బంజారాహిల్స్: గణేశ్ మండపంలో లడ్డూ చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.70 జర్నలిస్టు కాలనీ సమీపంలోని అశ్విని లే అవుట్ పావనీ హోమ్స్‌లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం చేతిలో నిర్వాహకులు పది కిలోల లడ్డూ ఉంచారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఫిలింనగర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన పిల్లలు లడ్డూను దొంగిలించి పరారయ్యారు. ఆదివారం ఉదయం లడ్డూ కనిపించకపోవడంతో మండపం నిర్వాహకులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.
అందులో అదే అపార్ట్‌మెంట్లో పని చేస్తున్న ఎమ్మార్సీ కాలనీకి చెందిన ఓ మహిళ కుమారుడు మరో ఇద్దరు పిల్లలతో కలిసి లడ్డూ తీసుకుని పరారైన దృశ్యాలు కనిపించాయి. ఎనిమిదేళ్ల వయసున్న ఆ బాలుడిని విచారించగా తన తల్లి చెప్పడంతోనే ఈ దొంగతనం చేసినట్లు తెలిపాడు. లడ్డూను స్వాధీనం చేసుకున్న నిర్వాహకులు చోరీకి పాల్పడిన ముగ్గురు పిల్లలను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
గణేశుడి చేతిలో ఉన్న లడ్డూని పది మందికి పంచితే దోషాలు తొలగిపోతాయని, డబ్బు కలిసి వస్తుందనే నమ్మకంతోనే మహిళ ఈ పని చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తుండగానే అదే ప్రాంతంలో మరో గణనాథుడి మండపంలో లడ్డూ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా లడ్డూ దొంగతనాలపై ఫిర్యాదులు అందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: నిమజ్జనంలో అపశ్రుతి
Comments
Please login to add a commentAdd a comment