సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రంప్ అహ్మదాబాద్‌లో ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంచనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు.
(చదవండి : ట్రంప్ పర్యటన పుణ్యమా అని..)
ఇక ట్రంప్ ఆగ్రాలో కూడా పర్యటిస్తుండడంతో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత ఏర్పాటు విషయంలో అధికారులు ఏమాత్రం రాజీ పడడంలేదు. ముఖ్యంగా కోతుల వల్ల అమెరికా అధ్యుక్షుడి పర్యటనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చని భావించిన అధికారులు.. కోతుల పని పట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు.
(చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం)
గత ఆరు నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన వారి చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయని సందర్శకులు వాపోతున్నారు. దీంతో ట్రంప్ పర్యటనకు కోతుల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు ఐదు కొండముచ్చులను తాజ్‌మహాల్ సమీపంలో ఉంచారు. కొండముచ్చులను చూసి కోతులు భయపడతాయి. అవి ఉన్న సమీపానికి కోతులు రాలేవు. అందుకే అధికారులు కొండముచ్చులను రంగంలోకి దించారు. మొత్తానికి కొండముచ్చులు కూడా అమెరికా అధ్యక్షుడికి రక్షణగా నిలిచాయన్నమాట.
కాగా, రెండు రోజుల భారత్ పర్యటలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) ఇండియాకు రానున్నారు. హ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం మొటేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం భార్య మెలానియా ట్రంప్‌తో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహాల్‌కు వెళ్తారు. రాత్రి ఢిల్లీలో బస చేస్తారు. ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు.అనంతరం హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment