సాక్షి, న్యూఢిల్లీ : అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన రక్షణ ఒప్పందంపై డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో నిలిచిన యూఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ విమర్శలు గుప్పించారు. కోట్లాది డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు బదులు వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్‌ను భాగస్వామ్యం చేయాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. బోయింగ్, లాక్‌హీడ్, రేతియన్ వంటి దిగ్గజ కంపెనీలకు లాభాల పంట పండిచేందుకు 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను భారత్‌కు విక్రయించే బదులు పర్యావరణ పరిరక్షణలో భారత్‌ను భాగస్వామిగా చేయడంపై దృష్టి సారిస్తే బావుండేదని శాండర్స్ హితవు పలికారు.
వాతావరణ కాలుష్య నియంత్రణ, సంప్రదాయేతర ఇంధన వనరుల సృష్టి, ఉపాధి కల్పనలపై సమిష్టిగా మనం పని చేస్తూ మన ప్లానెట్‌ను కాపాడుకునేందుకు కృషి సాగించే వారమని శాండర్స్ ట్వీట్ చేశారు. 78 ఏళ్ల శాండర్స్ ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనను ఢీకొనే గట్టి పోటీదారుగా ముందుకొస్తున్నారు. కాగా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం రక్షణ ఒప్పందంపై వారు కీలక ప్రకటన చేశారు. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ కసరత్తు సాగిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా మిగులుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment