వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ రానున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేసేందుకు ప్రెసిడెన్షియల్ సూట్‌ను బుక్ చేసినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఈ పర్యటనలో ట్రంప్ రెండు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్, అప్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతాలలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదంపై చర్చించనున్నారు. దీంతో పాటు చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప భారత్‌తోనూ ఆ తరహా విధానాన్ని అమలు చేసేందుకు చర్చ జరపనున్నట్లు సమాచారం అందింది. దీంతో పాటు యుఎస్ నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై వీరిద్దరి భేటీలో చర్చకు రానుంది. జీఎస్పీ ఉపసంహరణ తర్వాత భారతదేశం తన సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ 6 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటుండగా, ఈ ఒప్పందాన్ని అధిగమించడానికి చమురు లేదా షేల్ గ్యాస్‌పై హామీలు పొందాలని భారత్ భావిస్తుంది.
కాగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలో ఐరాస మానవహక్కుల మండలిలో(యూఎన్‌హెచ్‌ఆర్సీ) సెషన్‌లో భారత్‌పై మాటల యుద్దం చేసేందుకు పాక్ సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ భారత్ పర్యటన ఆసక్తికరంగా మారింది. మోదీ పాలనలో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక), ఎన్పీఆర్ వంటి నిర్ణయాల వల్ల భారతీయ ముస్లింలు ముప్పులో ఉన్నారన్న అంశాన్ని పాక్ మండలిలో లేవనెత్తనుందన్న సమాచారం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment