అంతర్గత బదిలీల్లో రాజకీయం
మేయర్‌ను వ్యతిరేకిస్త్తున్న ఓ వర్గం
ఆనం పాత్ర ఉందంటూ మేయర్ వర్గం ఆరోపణ
నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థలో రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరుతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇద్దరు అధికారపార్టీ నేతల మధ్య రేగిన వివాదం రెండు సామాజికవర్గాల మధ్య చిచ్చుపెడుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌లో శానిటరీ సూపర్‌వైజర్, ఇన్‌స్పెక్టర్ల అంతర్గత బదిలీల వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. మేయర్ అజీజ్ వ్యవహారంపై ఓ సామాజికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ వర్గాన్ని అణిచేస్తున్నారని మండిపడుతున్నారు. మేయర్‌పై మంత్రి నారాయణకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఆనం వివేకా హస్తం ఉందంటూ మేయర్ వర్గం ఆరోపిస్తోంది. కార్పొరేషన్లో పట్టు కోసం సామాజికవర్గాలను రెచ్చగొడుతున్నారని మేయర్ వర్గం విమర్శలు చేస్తోంది. కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాల్యాద్రిని ఇటీవల బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే మేయర్, వివేకా మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో ఓ సామాజికవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి ఆనం వర్గీయుడు పిండి సురేష్ హాజరయ్యారు. ఆరోజు మేయర్ వ్యవహారంపై సుదీర్గంగా చర్చించారు. మంత్రి లేదంటే.. సీఎంను కలిసి వివరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదేక్రమంలో గురువారం ఆనం వర్గీయులైన కిన్నెర మాల్యాద్రి, రంగమయూర్‌రెడ్డి అనుచరులు కమిషనర్‌ను కలిసి బదిలీ విషయాన్ని ప్రస్తావించారు. అయితే కమిషనర్ మాత్రం బదిలీలను నిబంధనల మేరకే చేశామని చెప్పారు.
సామాజికవర్గాన్ని రెచ్చగొడుతున్న వైనం : కార్పొరేషన్ పరిధిలో ఇటీవల జరిగిన టెండర్ల రద్దు.. అధికారుల బదిలీలను అస్త్రాలుగా చేసుకుని ఆనం ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్లో పనిచేసే అధికారులకు ఈ విషయం తెలియడంతో వణికిపోతున్నారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆనం వివేకా ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని తెలుసుకున్న మేయర్ తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. అందులో భాగంగా గురువారం రాత్రి అదే సామాజిక వర్గానికి చెందిన మరో వర్గం మేయర్ అజీజ్‌ను కలవడం గమనార్హం. అయితే ఈ విషయంలో మేయర్ వర్గానికి చెందిన కొందరు కార్పొరేషన్ ఉద్యోగులను కలిసి ఈ విషయంలో తలదూర్చవద్దని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మొన్నటి వరకు కలిసి ఉన్న కొందరు ఉద్యోగులు ఆ వర్గంతో దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఆనం, మేయర్ ఇద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు సామాజిక వర్గాన్ని బలిచేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కార్పొరేషన్లో తారస్థాయికి రచ్చ
Published Fri, Mar 18 2016 10:33 AM | Last Updated on Fri, Jun 1 2018 7:42 PM
Advertisement
Advertisement