ఐ బెగ్ యూ.... ప్లీజ్ స్టాప్...
వాటికన్ సిటీ : మొదటి ప్రపంచ యుద్ధం జరిగి నేటికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గతకాలపు తప్పులను పునరావృతం చేయవద్దంటూ ప్రపంచ ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. సంఘర్షణలను అధిగమించడానికి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వాసుల మధ్య జరుగుతున్న పోరు, ఇరాక్, ఉక్రెయిన్‌లో యుద్ధాలను ఆయన ప్రస్తావించారు.
ఆయన ఆదివారం సెయింట్ పీటర్ స్కేర్ వద్ద యాత్రికులు, భక్తులతో మాట్లాడారు. యుద్ధం కారణంగా చనిపోయిన చిన్నారులు, అనాథలైన పిల్లల గురించి తాను ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారులకు యుద్ధం శిథిలం ఒక ఆటవస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. యుద్ధాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రపంచయుద్ధాన్ని అనవసర మారణకాండగా పోప్ బెనెడిక్ట్ 15 ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు.