
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొంటారు.
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరవనున్నారు. పలు విపక్ష నేతలను ఈ విందుకు ఆహ్వానించకపోయినా రాష్ట్రపతి ఇచ్చే విందులో మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొంటారని భావిస్తున్నారు. అగ్రదేశాధినేత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి విందును బహిష్కరించాలని లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి నిర్ణయించిన క్రమంలో విందుకు హాజరయ్యేందుకు సర్దార్జీ సంసిద్ధమవడం గమనార్హం. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని ఈ విందుకు ఆహ్వానించకపోవడంపై విపక్ష నేత మండిపడుతున్నారు. విపక్షాలకు చెందిన సీనియర్ నేతలను ఆహ్వానించే ఆనవాయితీని పక్కనపెట్టడమేనని చౌధరి పేర్కొన్నారు.
మనసు మార్చుకున్న మన్మోహన్
కాంగగ్రెస్ అధినేత్రి, యూపీఏ చీఫ్ సోనియా గాంధీని ఆహ్వానించనందుకు నిరసనగా ట్రంప్ గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు హాజరు కారాదని ముగ్గురు కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలు అధీర్ రంజన్ చౌధరి, గులాం నబీ ఆజాద్‌లు విందుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.