భారత్‌ పర్యటనలో భారీ ప్రయోజనం | Guest Column By Pentapati Pullarao On Donald Trump India Visit | Sakshi
Sakshi News home page

భారత్‌ పర్యటనలో భారీ ప్రయోజనం

Published Wed, Feb 26 2020 12:11 AM | Last Updated on Wed, Feb 26 2020 12:24 AM

Guest Column By Pentapati Pullarao On Donald Trump India Visit - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన గ్రాండ్‌ సక్సెస్‌ అనే చెప్పాలి. మొతెరా స్టేడియం నుంచి లక్షా పాతిక వేలమంది సమక్షంలో ప్రసంగించిన ట్రంప్‌ ఆద్యంతం అమెరికా–భారత్‌ స్నేహ సంబంధాల విశిష్టతను ప్రస్తావించారు. రాడికల్‌ ఇస్లాం ఉగ్రవాదాన్ని సహించబోమని, ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు పూర్తి మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్‌ ప్రకటన ప్రత్యక్షంగా పాకిస్తాన్‌కు, పరోక్షంగా చైనాకు తీవ్ర హెచ్చరిక. అయితే ఇతర దేశాలు మనల్ని గౌరవించాలంటే భారత్‌ తన ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఈ విషయంపై మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భారత్‌ బలానికి ఆర్థిక పటిష్టతే అసలైన పునాది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రాత్మక భారత్‌ పర్యటన ముగిసింది. ఆయన రెండు రోజుల పర్యటన భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. ఏ అమెరికన్‌ అధ్యక్షుడూ చేయని విధంగా ట్రంప్‌ వ్యవహారాలను నడుపుతారు. ఇంతవరకు ట్రంప్‌ తన జీవితకాలంలో ఒక్క ఎన్నికలో మాత్రమే పోటీ చేశారు.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన ట్రంప్‌ అమెరికన్‌ రాజకీయ దిగ్గజం హిల్లరీ క్లింటన్‌పై అందరి అంచనాలకు మించి విజయం సాధించారు. 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్‌ అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ చేయలేని విధంగా పాలన సాగించారు. అన్ని చట్టాలనూ ఆయన తోసిపడేశారు. నేడు ఆయన అతిశక్తిమంతుడు, సమయస్ఫూర్తి కలిగిన వారు కూడా. తన కేబినెట్‌ మంత్రులను కానీ, సాధారణ మీడియాను కానీ ట్రంప్‌ అస్సలు ఉపయోగించుకోరు. అనేక టీవీ చానళ్లు చూసి సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవును.. ఈరోజు అమెరికా ఆర్థికవ్యవస్థ గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వికాసంతో పరవళ్లు తొక్కుతోందనటం నిజం.

అమెరికా అధ్యక్షుడు కావడానికి ముందు ట్రంప్‌ చాలా అరుదుగా మాత్రమే విదేశాల్లో ప్రయాణించారు. భారత్‌ గురించి, దాని గతం గురించి ట్రంప్‌కి పెద్దగా తెలీదు. కానీ ప్రపంచంలో సాంకేతికరంగంలో పలువురు భారతీ యులు ఆధిపత్యం చలాయిస్తున్నారని తెలుసుకున్న ట్రంప్‌ భారతీ యుల ప్రతిభా సామర్థ్యాలపట్ల గొప్ప గౌరవం ప్రదర్శిస్తారు. అయితే భారత్‌ గురించి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఏమీ తెలీదు. పైగా భారతీయ ప్రముఖులను తాను ఎన్నడూ కలవలేదు. అందుకే తనతో కలిసి మోదీ నడుస్తారా అనే ఆందోళన ట్రంప్‌ను పీడిస్తోంది.

భారత్‌కు అమెరికా తోడు ఎందుకు?
మనదేశానికి ఇరుగు పొరుగు సమస్య చాలా పెద్దది. పాకిస్తాన్, చైనా దేశాలతో మనకు 10 వేల కిలోమీటర్ల సరిహద్దులున్నాయి. ఈ రెండు దేశాలతో భారత్‌కు తీవ్ర శతృత్వం ఉంది. పైగా భారత్‌కు వీటితో యుద్ధం చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే భారత్‌ నిరంతరం అంతర్జాతీయ ముఖచిత్రంలో కనబడుతూ, ఈ రెండు దేశాలూ ఇతర దేశాలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. అటు కశ్మీర్‌ విషయంలో పాక్‌తో ఘర్షణ పడుతూ, ఇటు చైనాతో సరిహద్దు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు తప్పకుండా అమెరికా మనసు గెల్చుకోవలసిన అవసరం ఉంది. మన శత్రుదేశాలు మనల్ని వేధించకుండా ఉండాలంటే అమెరికా మద్దతు పొందాలి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్నేహం అత్యవసరం.  ఒక విదేశీ అధ్యక్షుడు భారత్‌లో అతి పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడం చాలా అరుదు. కానీ రెండురోజుల ట్రంప్‌ పర్యటన భారీ విజయం పొందినట్లే మరి. ట్రంప్‌ పర్యటనలో మొదటి రోజు మరీ ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే ట్రంప్, ఆయన కుటుంబం బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్న దృశ్యాలను చూడడానికి భారతీయులు మొత్తంగా టీవీ సెట్లకు అతుక్కుపోయారు.

తొలిరోజు సాధించిన విజయం ట్రంప్‌ పర్యటన పొడవునా ఆధిపత్యం చలాయించిందనే చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో లక్షా పాతికవేలమంది జనం ముందు ట్రంప్‌ ప్రసంగాన్ని యావత్‌ ప్రపంచం దిగ్భ్రమతో చూసింది. ట్రంప్‌ భారత పర్యటన యావత్తులో ఇది ఒక సానుకూల మూడ్‌ని తీసుకొచ్చింది. మొతెరా స్టేడియంలో సభ, రోడ్‌ షోను ప్రధాని మోదీ అత్యద్భుతరీతిలో నిర్వహించారు. అంతకుమించి ట్రంప్‌ స్టేడియంలో గొప్పగా ప్రసంగించారు. ఈ ఘటన చూస్తే దేశాలకు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని 230 సంవత్సరాల క్రితం ప్రముఖ బ్రిటిష్‌ ప్రధాని లార్డ్‌ పాల్మర్‌స్టోన్‌ చెప్పింది గుర్తుకొస్తుంది. ఆ ప్రకటన అన్ని రకాల దౌత్యానికి పునాది. అధ్యక్షులు వస్తారు వెళతారు కానీ భారతీయ ప్రయోజనాలు కొనసాగుతాయి.

ట్రంప్‌ భారత్‌ పర్యటన ఫలితాలు
మొతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం ఆయన పర్యటన మొత్తంలో కీలకమైంది. ఆ స్టేడియంలో అమెరికా విదేశీ విధానాన్ని, భారత్‌ పట్ల తన వైఖరిని ట్రంప్‌ ప్రసంగం విస్పష్టం చేసింది. పదాలను వెతుక్కోకపోవడం, అభిప్రాయ ప్రకటనలో తడబాటు లేకపోవడం ట్రంప్‌ ప్రసంగంలో ఆద్యంతం వ్యక్తమయ్యాయి. ట్రంప్‌ భారత పర్యటనలో మనకు ఒరిగే ప్రయోజనాలు చూద్దాం. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఓడించే విషయంలో భారత్, అమెరికాకు ఉమ్మడి లక్ష్యం ఉందని రెండు దేశాలు ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో పోరాడతాయని ట్రంప్‌ చెప్పారు. ఏ అమెరికన్‌ అధ్యక్షుడు, లేక యూరోపియన్‌ లీడర్‌ ఇంత స్పష్టంగా ఉగ్రవాద నిర్మూలనా పోరాటం గురించి చెప్పి ఉండలేదు. రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని దేశాలను ట్రంప్‌ నేరుగా మొతెరా స్టేడియం నుంచి హెచ్చరించారు. తన శక్తియుక్తులన్నింటినీ మేళవించి ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో పోరాడతానని ట్రంప్‌ చేసిన హెచ్చరిక పాకిస్తాన్‌కు, అలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశానికైనా సరే తీవ్రమైన సందేశాన్నే ఇచ్చింది. అమెరికా సైన్య ఆధునీకరణకు 2.5 ట్రిలియన్‌ డాలర్లను వెచ్చించానని, ఈ శక్తివంతమైన సైన్యంతోనే ప్రపంచమంతటా ఉగ్రవాదుల పని పడుతున్నామని, ఐసిస్‌ అధినేత బాగ్దాదిని కూడా మట్టుపెట్టామని ట్రంప్‌ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటంలో భారత్‌ వెనుక తాముం టామనే బలమైన సందేశాన్ని ట్రంప్‌ పంపించారు.

ప్రతి దేశం కూడా తన సరిహద్దులను కాపాడుకుని తీరాల్సిందేనని, ఎవరు తమ భూభాగంలోనికి ప్రవేశించాలి, ఎవరు ప్రవేశించకూడదు అని నిర్ణయించుకునే హక్కు ఏ దేశానికైనా ఉంటుందని ట్రంప్‌ చెప్పారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం సాగుతున్న సీఏఏ, ఎన్నార్సీ అంశాలను ట్రంప్‌ నేరుగా ప్రస్తావించినట్లయింది. అలాగే భారతీయ ఎన్నారైలను, కష్టించి పనిచేసే భారతీయులను ట్రంప్‌ ప్రశంసించారు. ఎన్నారైలకు, భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు భవిష్యత్తులో ట్రంప్‌ మరింత ప్రోత్సాహం అందిస్తారని భావించవచ్చు. పైగా ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు ట్రంప్‌ ఇంత ప్రశంసల వర్షం ఎన్నడూ కురిపించలేదు. గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్‌ భారతీయ సంస్కృతి, సామాజిక చరిత్రకు తానెంతో విలువ ఇస్తున్నట్లు సందేశం పంపారు. ఇతర దేశాలు ప్రత్యేకించి చైనా బలాన్ని ప్రదర్శిస్తూ, బెదిరి స్తున్న నేపథ్యంలో భారత్‌ ప్రజాస్వామిక మార్గంలో పయనిస్తోందని ట్రంప్‌ కితాబిచ్చారు. శాంతియుత, ప్రజాస్వామిక మార్గాల్లో భారత్‌ ఎదుగుతున్నందుకు అభినందించారు.

ట్రంప్‌ పర్యటన నుంచి భారత్‌ పొందే ప్రయోజనాలు
ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో మంగళవారం జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కూడా ట్రంప్‌ మరోసారి ఇస్లాం ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మద్దతిస్తామని నొక్కి చెప్పారు. ఇది చాలా కీలకమైన ప్రకటన. ట్రంప్‌ సందేశం నేరుగా పాకిస్తాన్‌కు చేసిన తీవ్ర హెచ్చరిక. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నా తాను సహించబోమని ట్రంప్‌ స్పష్టంగా ప్రకటించారు. పైగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, పాకిస్తాన్‌ దేశాలు చైనాకు సన్నిహితం కావడానికి ప్రయత్నించడం తనకు ఏమాత్రం సంతోషం కాదని ట్రంప్‌ సందేశమిచ్చారు. పాకిస్తాన్, చైనాలు ట్రంప్‌ భారత పర్యటన ప్రభావాన్ని ఇకపై జాగ్రత్తగా మదింపు చేసుకోవలసి ఉంది. భారత అభిప్రాయాలను గౌరవించి తీరాలన్న సందేశం చైనాకు అందింది. పైగా భారత, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడిందన్న విషయాన్ని చైనా గ్రహించి మెలగాల్సి ఉంది.

నరేంద్రమోదీని వ్యతిరేకిస్తున్న అనేకమంది భారతీయులు ఈ ఏడాది ఆఖరిలో జరగబోయే ఎన్నికలు ఎదుర్కోబోతున్న ట్రంప్‌ని మోదీ ఇంత బాహాటంగా బలవర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు చాలా శక్తిమంతుడిగా ఉన్నారు. ట్రంప్‌ గెలిస్తే తాను భారత్‌కు మరింత మంచి స్నేహితుడు అవుతారు. ట్రంప్‌ ఓడిపోతే మనకు అదేం పెద్ద విషయం కాదు. భారత్‌ అతి పెద్ద దేశం కాబట్టి కాబోయే అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ఎవరైనా సరే భారత్‌తో సర్దుబాటు కావలసి ఉంటుంది. కానీ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ తన ఆర్థికాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించుకోవలసి ఉంది. ఇతర దేశాలు మనల్ని గౌరవించాలంటే ఇదొకటే మార్గం. కాబట్టి మోదీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై మరింతగా దృష్టి పెట్టాలి. భారత్‌ బలానికి ఇదే అసలైన పునాది. 
వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement