లార్డ్‌లా ఉండడు గణేశుడు. మనం ఉండనివ్వం కదా..! ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకుంటాం. క్రికెట్ టీమ్‌లోకి తీసుకుంటాం. ‘గురూ లిఫ్ట్..’ అనీ అడగగలం. మనలాగే.. ఓ మనిషిలాగే.. హ్యూమన్–ఫ్రెండ్లీ గాడ్! ప్రసన్నవదనుడు. కోపమెరుగని కూల్ నాయక్.
నాయకుడు గంభీరంగా ఉంటాడు. తీక్షణమైన అతడి చూపుకే అరికాళ్లు చల్లబడిపోతాయి. మాటకైతే వెన్ను ఝల్లుమంటుంది. ‘దళపతి’లో రజనీకాంత్ నాయకుడు. ‘నాయకుడు’లో కమల్ హాసన్ నాయకుడు. గణపతి దగ్గరున్న చనువు దళపతి దగ్గర ఉండదు మనుషులకు. వినాయకుడి దగ్గరుండే చొరవ నాయకుడి దగ్గర ఉండదు. వీర గణపతి, శక్తి గణపతి, మహా గణపతి.. తక్కిన ఏకవింశతి గణపతుల్నీ (21 మంది), అవాంతర భేద గణపతుల్నీ (11 మంది) బాలగణపతిలానే భావించి ఆయనతో ఆటలు ఆడతాం.
‘పోనీలే.. పిల్ల గ్యాంగ్..’ అనుకుంటాడేమో బాస్! ఆయన ముందు ఎన్ని వేషాలు వేసి, ఆయన చేత ఎన్ని వేషాలు వేయించినా వేడుక చూస్తుంటాడు తప్ప, రజనీకాంత్‌లా.. ‘వీడు సూర్యా.. రెచ్చగొట్టకండి’ అని మండపంలోంచి లేచి, చూపుడు వేలెత్తి వార్నింగ్ ఇవ్వడు. కమల్‌హాసన్‌లా.. ‘ఏయ్.. ఎవడికి తెల్సు వాడిల్లు. ఎవడికి తెల్సు? ఏయ్ సామీ నీకు తెలుసా?’ అని ఆరా తియ్యడు.. పంచె పైకి ఎగ్గట్టి. ఎన్ని అవతారాలు ఉన్నా.. భక్తుల దగ్గర మాత్రం ఆయన ‘కూల్’నాయకే. ప్రసన్న గణపతి.
నిధీ శర్మ అని ఒక అమ్మాయి ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటుంది. ఈసారి చాక్లెట్ గణపతిని పెట్టుకుంది! ఎవరైనా అడిగితే వాళ్లకు కూడా చిన్న చిన్న చాక్లెట్ గణపతుల్ని తయారుచేసి ఇస్తోంది. విఘ్నేశ్వరుడితో తనకు ఏనాటి నుంచో ఎకో–ఫ్రెండ్షిప్ ఉందని అంటోంది. ప్రతి వినాయక చవితికీ ఏకదంతుణ్ణి కెమికల్ రహితుడిగా సృష్టించుకుని, పూజించుకుని నీళ్లలో నీటిలా గంగమ్మ తల్లి ఒడిలో వదిలేస్తుందట. మరి ఈసారి చాక్లెట్ వినాయకుడు కదా! నీటిలోనే కలిపేస్తుందా? లేదు. పాలలో కలిపి బాగా షేక్ చేసి.. చుట్టుపక్కల వాళ్లందరికీ ప్రసాదంలా పంచిపెట్టబోతోంది! ‘‘ఆ ప్రసాదం ఒంట్లోకి వెళ్లి సర్వ రోగాల నుంచి నిరోధకత ఇస్తుంది’’ అని నమ్ముతోంది నిధీ శర్మ. శాస్త్రం అంగీకరిస్తుందా? అది తెలియదు కానీ, వినాయకుడు మాత్రం అనుగ్రహించకుండా ఉండడు.
భక్తుల్ని ఆయన ఒక్కనాడైనా ఆగ్రహించినట్లు రుగ్వేదంలో లేదు, శైవ సంప్రదాయంలో లేదు, గణేశ ముద్గల బ్రహ్మాండ బ్రహ్మ పురాణాలలోనూ లేదని అంటారు. కనుక ఆ చాక్లెట్ భక్తురాలికి ఆయనిచ్చే వరాలేవీ సంఖ్య తగ్గిపోవు. ఆమెలాగే.. ముంబైలోని ఘట్కోపర్‌లో ఒకాయన ఈయేడు డిఫరెంట్‌గా శానిటైజర్ గణేశ్‌ని ప్రతిష్టించాడు. ఆ స్వామి వారి విగ్రహం దగ్గరకు వెళ్లి చేతులు జోడించే ముందు.. ఆయన అభయహస్తం నుంచి శానిటైజర్ వచ్చి అరిచేతుల్లో పడుతుంది! సెన్సర్‌లు బిగించిన టెక్–గణేశ్ ఆయన. ‘కనీస జాగ్రత్త గణపతి’.
మట్టి ముద్దతో ఏమైనా చేయొచ్చు. అలాగే భక్తితో వినాయకుడికి ఎలాంటి ఆకృతినైనా తేవచ్చు. సరళసాధ్యుడు (ఫ్లెక్సిబుల్) కనుకే పిల్లల చేతిలో ‘క్లే’ లా.. బహురూప, భావస్వరూప మూర్తి అయ్యాడు. అడుగుల్ని పెంచినా, తగ్గించినా ఏమనడు గజాననుడు. అసలైతే మట్టితో చేయాలి ఆయన రూపాన్ని. అదొదిలి హంగుల్ని దిద్దినా.. తెలుసుకుంటార్లే అని వదిలేస్తాడు. ఇప్పుడు మండపాలు పెట్టడానికి, పదిమంది చేరడానికి వీల్లేకపోయాక.. తెలిసి రాకుండా ఉంటుందా? చేతుల్లో పట్టేంత మట్టి గణపతి ప్రతిమను ఇళ్లల్లో పెట్టుకుంటున్నాం ఈసారి. మంచికే. ఆరోగ్య సిద్ధి గణపతికి ప్రణామాలు.
ఘట్కోపర్‌లోని శానిటైజర్ గణేశుడు
Comments
Please login to add a commentAdd a comment