హద్దు దాటవద్దు
శ్రీకాకుళం సిటీ: ఉత్సవ ఉత్సాహం హద్దు మీరకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులకు ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ పలు సూచనలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయవద్దని హితవు పలికారు.
నిబంధనలివే..
వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ, మున్సిపాలిటీ లేదా పంచాయతీ, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్‌ల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి.
విగ్రహాన్ని పెట్టదలచిన ప్రదేశం, కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లను ముందుగానే సమీపంలో ఉన్న పోలీస్ స్టేష న్‌కు సమర్పించాలి.
మైక్ ఉపయోగించేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి తప్పనిసరి.
విగ్రహాల ఎత్తు, ఎన్ని రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారో ముందుగానే తెలియజేయాలి.
నిమజ్జనానికి వెళ్లే దారి, ప్రదేశం, తేదీ, సమయం, వాహనం, తదితర వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి.
వాహనానికి సంబంధించి ట్రాన్సిట్ డిపార్టుమెంట్ అధికారుల వద్ద నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి.
పూజా మండపం వద్ద మైక్ శబ్దం 10 డెసీబుల్స్ మించరాదు. శబ్ద కాలుష్యం చేయకూడదు. అనుమతి ఇచ్చిన సమయంలోనే మైక్ ఉపయోగించాలి. అసభ్యకర పాటలు, కార్యక్రమాలు నిర్వహించకూడదు.
వివాదాస్పద స్థలాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాల్లోనూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో విగ్రహం పెట్టేందుకు అనుమతించరు.
పోలీసుల అనుమతుల కోసం ఈనెల 25వ తేదీ లోగా సంబంధిత డీఎస్పీ స్థాయి అధికారిని సంప్రదించాలి.
మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నీరు, ఇసుక, తదితర ముందస్తు జాగ్రత్తలు కమిటీ సభ్యులు తీసుకోవాలి.
ఊరేగింపు సమయంలో మందుగుండు సామగ్రి, కర్రలు, ఆయుధాలు, మద్యం సేవించడం వంటివి లేకుండా చూసుకోవాలి.
ముందస్తు అనుమతులు తీసుకున్నా నిబంధనలు పాటించకుండా, ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఆ అనుమతులు రద్దు చేసి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని ఎస్పీ తెలిపారు.