భారత్‌ ముంగిట ‘పెనుప్రమాదం’ | Pentapati Pullarao Writes Guest Column About Coronavirus | Sakshi
Sakshi News home page

భారత్‌ ముంగిట ‘పెనుప్రమాదం’

Published Wed, Mar 25 2020 12:32 AM | Last Updated on Thu, Mar 26 2020 5:28 AM

Pentapati Pullarao Writes Guest Column About Coronavirus - Sakshi

ప్రపంచం ఇంతవరకు అణుబాంబులు, అణ్వాయుధాలు, సైన్యాలు, పర్యావరణ మార్పు వంటి ప్రమాదాలను ఎదుర్కొంది. కానీ మానవాళి అతి పెద్ద శత్రువు కంటికి కనిపించని వైరస్సే. మేధో బలం మెండుగా ఉన్న భారత్‌ ఆరోగ్య సమస్యలపై తక్షణం దృష్టి సారించేలా చేయాలి. భారత్‌ ఇప్పటికీ కరోనా వైరస్‌ 2వ దశలోనే ఉంది. కాబట్టే మనం నిమ్మళంగా ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు కొనసాగిస్తున్న వైద్య సేవలకు అదనంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బు వెచ్చించాలి. కర్ఫ్యూల ద్వారా సామాజిక దూరం పాటించేలా చేయాలి. ప్రభుత్వాల మాటలు చాలా బాగున్నాయి కానీ చేతలు మాత్రం ఇప్పటికీ తగిన విధంగా లేవు.

తక్కిన ప్రపంచ దేశాలకు మల్లే భారతదేశం కూడా అత్యంత ప్రమాదకరమైన మహమ్మారి కరోనా గుప్పిట్లో ఇరుక్కుపోయి ఉంది. మహమ్మారులనేవి ఎప్పుడు కూడా పిలిచి రావు లేక వస్తున్నామంటూ తమ రాకను ముందుగా చెప్పవు. మహమ్మారి అనేది ఉన్నట్లుండి సూచన కూడా లేకుండా వచ్చి మీద పడుతుంది. నివారించడానికి అసాధ్యమయ్యేలా విరుచుకుపడుతుంది. ఇలా ప్రపంచంమీదికి వచ్చి పడే ప్రతి వైరస్‌ కూడా పూర్తిగా కొత్త రూపంలో ఉంటుంది కాబట్టే దాన్ని తక్షణం నివారించడానికి వ్యాక్సిన్‌ కానీ మందులు కానీ ఎన్నడూ అందుబాటులో ఉండవు. అత్యంత సంపన్నదేశాలకు, సుప్రసిద్ధులైన వైద్యులకు కూడా మహమ్మారి వ్యాధి వచ్చిపడినప్పుడు ఏం చేయాలో తెలీదు. 

కరోనా వైరస్‌ భూమ్మీద నుంచి అదృశ్యమయ్యే సమయానికి లక్షలాది మంది మరణిస్తారని నిపుణులు చెబుతున్నారు. 7 కోట్లమంది జనాభా ఉన్న ఇటలీలో ఇప్పటికే దీని బారినపడి 6 వేలమంది చనిపోయారు. భారత జనాభా పరిమాణంతో పోలిస్తే ఇప్పటికే లక్షా 20 వేలమంది ఇటలీలో చనిపోయినట్లు భావించాలి. పైగా ఇప్పుడు జరుగుతున్నది ప్రారంభం మాత్రమే. ఒకవారంరోజుల్లోపే లక్షమందికి పైగా చావాల్సి వస్తే భారతీయులు ఏం చేస్తారో ఊహించగలమా? ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు నిండా మునిగిపోతారు.

చైనాలో 2003లో జంతువులనుంచి మనుషులకు సంక్రమించిన సార్స్‌ సాంక్రమిక వ్యాధిని పోలిన కరోనా వైరస్‌ గురించి చైనా ప్రపంచానికి చాలా ఆలస్యంగా తెలియజెప్పింది. 2019 నవంబరులోనే చైనా వైద్యులు దీన్ని కనిపెట్టినప్పటికీ దాన్ని బహిరంగ పర్చడంలో చైనా తాత్సారం చేసింది. చైనా స్థానిక అధికారులు దీనికి సంబంధించిన వార్తలను తొక్కిపెట్టడంతో అది ఇప్పుడు విశ్వ మహమ్మారిగా మారిపోయింది. ఆధునిక ప్రపంచంలో సాంక్రమిక వ్యాధిని ముందుగానే కనుగొంటే, రోగుల్ని మొదట్లోనే వేరు చేసి ఆ వ్యాధి వ్యాప్తి కాకుండా నిరోధించవచ్చు. మందుల ద్వారా సాంక్రమిక వ్యాధిని తక్షణం నివారించలేం. కానీ తొలిచర్య ఏమిటంటే వ్యాధిని నియంత్రించడమే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ .. కరోనా వైరస్‌
కరోనా వైరస్‌ని నియంత్రించే ఉత్తమమార్గం విస్తృతంగా పరీక్షలు జరపడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. ఎవరికి వ్యాధి సోకిందీ తెలీనప్పుడు విస్తృతంగా పరీక్షలు జరపడమే మార్గం. ఈవిధంగానే దక్షిణ కొరియా, జర్మనీలు కరోనాను నిరోధించడంలో విజయాన్ని సాధించాయి. ప్రత్యేకించి దక్షిణ కొరియా తరహా ఏకాంతవాసాన్ని, దానికిమించి వైద్యపరీక్షల విధానాన్ని అమెరికా ఇప్పుడు అవలంబిస్తోంది. భారత్‌లో 135 కోట్ల జనాభా ఉంది. యూరోపియన్‌ దేశాల్లోగా కాకుండా, భారతీయులు కిక్కిరిసివున్న ఆవాసాల్లో పరస్పరం అతి సన్నిహితంగా ఉండే పరిసరాల్లో జీవిస్తుంటారు. పైగా దేశంలో పారిశుధ్యం, ఆరోగ్య రక్షణ పేలవంగా ఉంటోంది. సామాజిక దూరం పాటిం చటం ద్వారా భారతీయులు తమకు తాము ఏకాంతం పాటించినా అదే ఇంట్లో ఉన్న వారికి దూరంగా ఉండటం సాధ్యం కాదు.

కరోనా వైరస్‌ గురించి మీరేమీ పట్టించుకోకుండా దాని మానాన దాన్ని వదిలేస్తే ఒక్క అమెరికాలోనే 10 లక్షలమంది మరణిస్తారని అంచనా. కానీ కరోనా వైరస్‌ను నివారించే చర్యలు చేపడితే మరణాల సంఖ్య తగ్గుతుంది. అమెరికా ఇప్పుడు భారీస్థాయిలో వైద్య పరీక్షలు ప్రారంభించి వ్యాధి చికిత్స పథకాలు మొదలెట్టారు. ఎవరికి వ్యాధి సోకింది అని తేల్చే ఏకైక విధానం పరీక్షించడమే. పరీక్షించడం ద్వారా మొదట్లోనే వ్యాధిగ్రస్తులను కనుక్కోగలం తర్వాత వారికి చికిత్స చేయడం, ఏకాంతంలో ఉంచడం సాధ్యపడుతుంది కాబట్టి వ్యాధిని వారు వ్యాప్తి చేయలేరు. 

భారత్‌ ఏం చేయగలదు?
భారతదేశంలో కరోనా వైరస్‌ గురించి 2020 జనవరిలో మొదటగా తెలియవచ్చింది. ఈ వ్యాధిపై తగిన చర్యలు చేపట్టడంలో జరిగిన జాప్యం భారత్‌కు ప్రాణాంతకంగా మారింది. మార్చి 22న మాత్రమే భారతప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. కానీ కర్ఫ్యూలు మాత్రమే కరోనా వైరస్‌ను పూర్తిగా నిరోధించలేవు. ఈ నేపథ్యంలో భారత్‌ చేయగలిగిందేమిటి? వ్యాధినిర్ధారణ పరీక్షలను విస్తృ తంగా చేపట్టడమొకటే కరోనా వైరస్‌ని అడ్డుకోగలదు. దక్షిణ కొరియా, జర్మనీ ప్రభుత్వాల కార్యాచరణ దీన్నే నిరూపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ కరోనా వైరస్‌ నివారణ గురించి మూడే మూడు ముక్కల్లో చెప్పారు. టెస్టింగ్, టెస్టింగ్, టెస్టింగ్‌. దీనికి అనుగుణంగానే భారత్‌లో భవిష్యత్తులో పెరగనున్న రోగులకు చికిత్స అందించడానికి దేశంలోని అన్ని ఆసుపత్రులను సిద్ధం చేయాలి. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచడం రోజుల వ్యవధిలో సాధ్యమయ్యే పని కాదు. ఆసుపత్రుల్లో పడకల పెంపుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త భవంతుల నిర్మాణం కంటే ఉన్న ఆసుపత్రుల సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. అన్నిటికంటే మించి వెంటిలేటర్లను భారీస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలి.

కరోనా వైరస్‌ ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధి సోకిన తర్వాత శ్వాస ఆడటం కష్టం. ఊపిరితిత్తులకు గాలి అందాలంటే, రోగి బతకాలంటే వెంటిలేటర్ల సహాయం తప్పనిసరి. అందుకే వెంటిలేటర్లు గరిష్టంగా అందుబాటులో ఉంచుకోవాలి. మరి వివిధ రాష్ట్రాల్లో అన్ని వెంటిలేటర్లు లభ్యమవుతున్నాయా? రోజువారీ అవసరాల కోసం తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేవనే సమాధానం.  అన్ని జిల్లా కేంద్రాల్లోని వైద్యకళాశాలల వనరులను కరోనా రోగుల సేవకు కేటాయించాలి. వాటిలోని వైద్యులకు, విద్యార్థులకు టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తక్షణం అందచేసి వైరస్‌ నివారణకు దిగాలని నిర్దేశించాలి. ప్రపంచ దేశాలు చాలావరకు వ్యాధి భవిష్యత్తు స్థితి ఎలా ఉంటుందని కేస్‌ స్టడీలు చేసి పెట్టుకున్నాయి కానీ భారత్‌లో కలికానికి కూడా అది జరగలేదు. అమెరికాలో 2 వారాల క్రితం చేసిన అలాంటి కేస్‌ స్టడీలో దాదాపు 10 లక్షల మంది అమెరికన్లు భవిష్యత్తులో కరోనాకు బలవుతారని తెలిసింది. కానీ వైరస్‌ వ్యాప్తి నిరోధక కార్యాచరణ మొదలెట్టిన వారం తర్వాత అమెరికాలో భవిష్యత్తు మృతుల సంఖ్య గురించిన అంచనా తగ్గుముఖం పట్టింది.

మౌలిక సదుపాయాల పెంపు అవశ్యం
భారత్‌లో ప్రస్తుతానికి వెంటిలేటర్ల కొరత, విదేశాలనుంచి వాటిని కొనడంపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ దృష్టి పెట్టడం లేదు. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగినప్పుడు ఇది తీవ్రమైన సామాజిక, వైద్య సమస్యలకు దారితీస్తుంది. చాలినన్ని ఐసీయూ బెడ్లు లేవు. భారీ స్థాయిలో పరీక్షించే సాధన సంపత్తి లేదు. పైగా ఆర్థిక వ్యవస్థను 35 నుంచి 40 శాతానికి కరోనా వైరస్‌ కుప్పగూల్చనుంది. ఇతర దేశాల లాగే భారత్‌ కూడా ఉద్దీపన ప్యాకేజీను తక్షణం ప్రకటించాలి. మన ముందున్న దారి స్పష్టం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. ఇలాంటి వైరస్‌లు సాధారణంగా సరైన ఆహారం లేకపోవడం, పారిశుధ్యం లేకపోవడం, సరైన ఆరోగ్య విధానాలను పాటించకపోవడం నుంచే ఇలాంటి వైరస్‌లు సంక్రమిస్తుంటాయి. ఇలాంటి అనారోగ్య విధానాల వల్లే వెయ్యేళ్లుగా మానవాళిపై వైరస్‌లు దాడి చేస్తున్నాయి. 1390లో మొదలైన మహా బ్యుబోనిక్‌ ప్లేగ్‌ ఎలుకల ద్వారా సంక్రమించిందని మర్చిపోవద్దు. 

ఆధునిక చైనా కూడా తన పాత చెత్త ఆరోగ్య విధానాల వల్లే కరోనా బారినపడింది. అడవి జంతువులను విచ్చలవిడిగా తినడం వల్లే ఇలా జరిగిందని చైనాను ప్రపంచం దుమ్మెత్తి పోస్తోంది. కేన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రపంచం వైరస్‌ద్వారా వ్యాపించే వ్యాధులను పట్టించుకోవడం లేదు.ప్రపంచం ఇంతవరకు అణుబాంబులు, అణ్వాయుధాలు, సైన్యాలు, పర్యావరణ మార్పు వంటి ప్రమాదాలను ఎదుర్కొంది. కానీ మానవాళి అతి పెద్ద శత్రువు కంటికి కనిపించని వైరస్సే. మేధో బలం మెండుగా ఉన్న భారత్‌ ఆరోగ్య సమస్యలపై తక్షణం దృష్టి సారించేలా చేయాలి. 
భారత్‌ ఇప్పటికీ కరోనా వైరస్‌ 2వ దశలోనే ఉంది. కాబట్టే మనం నిమ్మళంగా ఉన్నాం. కానీ మన ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇప్పుడు కొనసాగిస్తున్న వైద్య సేవలకు అదనంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం భారీ ఎత్తున డబ్బు వెచ్చించాలి. కర్ఫ్యూల ద్వారా సామాజిక దూరం పాటించేలా చేయాలి. ప్రభుత్వాల మాటలు చాలాబాగున్నాయి కానీ చేతలు మాత్రం ఇప్పటికీ తగినవిధంగా లేవు.


వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు 
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement