వినాయకుడిని పూజిద్దాం ఇలా.. | Ganapathi Pooja Vidhanam With Flowers And Leaves Special Story | Sakshi
Sakshi News home page

వినాయకుడిని పూజిద్దాం ఇలా..

Published Sat, Aug 22 2020 10:09 AM | Last Updated on Sat, Aug 22 2020 2:47 PM

Ganapathi Pooja Vidhanam With Flowers And Leaves Special Story - Sakshi

సాక్షి, ఉట్నూర్‌: భారతీయతలో ప్రకృతి ఆరాధన దాగి ఉంది. హిందూ దేవతారాధన, పండుగలకు ప్రపంచంలోనే ఎంతో విశిష్టత ఉంది. చెట్టు, పుట్ట, రాయి, రప్పా, నీరు, నిప్పు, భూమి, గాలి, ఆకాశం ఇలా దేనిని పూజించిన వాటి వెనుక ఉన్న పరమార్థం ప్రకృతిని ఆ రాధించడమే. ప్రతీ పూజ, ఆధ్యాత్మిక కార్యక్రమం వెనుక శాస్త్ర విజ్ఞానం (సైన్సు) దాగుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వినాయకచవితి పూజలోనూ అలాంటి అంశాలే ఉన్నాయి. వినాయక చవితి రోజున వినాయకుడిని ఏకవింశతి (21) పత్రాలతో పూజించడం సంప్రదాయం. ప్రకృతి వనరులను మానవ ఆరోగ్యానికి ఉపయోగించుకోవడంతో పాటు వాటిని దైవ సమానంగా చూసుకోవాలని ప్రతీ పూజ తెలియజేస్తోంది. గణపతికి సమర్పించే 21 రకాల పత్రి.. వాటి విశిష్టత.. పూజ సందర్భంలో పఠించాల్సిన మంత్రాల గురించి ఓ సారి పరిశీలిద్దాం.

ఓం సముఖాయ నమః మాచీపత్రం పూజయామి..  
మాచీ పత్రం: తెలుగులో దీనిని మాచపత్రి అంటారు. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి. ఇవి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి.

ఓం గణాధిపాయనమః బృహతీ పత్రం పూజయామి.. 
బృహతీ పత్రం: దీనిని ములక, వాకుడాకు అంటారు. ఇవి వంగ ఆకుల మాదిరి, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర, నేత్ర, వ్యాధులను నయం చేస్తుంది. దంతధావనానికి కూడా ఉపయోగిస్తారు.

ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి.. 
బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా కూడా లభ్యమవుతుంది. ఇవి శివుడికి ఇష్టమైనవి. మహాలక్ష్మికి ఊడా ఇష్టమైనవిగా వేద పండితులు చెబుతుంటారు. ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధాన్ని తగ్గిస్తుంది.

ఓం గుహాగ్రజాయనమః అపామార్గ పత్రం పూజయామి.. 
అపామార్గ పత్రం: తెలుగులో ఉత్తరేణి అంటారు. గింజలు సన్నటి ముళ్లను కలిగి ఉంటాయి. ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారుట, అర్ష మొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. 

ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి..
కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. పువ్వులు తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. దురుద, కంటి, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.

ఓం గజానయ నమః దూర్వా యుగ్మం పూజయామి..
దూర్వా యుగ్మం: దూర్వా యుగ్మం అంటే గరిక. ఇందులో తెల్లగరిక, నల్ల గరిక అనే రకాలున్నాయి. ఇది వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శ మొలలను నివారిస్తుంది.

ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి..
దత్తూర పత్రం: దత్తూర అంటే ఉమ్మెత్త మొక్క. ఇది సెగ గడ్డలు, స్తనవాపు, చర్మ, శ్వాసకోశ వ్యాధులు, పేను కొరుకుడు, నొప్పులు, రుతువ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితమైనది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి.

ఓం గజకర్ణాయనమః తులసీ పత్రం పూజయామి..
తులసీ పత్రం:  హిందువులు దేవతార్చనలో వీటిని విధిగా వాడతారు. ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలను తగ్గిస్తుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఓం భిన్నదంతాయనమః విష్ణుక్రాంత పత్రం పూజయామి..
విష్ణు క్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతోంది.

ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి..
బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు ఆకు. ఇందులో రేగు, జిట్రేగు, గంగరేగు అనే మూడు రకాలున్నాయి. జీర్ణకోశ, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లలకు వచ్చే వ్యాధుల నివారణకు ఉపయోగపడుతోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి..
చూతపత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. వీటిని వాడని  హైందవ గృహాలు ఎక్కడ ఉండవు. ఇది రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతోంది.

ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి..
దాడిమీ అంటే దానిమ్మ మొక్క. విరేచనాలు, గొంతు నొప్పి,  తగ్గిస్తుంది.

ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి
దేవతలకు ఇష్టమైన ఆకు దేవదారు.  అజీర్తి, పొట్ట వ్యాధులను తగ్గిస్తుంది.

ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి
ధవనం, మరువం అంటారు. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జుట్టు రాలడం, చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

ఓం హేరంభాయ నమః సింధువార పూజయామి..
వావిలి అంటారు. జ్వరం, గాయాలు, చెవిపోటు, మూర్ఛవ్యాధి, ప్రసవం అనంతరం వచ్చే ఇబ్బందులను తగ్గిస్తాయి.

ఓం శూర్సకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి..
జాజీ పత్రం: ఇది సన్న జాజిగా పిలువబడే మల్లి జాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయ వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది.

ఓం సురాగ్రజాయ నమః  గండకీ పత్రం పూజయామి
దీనిని లతా దూర్వా, దేవ కాంచనం అంటారు. మూర్ఛ, కఫం, పొట్ట సంబంధిత వ్యాధులు, నూలి పురుగులను నివారిస్తోంది. దీని ఆకులను ఆహారంగా కూడా వినియోగిస్తారు.

ఓం ఇభవక్రాయ నమః శమీ పత్రం పూజయామి..
జమ్మి చెట్టు ఆకులను శమీ పత్రాలంటారు. మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులను నివారించేందుకు ఉపయోగపడుతుంది.

ఓం వినాయక నమః అశ్వత్థ పూజయామి..
అశ్వత్థ పత్రం: రావి ఆకులను అశ్వత్థ పత్రాలంటారు. ఇవి మలబద్దకం, కామె ర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, నోటి పూత, చర్మవ్యాధులను నివారిస్తుంది. జీర్ణశక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.

ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి..
తెల్లమద్ది ఆకులను అర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల నివారణకు బాగా పని చేస్తుంది.

ఓం కపిలాయ నమః అర్క పత్రం పూజయామి..
జిల్లేడు ఆకులను అర్క పత్రాలంటారు. ఇవి చర్మవ్యాధులు, సెగగడ్డలు, కీళ్ల నొప్పులు, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు, వ్రణాలను తగ్గిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement