్పద స్థలాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాల్లోనూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో విగ్రహం పెట్టేందుకు అనుమతించరు. పోలీసుల అనుమతుల కోసం ఈనెల 25వ తేదీ లోగా సంబంధిత డీఎస్పీ స్థాయి అధికారిని సంప్రదించాలి. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నీరు, ఇసుక, తదితర ముందస్తు జాగ్రత్తలు కమిటీ సభ్యులు తీసుకోవాలి. ఊరేగింపు సమయంలో మందుగుండు సామగ్రి, కర్రలు, ఆయుధాలు, మద్యం సేవించడం వంటివి లేకుండా చూసుకోవాలి. ముందస్తు అనుమతులు తీసుకున్నా నిబంధనలు పాటించకుండా, ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఆ అనుమతులు రద్దు చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని ఎస్పీ తెలిపారు.