ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ ఉద్యోగుల జంట మండలంలోని మావల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆదిలాబాద్‌లో కలకలం రేపింది. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రూరల్ ఏఎస్సై పొచ్చన్న, ప్రత్యక్ష సాక్షి శ్రీకాంత్ కథనం ప్రకారం.. బోథ్ మండలం కౌట(బి) గ్రామానికి చెందిన రావుల తిరుపతిరెడ్డి కూతురు సుధారాణికి నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఊరుర్ గ్రామానికి చెందిన సాయరెడ్డితో వివాహం జరిగింది.
వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సాయరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ డిపో-2లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సుధారాణి కొంతకాలంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. పట్టణంలోనే నివాసం ఉంటోంది. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన దార్ష రాములు, లక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్ ఆర్టీసీ అద్దె బస్సుపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య నుంచి విడాకులు పొందడంతో ఒంటరిగా ఉంటున్నాడు.
ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న సుధాకర్(38), సుధారాణి(26)ల మధ్య ఏర్పడిన పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. బుధవారం వారిద్దరూ కలిసి సీతాగొంది జాతీయ రహదారిపై ఉన్న దాబాలో భోజనం చేశారు. అక్కడి నుంచి సుధాకర్ స్నేహితుడు శ్రీకాంత్‌తో కలిసి మోటారు సైకిల్‌పై మావల చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్దకు వెళ్లిన తర్వాత శ్రీకాంత్ తమ ఆత్మహత్యను అడ్డుకుంటాడనే ఉద్దేశంతో వారు అతడిని చెరువు ఇవతలి వైపు తోసేశారు. ఆ తర్వాత సుధాకర్, సుధారాణి కలిసి చెరువులో దూకారు.
శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీయించారు. వివాహేతర సంబంధం బయటకు పొక్కడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు. సుధారాణి మృతదేహాన్ని తండ్రి తిరుపతిరెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. ఏదేమైనా ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య అటు కుటుంబాలతోపాటు డిపోలో విషాదాన్ని మిగిల్చింది.
ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య
Published Thu, Feb 6 2014 5:29 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM
Advertisement