హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా | America Loves India Says US President Donald Trump | Sakshi
Sakshi News home page

హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా

Published Tue, Feb 25 2020 4:16 AM | Last Updated on Tue, Feb 25 2020 1:58 PM

America Loves India Says US President Donald Trump - Sakshi

మోదీ, ట్రంప్‌ ఆత్మీయ ఆలింగనం.చిత్రంలో ట్రంప్‌ సతీమణి మెలానియా

డెబ్బయ్‌ లక్షల మంది స్వాగతిస్తారన్నారు. అది తక్కువనిపించిందేమో!! అంతలోనే ! ఆ సంఖ్య కోటికి చేరింది. ఆ క్షణం రానే వచ్చింది. ట్రంప్‌ ఊహించిన కోటి మంది కాకున్నా... అహ్మదాబాద్‌ వీధుల్లో లక్షల మంది స్వాగతం పలికారు. మొతెరా మైదానంలో మరో లక్షన్నర మంది ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించారు.  

భారత్‌కు రాకముందు ట్రంప్‌ యంత్రాంగం కశ్మీర్‌ను తెరపైకి తెచ్చింది. సీఏఏ నిరసనలనూ ప్రస్తావించింది. కానీ ఆశ్చర్యంగా.. ట్రంప్‌ ప్రసంగంలో మోదీ కీర్తి ప్రతిష్టలకు ట్రంపెట్ల మోతలే తప్ప భారత్‌ను ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలేమీ లేవు. భారత్‌లో మత సామరస్యానికి జై కొడుతూ... తమ దేశంలోని భారతీయ అమెరికన్ల ప్రతిభకు జేజేలన్నారు.

మందగమనంలోని భారతానికి ఊరటనిచ్చేలా వాణిజ్యపరమైన ప్రకటనలు చేస్తారని భావించారంతా!!. అంతకుమించి... అనేలా భారతీయుల్ని సంతోషపెట్టారు ట్రంప్‌. మన దీపావళి, హోలీ పండుగల్ని మనకే వివరిస్తూ... దిల్‌వాలే దుల్హనియా, షోలే అంటూ బాలీవుడ్‌ సినిమా చూపించారు. క్రికెట్‌ వీరులు సచిన్, కోహ్లీలనూ కొనియాడారు. భారతీయుల నుంచి కోట్లాది చప్పట్లను రాబట్టడానికి ఇంతకన్నా ఏమైనా కావాలా చెప్పండి..?

ఇక దారిపొడవునా ఘన స్వాగతం పలికిన గుజరాతీలను తక్కువ చేయలేదు ట్రంప్‌. అల్లంత ఎత్తున్న సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని మాటల్లో మరింత ఎత్తున ఆవిష్కరించారు. మోదీ ఛాయ్‌వాలా నుంచి ప్రభుత్వ సారథిగా మారిన చరిత్రను మరోసారి వినిపించారు. సాక్షాత్తూ అగ్రరాజ్యాధీశుడే తమను అలా పొగిడేస్తుంటే స్థానికులకు ఇంకేం కావాలి చెప్పండి?

మొత్తానికి మొదటిరోజు ప్రసంగమంతా జనరంజకమే!. వీనులవిందైన పరస్పర పొగడ్తలే! ఈ ప్రసంగంలో దేశానికి కాస్తంత ప్రయోజనం కలిగించే అంశమేదైనా ఉందంటే అది 3 బిలియన్‌ డాలర్ల రక్షణ పరికరాల కొనుగోలు ఒప్పందమే!. తాము ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లు, క్షిపణులు, యుద్ధనౌకలు తయారు చేస్తున్నామని చెప్పిన ట్రంప్‌.. హెలికాప్టర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు భారత్‌తో 3 బిలియన్‌ డాలర్ల (రూ. 21వేల కోట్ల) ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. మరి మంగళవారం ఇరువురు ప్రభుత్వాధినేతల చర్చల్లో ఇదొక్కటే సాకారమవుతుందా? మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా? 

అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం
– ట్రంప్‌

ట్రంప్‌ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఇరు దేశాల మధ్య నమ్మకం, విశ్వాసం అత్యున్నత, చరిత్రాత్మక శిఖరాలకు చేరాయి.
– మోదీ

అహ్మదాబాద్‌: ‘అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం’.. భారతీయుల మనసు గెలుచుకునే ఈ సందేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి సోమవారం ట్రంప్‌ ప్రసంగించారు.

‘నమస్తే.. నమస్తే.. హలో ఇండియా’ అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్‌ ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ తనకు నిజమైన స్నేహితుడని, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆ మహోన్నత నేతకు.. తనకీ అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.  భారత సాంస్కృతిక వైభవాన్ని, గత 70 ఏళ్లలో భారత్‌ సాధించిన అద్భుత విజయాలను, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ పాటిస్తున్న గొప్ప విలువలను,  వివిధ రంగాల్లో ఇండియా సాధించిన ఘనతలను ట్రంప్‌ తన ప్రసంగంలో సందర్భానుసారం ప్రస్తావించి, భారతీయులను ఆకట్టుకున్నారు.

స్వామి వివేకానంద ప్రవచిత వ్యాఖ్యను గుర్తు చేసి, భారత దార్శనికతను ప్రశంసించారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ సామర్థ్యాన్ని తన ప్రసంగంలో గుర్తు చేశారు.  భారత్‌కు సహకరించే విషయంలో అమెరికా ముందుంటుందని, భారత సాయుధ దళాలకు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయని వెల్లడించారు.  వేదికపైకి మోదీ, ట్రంప్‌తో పాటు మెలానియా వచ్చారు. హోంమంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, ట్రంప్‌ కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్‌.. ఇతర ప్రముఖులు మొదటి వరుసలో కూర్చుని ట్రంప్, మోదీల ప్రసంగాలను విన్నారు.

ఈ స్వాగతాన్ని మర్చిపోలేం
‘ఐదు నెలల క్రితం భారత ప్రధానికి అమెరికాలో భారీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో నన్ను స్వాగతిస్తున్నారు. ఈ స్వాగతం గొప్పగా ఉంది. థ్యాంక్యూ. ఈ ఆతిథ్యాన్ని మేమెన్నడూ మర్చిపోం’ అని ట్రంప్‌ తన ప్రసంగంలో  వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు కలిసిమెలిసి జీవిస్తున్న దేశంగా.. వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలన, పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనం కల్పిస్తున్న దేశంగా భారత్‌ను ప్రపంచదేశాలు అభిమానిస్తాయన్నారు.  

గట్టి ప్రతినిధి
ఒక సామాన్య భారతీయుడు ఏం సాధించగలడనేదానికి భారత ప్రధాని మోదీనే సజీవ తార్కాణమని ప్రశంసించారు. భారత, అమెరికా వాణిజ్య చర్చలను ప్రస్తావిస్తూ ‘మోదీ తమ దేశం తరఫున గట్టిగా వాదిస్తారు(టఫ్‌ నెగోషియేటర్‌)’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘‘మోదీని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాకపోతే ఆయనతో వ్యవహారాలు నడపడం అంత సులువు కూడా కాదు’’అని అన్నారు. ‘‘ప్రధానమంత్రి మోదీగారు.. మీరు గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు. అంకితభావంతో కష్టపడి పనిచేస్తే భారతీయులు ఏదైనా సాధించగలరు అనేందుకు సజీవ తార్కాణం మీరు’’అని ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు.  ‘భారత్‌ సామర్థ్యం ఆశ్చర్యకరం. అద్భుతం. స్వతంత్ర దేశంగా భారత్‌ సాధించిన అభివృద్ధి మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకం. భారత్‌ సాధించిన పురోగతి ఈ శతాబ్దంలోనే అసాధారణ విజయం’ అని ఇండియాపై తన అభిమానాన్ని చాటుకున్నారు.   

చప్పట్లు.. నవ్వులు..
గుజరాత్‌ సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు లక్షమందితో మొతెరా స్టేడియం కిక్కిరిసింది.  మోదీ, సర్దార్‌పటేల్‌ను ప్రశంసిస్తున్న సమయంలో, షోలే, డీడీఎల్‌జీ వంటి బాలీవుడ్‌ సినిమాలు, క్రికెటర్లు సచిన్, కోహ్లీలను ప్రస్తావించిన సమయంలోనూ భారీగా చప్పట్లు వినిపించాయి. ట్రంప్‌ మాటతీరు, ఉచ్ఛారణతో పలుమార్లు స్టేడియంలో నవ్వులు పూచాయి.  ప్రపంచం మారుమూలల్లోనూ భారతీయ నృత్యం భాంగ్రాకు, హోళీ, దీపావళి పండగలకు మంచి ఆదరణ ఉందన్నారు.  ‘ఏడాదికి రెండు వేల సినిమాలు తీసే అత్యద్భుతమైన సృజనాత్మకత ఉన్న బాలీవుడ్‌ ఉన్న దేశమిది’అంటూ వ్యాఖ్యానించారు.

సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రజలకు ట్రంప్, మోదీ అభివాదం

సాంస్కృతిక కార్యక్రమాలు
మోదీ, ట్రంప్‌లు స్టేడియంలోకి వచ్చేవరకు బాలీవుడ్‌ గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ బృందం, గుజరాతీ స్థానిక గాయకులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్టేడియంలో వాలంటీర్లుగా వ్యవహరించారు.

వి ద పీపుల్‌
నమస్తే ట్రంప్‌ కార్యక్రమం అనంతరం ప్రెసిడెంట్‌ ట్రంప్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘‘అమెరికా, భారత్‌.. ఈ రెండు దేశాల రాజ్యాంగాలు ఒకే అద్భుతమైన పదంతో ప్రారంభమవుతాయి. అది ‘వి ద పీపుల్‌(ప్రజలమైన)’. అంటే, మన రెండు దేశాల్లోనూ దేశ పౌరులకు సమాన గౌరవం, సాధికారత, విశ్వాసం లభిస్తాయి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఎండల్లో.. ఓపికగా ప్రజలు...
స్టేడియంకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకే విచ్చేసిన ప్రజల సహనానికి ఎర్రటి ఎండ పరీక్ష పెట్టింది. స్టేడియం సామర్త్యం 1.10 లక్షలు కాగా సోమవారం అంతకు మించి 1.25 లక్షల మంది చేరారు. ఇరువురు నేతలు ప్రజలకు అభివాదం చేయడాన్ని పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య స్వాగతించారు కూడా. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ప్రజల ఓపిక తగ్గుతూ వచ్చింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు ఆ తరువాత ట్రంప్‌ మాట్లాడే సమయానికి ఒక్కరొక్కరుగా స్టేడియంను వీడిపోవడం కనిపించింది. మోదీని ట్రంప్‌ ప్రశంసించే సమయంలో చాలామంది బయటకు వెళ్లారు.

రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదం ముప్పు
రాడికల్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాదం ముప్పు నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ముప్పు కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారత్, అమెరికాలు ఉన్నాయన్నారు. ‘ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను సంపూర్ణంగా నాశనం చేశాం. ఐఎస్‌ స్థాపకుడైన అల్‌ బగ్దాదీ వంటి రాక్షసున్ని అంతమొందించాం’ అని గుర్తు చేశారు. తమ సరిహద్దులను కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని, ఉగ్రవాదులను, వారి భావజాలాన్ని నిర్మూలించే దిశగా భారత్, అమెరికా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

‘నేను అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి ఉగ్రసంస్థలను, వారి భూభాగంలోని ఉగ్రవాదులను నాశనం చేసే దిశగా  పాకిస్తాన్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నాం’ అన్నారు. ‘పాక్‌తో మా సంబంధాలు బావున్నాయి. అవి మెరుగుపడే దిశగా వెళ్తున్నాం. దక్షిణాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తొలగుతాయని, సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ విషయంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. చైనా పేరును ప్రస్తావించకుండానే.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌ ప్రాంతం కోసం భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్రదేశాలను ట్రంప్‌ అభివర్ణించారు. అమెరికా విలువలను కాపాడేవారికి తమ దేశంలోకి  స్వాగతం పలుకుతామని, అదే సమయంలో ఉగ్రవాదాన్ని కానీ ఏ విధమైన తీవ్రవాదాన్ని కానీ సమర్ధించబోమన్నారు.

అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement