ఒక్క బుల్లెట్ ప్రపంచ చరిత్రనే మార్చేసింది!
వందేళ్ల కింద పేలిన ఒక్క బుల్లెట్ ప్రపంచచరిత్రను మార్చేసింది. నాలుగేళ్లు ప్రపంచమంతా రణసీమగా మారిపోయింది. లక్షల మంది చనిపోయారు. అవును... సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 28, 1914 న ఒక 19 ఏళ్ల కుర్రాడు పేల్చిన తుపాకీ మొదటి ప్రపంచయుద్ధానికి దారితీసింది.
సెర్బియాకి చెందిన గావ్రిలో ప్రిన్సిప్ అనే జాతీయ వాది ఆస్ట్రియా ప్రభువు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీలను కాల్చి చంపాడు. ఈ సంఘటన బోస్నియా రాజధాని సరయేవోలో జరిగింది. బోస్నియాకు ఆస్ట్రియా నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుతూ వారీ కాల్పులు జరిపారు. నలుగురు బోస్నియన్ యువకులు ప్రభువును చంపేందుకు పథకం వేశారు.
ఫెర్నినాండ్ ఓపెన్ టాప్ జీపులో, పూర్తి సైనిక వేషధారణలో ఊరేగుతుండగా నలుగురు యువకులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ముగ్గురు చివరి నిమిషంలో భయపడి బాంబులు వేయలేదు. నెడెల్కో కాబ్రినోవిచ్ అనే నాలుగో వ్యక్తి బాంబు వేశాడు. కానీ అది ఫెర్డినాండ్ కారుకి తగిలి కింద పడిపోయింది. ఆయనకు గాయాలు కాలేదు కానీ చాలా మంది ప్రజలు గాయపడ్డారు.
ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారిని చూసేందుకు ఫెర్డినాండ్ మరో కారులో బయలుదేరాడు. అదే సమయంలో డ్రైవర్ దారి తప్పి ఒక ఇరుకు సందులోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ తుపాకీతో నిలబడి ఉన్న గావ్రిలో ప్రిన్సిప్ కి గోల్డెన్ చాన్స్ వచ్చింది. ఒక బుల్లెట్ తో ఫెర్డినాండ్ గొంతు చీల్చేశాడు, రెండో బుల్లెట్ తో సోఫీని కాల్చేశాడు.
దీంతో ఆస్ట్రియా బోస్నియాపై యుద్ధం ప్రకటించింది. అక్కడి నుంచే రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాలన్నీ యుద్ధంలోకి దిగాయి. ఈ యుద్ధంలోనే తొలి సారి ట్రెంచ్ వార్ ఫేర్ మొదలైంది. ఈ యుద్ధం ప్రపంచ చరిత్రను, ప్రపంచ చిత్రపటాన్ని మార్చేసింది. శనివారం మొదటి ప్రపంచ యుద్ధం మొదలై వందేళ్లు పూర్తయింది.