గణనాయకం భజే..!
ఎన్నో విశేషాలకు నిలయమై, అగణిత శుభాలను అందించే ఏకదంత గణపతిని వివిధ రూపాల్లో, పలు నామాలతో కొలుచుకుంటారు. ప్రత్యేకంగా ‘వినాయక చవితి’ ఆరాధనలో గణనాథునికి అర్పించే దివ్యనీరాజనం మన సంస్కృతిలో, సంప్రదాయంలో భాగం.
గణపతిని జ్యేష్ఠ రాజుగా, సర్వదేవతలలో ప్రథమ పూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహా గణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకూ కూడా ప్రభువు. ప్రణవ నాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞ వల్క్యస్మృతి చెప్పింది.
శుభకరుడు గణపతి
‘గణ్యంతే బుధ్యంతే తే గణాః ’ అన్నట్లు సమస్త దృశ్యమాన వస్తు ప్రపంచానికి అధిష్టాన దేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు విఘ్నేశ్వరుడు. దేవతా గణాలు ఉద్భవించి, సృష్టి ప్రారంభం అయినప్పటినుండీ ఆది పురుషునిగా గణపతి పూజలందుకుంటున్నట్టుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణు స్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అన్న శ్లోకం సూచిస్తుంది.
వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో ఏకదంతుడై సంపదబొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధి వీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు.
విఘ్నేశ్వరుని సంసారం
గణేశుని పుట్టుకే ఒక అద్భుత సంఘటన. నలుగు పిండిని నలచి వినాయకుడిని చేసి ద్వారపాలకునిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడక తనను అడ్డగించినందుకు శివుడు కోపించి అతని తల దునిమేశాడు. పార్వతి విచారం చూడలేక తర్వాత శివుడే తన గణాలను పంపి ఏనుగు తల తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. సుందరతర శుభవదనుడై అరుణ కాంతితో అలరారుతూ జ్యోతి ప్రభలతో, ప్రకాశమానమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలగణపతి బ్రహ్మవిష్ణుశంకరులకు నమస్కరించి ‘క్షంతవ్యశ్చాపరాధోమే మానశ్చై వేదృశో నృణామ్’ అంటూ అభిమానవంతుడనై ప్రవర్తించిన తన అపరాధమును మన్నించమని కోరతాడు.
పార్వతీదేవి ఆ బాలుని దగ్గరగా తీసుకొని ‘‘గజవదనా! నీవు శుభకరుడవు. శుభప్రదాతవు. ఇక నుండి సమస్త దేవతలలోనూ ప్రథమార్చన నీకే లభిస్తుందని’’ ఆశీర్వదిస్తుంది. ఆనాటి నుండి గణనాథుని ప్రథమ పూజ్యుడుగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గాన్ని పొందడానికీ గణేశుని ఆవిర్భావానికీ తాత్త్విక సమన్వయ సంబంధం ఉందనీ శివపురాణం అత్యద్భుతంగా విశదీకరించింది.
ప్రజాపతి తన పుత్రికలైన సిద్ధిని, బుద్ధినీ గణపతికిచ్చి వివాహం జరిపించాడు. సిద్ధి బుద్ధి గణపతుల సంతానం క్షేముడు, లాభుడు అనేవారు. కార్యసాధనలో సిద్ధి, బుద్ధి తోడుగా ఉంటే లాభం, క్షేమం కలుగజేసే సందేశాత్మక ఆధ్యాత్మిక దృక్పథం వినాయకుని సంసారం.
తొలిపూజతో ఆరాధనాఫలం
వినాయకుడిని పూజించడం వలన శ్రీమహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వ శుభాలను చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినపుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మాంగదుడు చింతామణి క్షేత్రంలో గణేశుని ఆరాధించి కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయక చవితినాడు గణపతిని ఆరాధించేవారు సర్వరోగ విముక్తులై, ఆరోగ్యప్రద జీవనాన్ని గడుపుతారు. సమృద్ధినీ, మేధాశక్తినీ, విద్యాజయాన్నీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దేవుడు గణనాథుడు.
- డా.ఇట్టేడు అర్కనందనాదేవి
నిమజ్జన ఆంతర్యం
తొమ్మిదిరోజుల పాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి, ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపివేయడం బాధగానే ఉంటుంది కానీ, అది ఒక నియమం, సంప్రదాయం. ఆలయాల్లో, ఇంటిలోని పూజామందిరాల్లో పంచలోహాలతో చేసినవి లేదా కంచు, వెండి, బంగారు లోహాలతో చేసిన విగ్రహాలను ఉపయోగిస్తారు. అవి శాశ్వతంగా పూజించడానికి అనువుగా ఉంటాయి. కానీ నవరాత్రి ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను మట్టితో, రంగులతో, ఇతర పదార్థాలతో పెద్ద పెద్ద ఆకారాలుగా తీర్చిదిద్దుతారు. ఆలయాల్లో తప్ప ఇళ్లలోగానీ మరేచోట కూడా తొమ్మిది అంగుళాలకి మించిన విగ్రహాలు వాడరాదంటారు. వాటిని కూడా రోజూ నియమ నిష్ఠలతో పూజించాలి. అందుకే 3, 5, 9 రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ లోతైన నీటిలోగానీ నిమజ్జనం చేస్తారు. ఎన్నో అలంకరణ లతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేననీ, పంచభూతాలతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసి పోవలసిందనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది.