sardar patel stadium
-
గెలిపిస్తే లైసెన్స్ ఇచ్చినట్లు కాదు..
సాక్షి, ముంబై: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం పేరు మార్పుపై శివసేన తమ సామ్నా పత్రికలో స్పందించింది. ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే అది ఇష్టారీతిన వ్యవహరించడానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించింది. పటేల్ పేరును చరిత్ర నుంచి తొలగించడానికి గాంధీ–నెహ్రూ కుటుంబాలు కుట్రలు చేస్తున్నాయని గత ఐదేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయని, కానీ వాస్తవంగా ఆ కుట్రలు ఎవరు చేస్తున్నారో స్టేడియం పేరు మార్పుతో ఇప్పుడు స్పష్టమైందని మండిపడింది. ఈ మేరకు శివసేనకు చెందిన పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. పెద్దవన్నీ గుజరాత్‌లోనే ఉండాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోందని పేర్కొంది. అందులో తప్పు లేనప్పటికీ తాము దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని చురకలంటించింది. ఇన్నాళ్లూ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉండేదని, ఇప్పుడు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం పేరును మోదీ పేరుతో మార్చాక నరేంద్ర మోదీ స్టేడియమే ప్రపంచంలో పెద్దదని తెలిపింది. మోదీ గొప్ప నాయకుడే.. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని, కానీ మహాత్మ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీల కంటే గొప్ప నాయకుడని అంధ అనుచరులు భావిస్తే అది మరో స్థాయి గుడ్డి నమ్మకం అవుతుందని పేర్కొంది. మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారని అభిప్రాయం వ్యక్తం చేసింది. మోదీ చాలా ప్రజాదరణ గల నాయకుడని, ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతుందని రాసుకొచ్చింది. పటేల్, నెహ్రూలకు కూడా జనాల నుంచి మంచి మద్దతు లభించిందని, దాంతో వారు దేశాభివృద్ధికి పునాది వేశారని వివరించింది. ఐఐటీలు, బార్క్, భాక్రానంగల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను నెహ్రూ జాతికి అంకితం చేశారని, కానీ మోదీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించింది. సర్దార్ పటేల్ పేరిట ఉన్న స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరు మీదకు మార్చుకున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పుడు పటేల్.. రేపు నేతాజీ.. నిన్న మొన్నటి వరకు పటేల్‌ను ప్రశంసించినవారు ఇప్పుడు స్టేడియం పేరు మార్పు విషయానికి వచ్చేసరికి వ్యతిరేకిస్తున్నారని సామ్నా పత్రిక తమ సంపాదకీయంలో దుయ్యబట్టింది. నేటి రాజకీయాల్లో పటేల్ ప్రాముఖ్యతను ఎలా తగ్గించారో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు కూడా ఇలానే చేస్తారని మండిపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ పేరును కూడా వాడుకున్నారని గుర్తుచేసింది. సర్దార్ పటేల్ తీసుకొచ్చిన ఏ పాలసీలను ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందో చెప్పాలని ప్రశ్నించింది. రైతుల హక్కుల కోసం పటేల్ బార్దోలి సత్యాగ్రహం ముందుండి నడిపించారని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని అడిగింది. బార్దోలి సత్యాగ్రహం ముగిసిన రెండేళ్ల తర్వాత కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పటేల్ తాను రైతునని ప్రకటించుకున్నారని తెలిపింది. బహుశా అందుకేనేమో.. గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు సర్దార్ పటేల్‌ను ప్రశంసిస్తున్నారని పేర్కొంది. బహుశా అందుకే మొతేరా క్రికెట్ స్టేడియం పేరును మార్చి పటేల్ పేరును తుడిచేద్దామని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ ప్రజలు కోరుకున్నది ఇదేనని, గుజరాత్ పౌరులు ఈ మార్పును అంగీకరించారని వ్యాఖ్యానించింది. గుజరాత్ ప్రజలకు వల్లభ్‌భాయ్ పటేల్ పట్ల గౌరవం లేకపోతే, ఈ నిర్ణయాన్ని విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు కూడా లేదని అభిప్రాయపడింది. -
India vs England 3rd Test: ‘మహా’ సమరానికి సై
సబర్మతి తీరాన బుధవారం భారత క్రికెట్ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. కళ్లు చెదిరే భారీతనం... అలా చూస్తూ ఉండిపోయే నిర్మాణ చాతుర్యం, కొత్తగా కనిపించే ఎల్ఈడీ లైట్ల వెలుగులు... వీటికి తోడు గులాబీ బంతి... సుమారు 55 వేల మంది ప్రేక్షకులతో మొటెరా మైదానంలో మోత మోగనుంది. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యే క్షణం భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయం కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్ వేదికపై ఒక హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్ సమంగా నిలిచిన ప్రస్తుత స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరువవుతుంది. అహ్మదాబాద్: సిరీస్‌లోని మూడో టెస్టులోనే ఇంగ్లండ్‌కు ఎంతో కొంత విజయావకాశాలు ఉన్నాయి. ఆ జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో చాలా మంది విశ్లేషకులు, మాజీల అభిప్రాయమిది. డే అండ్ నైట్ టెస్టు కావడం, గులాబీ బంతితో స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటమే అందుకు కారణం. అయితే చెన్నైలో తొలి టెస్టు ఫలితం వారికి అనుకూలం రాగా, రెండో టెస్టులో భారత్ దెబ్బ కొట్టింది. గత మ్యాచ్ తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం రెట్టింపవ్వగా, ఇంగ్లండ్ కొంత ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేటి నుంచి జరిగే మూడో టెస్టులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి. భారత గడ్డపై ఇది రెండో డే అండ్ నైట్ టెస్టు కాగా, ఓవరాల్‌గా టీమిండియాకు మూడోది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం అధికారికంగా స్టేడియంను ప్రారంభిస్తారు. బరిలోకి బుమ్రా... రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన భారత జట్టు అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో సిరాజ్‌కు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు బుమ్రా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. చెన్నైలో రెండో టెస్టు ముగిసిన రోజే పింక్ బాల్‌తో బుమ్రా తన సాధన మొదలు పెట్టడం విశేషం. అయితే తుది జట్టులో మరో మార్పుకు కూడా అవకాశం కనిపిస్తోంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో మూడో పేసర్‌గా ఉమేశ్ యాదవ్ ఆడవచ్చు. భారత్‌లో మంచి రికార్డు ఉండటంతో పాటు రివర్స్ స్వింగ్ రాబట్టగల నైపుణ్యం అతని సొంతం. ఒకవేళ పిచ్ స్పిన్‌కు బాగా అనుకూలిస్తుందని భావించినా ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ జట్టులో ఉండగా గత మ్యాచ్ తరహాలోనే (12.2 ఓవర్లు) ఈసారి కూడా కుల్దీప్కు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవచ్చు కాబట్టి అతడిని తప్పించినట్లే. అయితే ఉమేశ్‌కు బదులుగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సొంత మైదానంలో టెస్టు ఆడే అవకాశం కల్పించడంపై కూడా టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. మూడో పేసర్‌గా కొన్ని ఓవర్లు వేయడంతో పాటు అతని దూకుడైన బ్యాటింగ్ జట్టుకు ఉపయోగపడగలదు. బ్యాటింగ్‌పరంగా భారత్ టాప్–6తో పటిష్టంగా ఉంది. తన స్థాయి ఏమిటో రోహిత్ శర్మ గత టెస్టులో చూపించగా, కోహ్లి కూడా నిలకడగా ఆడుతున్నాడు. రహానే ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... పాత స్టేడియం కూలగొట్టడానికి ముందు ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టులో ‘డబుల్ సెంచరీ’ చేసిన పుజారా మళ్లీ చెలరేగేందుకు సన్నద్ధమయ్యాడు. ఇక అశ్విన్ తమ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ ప్రత్యర్థి పని పట్టడం ఖాయం. బెయిర్‌స్టో, రూట్ బెయిర్‌స్టోకు చాన్స్... అనూహ్యంగా తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండో టెస్టులో కుప్పకూలింది. ఇప్పుడు మళ్లీ కోలుకునేందుకు ఆ జట్టుకు ఇది మంచి అవకాశం. లైట్ల వెలుగులో పింక్ బంతి ఏమాత్రం స్వింగ్ అయినా దానిని సమర్థంగా ఉపయోగించుకోవడంలో అండర్సన్‌ను మించినవాళ్లు లేరు. అతనికి మరోవైపు నుంచి ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ నుంచి కూడా సహకారం లభిస్తే వీరిని ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. ఇదే కారణంగా ఒకే ఒక స్పిన్నర్ (లీచ్)ను ఆడించి మరో స్వింగ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌ను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు జట్టు పరిశీలనలో ఉన్నాయి. అయితే పిచ్ స్పిన్‌కు బాగుందని భావిస్తే మాత్రం డామ్ బెస్ జట్టులోకి వస్తాడు. మొయిన్ అలీ స్వదేశం వెళ్లిపోవడంతో బెస్‌కు మరో అవకాశం దక్కనుంది. బ్యాటింగ్‌లో మరోసారి కెప్టెన్ జో రూట్‌పైనే భారం ఉండగా, స్టోక్స్ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ మరో రెండు మార్పులు కూడా చేసింది. బర్న్స్, లారెన్స్ స్థానాల్లో క్రాలీ, బెయిర్‌స్టో బరిలోకి దిగుతారు. గత మ్యాచ్ అనుభవం నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఈసారి మరింత పట్టుదల కనబర్చి భారీ స్కోరు సాధిస్తేనే గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు. పిచ్, వాతావరణం పూర్తిగా కొత్త మైదానం కాబట్టి పిచ్‌పై సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి ఉంది. అయితే పచ్చిక తొలగించడాన్ని బట్టి చూస్తే స్పిన్‌కు అనుకూలంగా చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు కాకుండా మ్యాచ్ సాగినకొద్దీ దాని ప్రభావం ఉండవచ్చు. లైట్లు, పింక్ బాల్ కారణంగా పేసర్లకు కూడా కొంత అనుకూలత ఉంది. అయితే తమ చివరి పింక్ బాల్ టెస్టుల్లో భారత్ (36 ఆలౌట్), ఇంగ్లండ్ (58 ఆలౌట్) ప్రదర్శన చూస్తే దీని అనిశ్చితి ఏమిటో అర్థమవుతుంది. మ్యాచ్ రోజుల్లో వర్షంతో ఏమాత్రం ఇబ్బంది లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానే, పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, పోప్, ఫోక్స్ (వికెట్ కీపర్), బెస్/వోక్స్, ఆర్చర్, లీచ్, అండర్సన్. గులాబీ బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుందనేది వాస్తవం. అయితే అది మెరుపు ఉన్నంత వరకే అనేది నా అభిప్రాయం. ఆపై స్పిన్నర్లు కచ్చితంగా ప్రభావం చూపిస్తారు. అయితే మేం బంతి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఎలా స్పందించినా, ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నాం. ప్రత్యర్థి జట్టు బలహీనతలేమిటో మాకూ తెలుసు కాబట్టి పరిస్థితులను సరిగ్గా ఉపయోగించుకుంటాం. – కోహ్లి, భారత కెప్టెన్ -
మొటెరా పిచ్ ఎవరికి లాభం చేకూర్చనుంది!
అహ్మదాబాద్: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మొటెరా స్టేడియం వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్(పింక్ బాల్ టెస్టు) జరగనున్న సంగతి తెలిసిందే. ఆధునాతన సౌకర్యాలతో లక్షా 10వేల సీటింగ్ కెపాసిటీతో నూతనంగా నిర్మించిన మొటెరా స్టేడియం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ మైదానంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుంచి డే నైట్ టెస్టుకు అన్ని హంగులతో సిద్ధమవుతుంది. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారినవేళ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొటెరా పిచ్ ఎలా ఉండబోతుందనే విషయంపై తెగ చర్చ నడుస్తుంది. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై పిచ్‌కు, అహ్మదాబాద్ పిచ్‌కు చాలా తేడా ఉండనుంది. అందులోనూ మూడో టెస్టు డై నైట్ తరహాలో జరగనుండడంతో పిచ్ రిపోర్ట్‌పై మరింత ప్రాముఖ్యత సంతరించుకొంది. సాధారణంగా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడే పిచ్‌లు స్పిన్నర్లకు అనువుగా ఉండేలా క్యూరేటర్లు తయారు చేస్తుంటారు. అయితే కొన్నేళ్లుగా వీటిలో మార్పు కనిపిస్తూ వచ్చింది. స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా స్వర్గధామంగా నిలుస్తూ వచ్చాయి. తాజాగా మొతేరాలో పిచ్ నల్లమట్టి, ఎర్రమట్టి కాంబినేషన్‌తో కూడి ఉంది. ప్రధాన గ్రౌండ్లో 11పిచ్‌లు ఉన్న నేపథ్యంలో ఈసారి పిచ్‌ను స్పిన్నర్లుకు అనూకూలంగా ఉండేలా ఎర్రమట్టితో రూపొందించనున్నట్లు సమాచారం. మొదటి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, చివరి రెండు రోజులు మాత్రం బౌలర్లకు అనుకూలించేలా పిచ్‌ను తీర్చిదిద్దారు. అయితే గతంలో జరిగిన పింక్ బాల్ టెస్టులు చూసుకుంటే స్పిన్నర్ల కంటే సీమర్లు రాణించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. 2019 నవంబర్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్టులోనూ ఇదే నిరూపితమైంది.ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్ కలిపి అన్ని వికెట్లు టీమిండియా పేసర్లే తీయడం విశేషం. ముఖ్యంగా ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఇప్పుడు ఎక్కువగా స్పిన్నర్లను నమ్ముకోవడంతో తుది జట్టులో ఇద్దరు పేసర్లకు మాత్రమే అవకాశం ఉంది. అయితే క్యురేటర్లు మాత్రం పిచ్‌ను స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు మ్యాచ్ డే నైట్ కావడం.. రాత్రిళ్లు మంచుతో బౌలర్‌కు గ్రిప్పింగ్ చేజారడం జరుగుతుంటుంది. బంతి రంగు కూడా పిచ్‌పై కీలకపాత్ర పోషించనుంది. అందుకే పిచ్‌పై పచ్చిక ఎక్కువ లేకుండా చూసుకుంటూ కాస్త కఠినతరంగా రూపొందించనున్నారు. ఇక 2012లో మొటెరా మైదానంలో చివరి మ్యాచ్ జరిగింది. కాగా ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: మూడో టెస్ట్‌తో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం -
మూడో టెస్టు: మొటెరా స్టేడియం విశేషాలు ఎన్నో..
భారత్, ఇంగ్లండ్ మధ్య బుధవారంనుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్‌తో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా గుర్తింపు తెచ్చుకున్న మొటెరా మైదానం తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటివరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటాన్ని ప్రేక్షకులు ఒక అదృష్టంగా భావిస్తుండగా, ఇప్పుడు భారత అభిమానులకు కూడా మన ‘ఎంసీజీ’లో అలాంటి ‘లక్ష’ణమైన అవకాశం దక్కనుంది. పైగా ఈ టెస్టు మ్యాచ్ పింక్ బంతులతో జరిగే డే అండ్ నైట్ టెస్టు కావడంతో మైదానం మరింత వెలుగులు విరజిమ్మనుంది. సాక్షి క్రీడా విభాగం ‘సర్దార్ పటేల్ స్టేడియం’గా కూడా పిలిచే మొటెరా మైదానంలో 1983 నవంబర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది. సునీల్ గావస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్‌దేవ్ తన 432వ వికెట్‌ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది. 2006 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పలు మార్పులతో దీనిని ఆధునీకరించారు. 2011 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్‌కు వేదికైన ఈ గ్రౌండ్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ 2012 డిసెంబర్లో జరిగింది. 2015లో దీనిని పూర్తిగా పునాదులనుంచి కూలగొట్టి కొత్త స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గత ఏడాది ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్ ఇక్కడే జరగ్గా, ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లతో తొలిసారి క్రికెట్ పోటీలకు గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు తొలిసారి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమైంది. మొటెరా స్టేడియం విశేషాలు చూస్తే.. ► స్టేడియం సామర్థ్యం 1 లక్షా 10 వేలు ► నిర్మాణ వ్యయం సుమారు రూ. 678 కోట్లు ► (ఎల్ అండ్ టీ సంస్థ) ► మొత్తం 63 ఎకరాల్లో విస్తరించి ఉంది ► అవుట్ ఫీల్డ్ పరిమాణం ► 180 గజాలు X 150 గజాలు ► 6 ఇండోర్, 3 అవుట్డోర్ ప్రాక్టీస్ పిచ్‌లు, జిమ్ సౌకర్యంతో కూడిన 4 డ్రెస్సింగ్ రూమ్‌లు ► 40 మందికి వసతి కల్పిస్తూ ► ఇండోర్ క్రికెట్ అకాడమీ ► 76 కార్పొరేట్ బాక్స్‌లు ► స్టేడియానికి ప్రత్యేక ఆకర్షణ ఎల్ఈడీ లైట్లు. ఇతర మైదానాల తరహాలో ఫ్లడ్ లైట్లు వాడకుండా పైకప్పు కింది భాగంనుంచి వరుసగా లైట్లను అమర్చారు. ► ప్రేక్షకులకు అన్ని వైపులనుంచి స్పష్టమైన ‘వ్యూ’ ఉండే విధంగా ఇంత పెద్ద మైదానంలో ఒక్క పిల్లర్ కూడా లేకుండా కొత్త టెక్నాలజీతో నిర్మించడం విశేషం. ► ప్రధాన గ్రౌండ్లో 11 పిచ్‌లు ఉన్నాయి. ► 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా వెంటనే ఆట కోసం సిద్ధం చేసే అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ► ఒకేసారి స్టేడియం పరిసరాల్లో కనీసం 60 వేల మంది స్వేచ్ఛగా తిరగగలిగే విధంగా ప్రత్యేక ర్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ► 3 వేల కార్లు, 10 వేల ద్విచక్రవాహనాల పార్కింగ్ సౌకర్యం -
వచ్చే ఏడాది 9 జట్లతో ఐపీఎల్!
ముంబై: నాలుగు నెలల్లో ఐపీఎల్–14 జరగాలి. ఈ సీజన్‌కు, వచ్చే సీజన్‌కు విరామం తక్కువున్నా తప్పనిసరిగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే నిర్వహించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ కూడా నిర్వహించాలి. ఈ ఏడాదిలా 2021లో ఐపీఎల్ వాయిదా వేస్తే కుదరదు. అందుకే వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్‌పై కసరత్తు మొదలుపెట్టాయి. అందులో భాగంగానే వచ్చే సీజన్లో 8 జట్లు కాకుండా 9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అలాగే పాక్షిక వేలం కాకుండా వచ్చే సీజన్ కోసం మెగా వేలాన్ని నిర్వహించాలా అనే దానిపై కూడా బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లందరినీ వేలానికి తెస్తారు. అప్పుడు జట్ల రూపురేఖలు మారొచ్చు. అయితే ఇది కేవలం ప్రతిపాదనే అని దీనిపై ఇంకా చర్చగానీ, నిర్ణయం కానీ తీసుకోలేదు. ‘రెండు నెలల్లో జరిగే వేలానికి సిద్ధంగా ఉండాలంటూ బీసీసీఐ మాకు సమాచారం ఇచ్చింది. అధికారికంగా తెలపకపోయినా... మరో జట్టు చేరే అవకాశమున్నట్లు మాకూ తెలిసింది’ అని ఒక ఫ్రాంచైజీ ఉన్నతాధికారి వెల్లడించారు. లక్షా 10 వేల మంది సామర్థ్యం కలిగిన సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొత్తగా రానుందని, బడా కార్పొరేట్ సంస్థలు దీనిపై కన్నేశాయని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో వేలం ఎలా వుంటుందో, ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ (అట్టిపెట్టుకునే విధానం) ఏ విధంగా మారుతుందోననే చర్చ మొదలైంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తారా లేదంటే అందరీని వేలంలోకి తేస్తారా అనే విషయంపై బోర్డు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ స్టేక్ హోల్డర్స్‌తో సమావేశం ఏర్పాటు చేశాకే దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. -
ప్రపంచ గతిని మారుస్తాం
అహ్మదాబాద్: ట్రంప్ భారత్‌కు ప్రత్యేక స్నేహితుడని ప్రధాని మోదీ అభివర్ణించారు. ట్రంప్ భారత పర్యటన భారత్, అమెరికా సంబంధాల్లో కొత్త చరిత్ర సృష్టిస్తుందన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్ర దేశాలన్నారు. మొతెరా స్టేడియంలో సోమవారం జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. తొలుత, ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ ప్రసంగించిన మోదీ.. ట్రంప్ ప్రసంగం అనంతరం మళ్లీ కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి స్వాగతం’ అంటూ ట్రంప్‌కు మోదీ స్వాగతం పలికారు. ‘21వ శతాబ్దంలో ప్రపంచ గతిని మార్చడంలో భారత్, అమెరికా సంబంధాలు, వాటి మధ్య నెలకొన్న సహకారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు దేశాలు సహజసిద్ధ భాగస్వాములు’ అని తన ప్రసంగంలో మోదీ వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య నెలకొన్న సంబంధాలను ప్రస్తావిస్తూ.. అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని గుర్తు చేశారు. ‘భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. భారత్‌కు రక్షణ ఉత్పత్తులను అత్యధికంగా అందిస్తున్న దేశం అమెరికా’ అన్నారు. ఈ రెండు దేశాలు సంయుక్తంగా అనేక సైనిక విన్యాసాలు నిర్వహించాయన్నారు. ‘ఈ రెండు దేశాల మధ్య సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రత, పురోగతి నెలకొనడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది’ అన్నారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణ సంబంధాలుగా తీసిపారేయలేమని, ప్రస్తుతం అవి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ తన కుటుంబంతో భారత్‌కు రావడం దీన్నే స్పష్టీకరిస్తోందన్నారు. ‘ట్రంప్ భారత పర్యటన ఈ దశాబ్దం ప్రారంభంలో చోటు చేసుకున్న అతిపెద్ద కార్యక్రమం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ట్రంప్ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది’ అన్నారు. కార్యక్రమంలో ముందు వరసలో ఇవాంకా, ఆమె భర్త కుష్నర్, హోం మంత్రి అమిత్ షా తదితరులు -
హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా
డెబ్బయ్ లక్షల మంది స్వాగతిస్తారన్నారు. అది తక్కువనిపించిందేమో!! అంతలోనే ! ఆ సంఖ్య కోటికి చేరింది. ఆ క్షణం రానే వచ్చింది. ట్రంప్ ఊహించిన కోటి మంది కాకున్నా... అహ్మదాబాద్ వీధుల్లో లక్షల మంది స్వాగతం పలికారు. మొతెరా మైదానంలో మరో లక్షన్నర మంది ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించారు. భారత్‌కు రాకముందు ట్రంప్ యంత్రాంగం కశ్మీర్‌ను తెరపైకి తెచ్చింది. సీఏఏ నిరసనలనూ ప్రస్తావించింది. కానీ ఆశ్చర్యంగా.. ట్రంప్ ప్రసంగంలో మోదీ కీర్తి ప్రతిష్టలకు ట్రంపెట్ల మోతలే తప్ప భారత్‌ను ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలేమీ లేవు. భారత్‌లో మత సామరస్యానికి జై కొడుతూ... తమ దేశంలోని భారతీయ అమెరికన్ల ప్రతిభకు జేజేలన్నారు. మందగమనంలోని భారతానికి ఊరటనిచ్చేలా వాణిజ్యపరమైన ప్రకటనలు చేస్తారని భావించారంతా!!. అంతకుమించి... అనేలా భారతీయుల్ని సంతోషపెట్టారు ట్రంప్. మన దీపావళి, హోలీ పండుగల్ని మనకే వివరిస్తూ... దిల్వాలే దుల్హనియా, షోలే అంటూ బాలీవుడ్ సినిమా చూపించారు. క్రికెట్ వీరులు సచిన్, కోహ్లీలనూ కొనియాడారు. భారతీయుల నుంచి కోట్లాది చప్పట్లను రాబట్టడానికి ఇంతకన్నా ఏమైనా కావాలా చెప్పండి..? ఇక దారిపొడవునా ఘన స్వాగతం పలికిన గుజరాతీలను తక్కువ చేయలేదు ట్రంప్. అల్లంత ఎత్తున్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని మాటల్లో మరింత ఎత్తున ఆవిష్కరించారు. మోదీ ఛాయ్‌వాలా నుంచి ప్రభుత్వ సారథిగా మారిన చరిత్రను మరోసారి వినిపించారు. సాక్షాత్తూ అగ్రరాజ్యాధీశుడే తమను అలా పొగిడేస్తుంటే స్థానికులకు ఇంకేం కావాలి చెప్పండి? మొత్తానికి మొదటిరోజు ప్రసంగమంతా జనరంజకమే!. వీనులవిందైన పరస్పర పొగడ్తలే! ఈ ప్రసంగంలో దేశానికి కాస్తంత ప్రయోజనం కలిగించే అంశమేదైనా ఉందంటే అది 3 బిలియన్ డాలర్ల రక్షణ పరికరాల కొనుగోలు ఒప్పందమే!. తాము ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్లు, క్షిపణులు, యుద్ధనౌకలు తయారు చేస్తున్నామని చెప్పిన ట్రంప్.. హెలికాప్టర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు భారత్‌తో 3 బిలియన్ డాలర్ల (రూ. 21వేల కోట్ల) ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. మరి మంగళవారం ఇరువురు ప్రభుత్వాధినేతల చర్చల్లో ఇదొక్కటే సాకారమవుతుందా? మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా? అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం – ట్రంప్ ట్రంప్ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం. ఈ అధ్యాయం భారత్, అమెరికాల ప్రజల పురోగతి, సౌభాగ్యాలకు తార్కాణంగా నిలుస్తుంది. ఇరు దేశాల మధ్య నమ్మకం, విశ్వాసం అత్యున్నత, చరిత్రాత్మక శిఖరాలకు చేరాయి. – మోదీ అహ్మదాబాద్: ‘అమెరికా భారత్‌ను అభిమానిస్తుంది.. అమెరికా భారత్‌ను గౌరవిస్తుంది.. అమెరికా భారత్‌కు ఎన్నటికీ విశ్వసనీయ మిత్రుడిగా ఉంటుంది. ఈ సందేశాన్ని ఈ దేశ పౌరులకు ఇవ్వడం కోసం నేను, మెలానియా 8 వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చాం’.. భారతీయుల మనసు గెలుచుకునే ఈ సందేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ప్రారంభించారు. అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా లక్షకు పైగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి సోమవారం ట్రంప్ ప్రసంగించారు. ‘నమస్తే.. నమస్తే.. హలో ఇండియా’ అంటూ తన ప్రసంగాన్ని ట్రంప్ ప్రారంభించారు. భారత ప్రధాని మోదీ తనకు నిజమైన స్నేహితుడని, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆ మహోన్నత నేతకు.. తనకీ అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. భారత సాంస్కృతిక వైభవాన్ని, గత 70 ఏళ్లలో భారత్ సాధించిన అద్భుత విజయాలను, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాటిస్తున్న గొప్ప విలువలను, వివిధ రంగాల్లో ఇండియా సాధించిన ఘనతలను ట్రంప్ తన ప్రసంగంలో సందర్భానుసారం ప్రస్తావించి, భారతీయులను ఆకట్టుకున్నారు. స్వామి వివేకానంద ప్రవచిత వ్యాఖ్యను గుర్తు చేసి, భారత దార్శనికతను ప్రశంసించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ సామర్థ్యాన్ని తన ప్రసంగంలో గుర్తు చేశారు. భారత్‌కు సహకరించే విషయంలో అమెరికా ముందుంటుందని, భారత సాయుధ దళాలకు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయనున్నాయని వెల్లడించారు. వేదికపైకి మోదీ, ట్రంప్‌తో పాటు మెలానియా వచ్చారు. హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, ట్రంప్ కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్.. ఇతర ప్రముఖులు మొదటి వరుసలో కూర్చుని ట్రంప్, మోదీల ప్రసంగాలను విన్నారు. ఈ స్వాగతాన్ని మర్చిపోలేం ‘ఐదు నెలల క్రితం భారత ప్రధానికి అమెరికాలో భారీ ఫుట్‌బాల్ స్టేడియంలో స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నన్ను స్వాగతిస్తున్నారు. ఈ స్వాగతం గొప్పగా ఉంది. థ్యాంక్యూ. ఈ ఆతిథ్యాన్ని మేమెన్నడూ మర్చిపోం’ అని ట్రంప్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు కలిసిమెలిసి జీవిస్తున్న దేశంగా.. వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలన, పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనం కల్పిస్తున్న దేశంగా భారత్‌ను ప్రపంచదేశాలు అభిమానిస్తాయన్నారు. గట్టి ప్రతినిధి ఒక సామాన్య భారతీయుడు ఏం సాధించగలడనేదానికి భారత ప్రధాని మోదీనే సజీవ తార్కాణమని ప్రశంసించారు. భారత, అమెరికా వాణిజ్య చర్చలను ప్రస్తావిస్తూ ‘మోదీ తమ దేశం తరఫున గట్టిగా వాదిస్తారు(టఫ్ నెగోషియేటర్)’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘‘మోదీని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాకపోతే ఆయనతో వ్యవహారాలు నడపడం అంత సులువు కూడా కాదు’’అని అన్నారు. ‘‘ప్రధానమంత్రి మోదీగారు.. మీరు గుజరాత్‌కు మాత్రమే గర్వకారణం కాదు. అంకితభావంతో కష్టపడి పనిచేస్తే భారతీయులు ఏదైనా సాధించగలరు అనేందుకు సజీవ తార్కాణం మీరు’’అని ప్రజల హర్షధ్వానాల మధ్య వివరించారు. ‘భారత్ సామర్థ్యం ఆశ్చర్యకరం. అద్భుతం. స్వతంత్ర దేశంగా భారత్ సాధించిన అభివృద్ధి మిగతా దేశాలకు స్ఫూర్తిదాయకం. భారత్ సాధించిన పురోగతి ఈ శతాబ్దంలోనే అసాధారణ విజయం’ అని ఇండియాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. చప్పట్లు.. నవ్వులు.. గుజరాత్ సహా పలు ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు లక్షమందితో మొతెరా స్టేడియం కిక్కిరిసింది. మోదీ, సర్దార్‌పటేల్‌ను ప్రశంసిస్తున్న సమయంలో, షోలే, డీడీఎల్‌జీ వంటి బాలీవుడ్ సినిమాలు, క్రికెటర్లు సచిన్, కోహ్లీలను ప్రస్తావించిన సమయంలోనూ భారీగా చప్పట్లు వినిపించాయి. ట్రంప్ మాటతీరు, ఉచ్ఛారణతో పలుమార్లు స్టేడియంలో నవ్వులు పూచాయి. ప్రపంచం మారుమూలల్లోనూ భారతీయ నృత్యం భాంగ్రాకు, హోళీ, దీపావళి పండగలకు మంచి ఆదరణ ఉందన్నారు. ‘ఏడాదికి రెండు వేల సినిమాలు తీసే అత్యద్భుతమైన సృజనాత్మకత ఉన్న బాలీవుడ్ ఉన్న దేశమిది’అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రజలకు ట్రంప్, మోదీ అభివాదం సాంస్కృతిక కార్యక్రమాలు మోదీ, ట్రంప్‌లు స్టేడియంలోకి వచ్చేవరకు బాలీవుడ్ గాయకుడు కైలాశ్ ఖేర్ బృందం, గుజరాతీ స్థానిక గాయకులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు స్టేడియంలో వాలంటీర్లుగా వ్యవహరించారు. వి ద పీపుల్ నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం ప్రెసిడెంట్ ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘‘అమెరికా, భారత్.. ఈ రెండు దేశాల రాజ్యాంగాలు ఒకే అద్భుతమైన పదంతో ప్రారంభమవుతాయి. అది ‘వి ద పీపుల్(ప్రజలమైన)’. అంటే, మన రెండు దేశాల్లోనూ దేశ పౌరులకు సమాన గౌరవం, సాధికారత, విశ్వాసం లభిస్తాయి’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఎండల్లో.. ఓపికగా ప్రజలు... స్టేడియంకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకే విచ్చేసిన ప్రజల సహనానికి ఎర్రటి ఎండ పరీక్ష పెట్టింది. స్టేడియం సామర్త్యం 1.10 లక్షలు కాగా సోమవారం అంతకు మించి 1.25 లక్షల మంది చేరారు. ఇరువురు నేతలు ప్రజలకు అభివాదం చేయడాన్ని పెద్ద ఎత్తున హర్షధ్వానాల మధ్య స్వాగతించారు కూడా. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ప్రజల ఓపిక తగ్గుతూ వచ్చింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న ప్రజలు ఆ తరువాత ట్రంప్ మాట్లాడే సమయానికి ఒక్కరొక్కరుగా స్టేడియంను వీడిపోవడం కనిపించింది. మోదీని ట్రంప్ ప్రశంసించే సమయంలో చాలామంది బయటకు వెళ్లారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ముప్పు కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో భారత్, అమెరికాలు ఉన్నాయన్నారు. ‘ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను సంపూర్ణంగా నాశనం చేశాం. ఐఎస్ స్థాపకుడైన అల్ బగ్దాదీ వంటి రాక్షసున్ని అంతమొందించాం’ అని గుర్తు చేశారు. తమ సరిహద్దులను కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని, ఉగ్రవాదులను, వారి భావజాలాన్ని నిర్మూలించే దిశగా భారత్, అమెరికా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘నేను అధ్యక్ష బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి ఉగ్రసంస్థలను, వారి భూభాగంలోని ఉగ్రవాదులను నాశనం చేసే దిశగా పాకిస్తాన్‌తో సానుకూలంగా వ్యవహరిస్తున్నాం’ అన్నారు. ‘పాక్‌తో మా సంబంధాలు బావున్నాయి. అవి మెరుగుపడే దిశగా వెళ్తున్నాం. దక్షిణాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు తొలగుతాయని, సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నా’ అన్నారు. ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. చైనా పేరును ప్రస్తావించకుండానే.. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, అమెరికాలు కృషి చేస్తున్నాయన్నారు. భారత్, అమెరికాలు సహజ మిత్రదేశాలను ట్రంప్ అభివర్ణించారు. అమెరికా విలువలను కాపాడేవారికి తమ దేశంలోకి స్వాగతం పలుకుతామని, అదే సమయంలో ఉగ్రవాదాన్ని కానీ ఏ విధమైన తీవ్రవాదాన్ని కానీ సమర్ధించబోమన్నారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం -
అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్ : అగ్రరాజ్య అధ్యక్షుడి ఆగమనానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి భారత పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. కుటుంబంతో సహా ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదా బాద్‌లో నేటి మధ్యాహ్నం అడుగిడనున్నారు. దేశ రాజధానికి కాకుండా.. నేరుగా ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరానికి అమెరికా అధ్యక్షుడు వస్తుండటం ఒక విశేషమైతే.. ప్రొటొకాల్‌కు విరుద్ధంగా దేశ రాజధానిలో కాకుండా మరో నగరానికి వెళ్లి మరీ భారత ప్రధాని ఆయనకు స్వాగతం పలుకుతుండటం మరో విశేషం.భారత పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ వస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ట్రంప్ కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా భారత్ వస్తున్నారు. కీలక అంశాల్లో భారత్‌తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఇండియా వస్తోంది. (ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) 36 గంటలు.. ముఖ్యమైన కార్యక్రమాలు భారత్‌లో తొలుత ట్రంప్ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. ఎయిర్పోర్ట్ నుంచి వారు నేరుగా ఈ రోడ్ షోలో పాలుపంచుకుంటారు. దాదాపు 22 కి.మీ.లు ఈ రోడ్ షో జరుగుతుంది. వేలాది మంది ఈ రోడ్ షోలో ట్రంప్‌నకు స్వాగతం పలుకుతారు. రోడ్ షో పొడవునా 28 వేదికలను ఏర్పాటు చేసి, భారతీయ కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అనంతరం, కొత్తగా నిర్మించిన మొతెరా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’కార్యక్రమం ఉంటుంది. ట్రంప్‌నకు స్వాగతం పలుకుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్ కైలాశ్ ఖేర్ నేతృత్వంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంతో పాటు భారతీయత ఉట్టిపడే పలు ఇతర కార్యక్రమాలుంటాయి. గత సంవత్సరం మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. హ్యూస్టన్‌లో అక్కడి భారతీయులు ఏర్పాటు చేసిన హౌడీ మోదీ’కార్యక్రమం తరహాలో ఈ ‘నమస్తే ట్రంప్’ఉంటుంది. ఆ కార్యక్రమం తరువాత ట్రంప్ దంపతులు ఆగ్రా వెళ్లి, ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపుతారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాను, తాజ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి ట్రంప్ దంపతులు నేరుగా ఢిల్లీ వెళ్లి హోటల్ మౌర్య షెరాటన్‌లో సేద తీరుతారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుడికి అధికారిక స్వాగత కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పిస్తారు. అనంతరం, హైదరాబాద్ హౌజ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చల్లో ప్రధాని మోదీతో కలిసి పాలుపంచుకుంటారు. ఆ తరువాత, అమెరికా అధ్యక్షుడు, తన స్నేహితుడు ట్రంప్ గౌరవార్ధం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం ఉంటుంది. అనంతరం, యూఎస్ ఎంబసీలో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొంటారు. వాటిలో ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక భేటీ కూడా ఉంటుంది. మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతిని రామ్‌నాథ్ కోవింద్‌ను ట్రంప్ కలుస్తారు. అక్కడ విందు కార్యక్రమంలో పాల్గొని, అమెరికాకు పయనమవుతారు. దాదాపు 36 గంటల పాటు ట్రంప్ భారత్‌లో గడపనున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో స్వాగతం పలికేందుకు చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ చర్చల్లో కీలకం ట్రంప్ పర్యటన భారత్, అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలను మేలిమలుపు తిప్పనుంది. ముఖ్యంగా, రక్షణ, వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ స్థాయిలో సహకారం పెంపొందనుంది. అయితే, వాణిజ్య సుంకాల విషయంలో నెలకొన్న విబేధాలకు సంబంధించి నిర్ధారిత ఫలితాలేవీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కానీ, ఈ ప్రాంతంలో ఆర్థికంగా, సైనికంగా చైనా విస్తృతిని అడ్డుకునే దిశగా ఇరు దేశాల సంబంధాల మధ్య కీలక సానుకూల ఫలితాలు ఈ పర్యటన ద్వారా వెలువడే అవకాశముంది. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరుదేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, విద్యుత్, మత స్వేచ్ఛ, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌తో ప్రతిపాదిత శాంతి ఒప్పందం, ఇండో పసిఫిక్ ప్రాంత పరిస్థితి.. తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని భారత్, అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మత స్వేచ్ఛపై కామెంట్స్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ పర్యటన జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో మత స్వేచ్ఛపై ట్రంప్ తన అభిప్రాయాలను వెల్లడిస్తారని వైట్‌హౌజ్‌లోని ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇరుదేశాల విలువలైన ప్రజాస్వామ్యం, మత స్వేచ్ఛకు సంబంధించి బహిరంగంగాను, వ్యక్తిగత చర్చల్లోనూ ప్రస్తావన తీసుకువస్తారు. అన్ని అంశాలు, ముఖ్యంగా మా ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన మత స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని ప్రెసిడెంట్ తప్పక లేవనెత్తుతారు’అని ఆ అధికారి తేల్చిచెప్పారు. ఐదు ఒప్పందాలు! ఇరు దేశాల మధ్య ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వాణిజ్యం, అంతర్గత భద్రతలకు సంబంధించి ఐదు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా, అమెరికా నుంచి 260 కోట్ల డాలర్లను వెచ్చించి 24 ఎంహెచ్–60 రోమియో హెలీకాప్టర్లను, 80 కోట్ల డాలర్లతో 6 ఏహెచ్ 64ఈ అపాచీ హెలీకాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందాలు కుదిరే అవకాశముంది. భారత్‌కున్న పలు అభ్యంతరాల రీత్యా.. భారత పౌల్ట్రీ, డైరీ మార్కెట్లలో ప్రవేశించాలన్న అమెరికా ఆశలు ఈ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం కనిపించడం లేదు. ట్రంప్ నేటి షెడ్యూల్.. ఉదయం.. 11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్ మధ్యాహ్నం 12:15.. ట్రంప్, మోదీలు కలసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు 01:05.. మొతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం 03:30.. ఆగ్రాకు ప్రయాణం సాయంత్రం 04:45.. ఆగ్రాకు చేరుకుంటారు 05:15.. తాజ్‌మహల్ సందర్శన 06:45.. ఢిల్లీకి ప్రయాణం 07:30.. ఢిల్లీకి చేరుకుంటారు -
అథ్లెటిక్స్ సక్సెస్
ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. అండర్-17 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు; అండర్-14 బాలబాలికల విభాగాల్లో ఛాంపియన్‌షిప్‌ను రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. డిసెంబర్లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు అండర్-17 బాలికల విభాగంలో 27మంది, బాలుర విభాగంలో 27మంది, అండర్-14 బాలికల విభాగంలో 14మంది, బాలుర విభాగంలో 17మంది ఎంపికయ్యారు. విజేతలకు బహుమతులను ఖమ్మం డీఎస్డీవో కబీర్ దాసు ప్రదానం చేశారు. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు ఎం.శ్రీరాంరెడ్డి, సంజీవరావు, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సయ్యద్ ఉస్మాన్, తెలంగాణ వ్యాయమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామయ్య, అథ్లెటిక్స్ కోచ్ గౌస్‌పాషా, పీఈటీ, పీడీలు షఫీ అహ్మద్, రమణ, సుధాకర్, శ్రీనివాస్, మురళి, టి.భాగ్య, సుధాకర్ రాజు, శ్యాంబాబు, సాంబమూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఛాంపియన్షిప్ విజేతల వివ రాలు అండర్-14 బాలికల విభాగంలో ప్రథమ స్థానం- రంగారెడ్డి, ద్వితీయ స్థానం- కరీంనగర్, తృతీయ స్థానం- నల్గొండ. అండర్-14 బాలుర విభాగంలో ప్రథమ స్థానం- రంగారెడ్డి, ద్వితీయ స్థానం- వరంగల్, తృతీయ స్థానం- కరీంనగర్. అండర్-17 బాలికల విభాగంలో ప్రథమ స్థానం- ఖమ్మం, ద్వితీయ స్థానం- నల్గొండ, తృతీయ స్థానం- రంగారెడ్డి. అండర్-17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం- ఖమ్మం, ద్వితీయ స్థానం- రంగారెడ్డి, తృతీయ స్థానం- కరీంనగర్. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అండర్-17 బాలికల విభాగంలో: జి.నిత్య(హైదరాబాద్), జె.సౌజన్య(రంగారెడ్డి), డి.సుష్మభాయ్(ఖమ్మం), యు.పద్మశ్రీ(రంగారెడ్డి), పి.కావ్య(నల్గొండ), ఎన్.జ్యోతి(నల్గొండ), బి.బిందు(రంగారెడ్డి), ఆర్.శిల్ప(నల్గొండ), బి.సంధ్య(నల్గొండ), ఎస్ కీర్తనశ్రీ(కరీంనగర్), జి.విష్ణుప్రియ(కరీంనగర్), పి.ప్రియదర్శిని(కరీంనగర్), పి.లావణ్య(రంగారెడ్డి), పి.తులసి(రంగారెడ్డి), ఎం.వెన్నెల(వరంగల్), టి.నవ్య(వరంగల్), జి.సుష్మ(ఆదిలాబాద్), పి.అనూష(ఖమ్మం), జి.మహేశ్వరి(మహబూబ్‌నగర్), ఆర్.కుసుమ(రంగారెడ్డి), పి.గౌతమి(ఖమ్మం), ఎ.మంజుల(ఆదిలాబాద్), ఎం.స్పందన(ఖమ్మం), పి.దివ్యపావని(ఖమ్మం), ఎల్.దీప్తి(ఖమ్మం), సిహెచ్.ప్రియాంక(వరంగల్), ఎం.రచన(కరీంనగర్). అండర్-17 బాలుర విభాగం: కె.నాగరాజు(ఖమ్మం), ఆర్.రామకృష్ణ(కరీంనగర్), జి.వెంకట నాయుడు(కరీంనగర్), వి.లక్ష్మణ్ బాబు(మెదక్), డి.శ్రీకాంత్(రంగారెడ్డి), బి.గణేష్(రంగారెడ్డి), బి.అనిల్(నల్గొండ), బి.వీరన్న(మెదక్), బి.అరవింద్(వరంగల్), ఎం.కిషోర్(ఖమ్మం), వై.దుర్గాప్రసాద్(రంగారెడ్డి), పి.పాండునాయక్(రంగారెడ్డి), ఎం.శివ(వరంగల్), ఎం.రవి(కరీంనగర్), సిహెచ్.నాగరాజు(కరీంనగర్), టి.రాజు(ఖమ్మం), సి.బలరాం(రంగారెడ్డి), ఎం.రాకేష్(వరంగల్), రాహుల్(వరంగల్), ఆర్.ప్రకాష్(మహబూబ్‌నగర్), ఎం.హరీష్(రంగారెడ్డి), జె.సంతోష్(ఆదిలాబాద్), ఎ.కార్తీక్(ఆదిలాబాద్), జి.కన్నారావు(ఖమ్మం), ఎస్కె.షకీర్(ఆదిలాబాద్), ఎల్.యశ్వంత్ కుమార్(రంగారెడ్డి), బి.విజయ్(మెదక్). అండర్-14 బాలికల విభాగం: పి. వాసవి, బి.ధరణి, కె. శిరీష, ఎం.యమున, యు.స్వాతి కిరణ్మయి, బి.వాణి, ఎం.నవనీత(రంగారెడ్డి); ఎ.అశ్విని, పి.సుకన్య(వరంగల్); సిహెచ్.కవిత(కరీంనగర్); ఎం.లక్ష్మి(ఆదిలాబాద్); వి.పద్మ(ఖమ్మం); ఎస్.శిరీష(నల్గొండ); ఎం.అదితి(హైదరాబాద్). అండర్-14 బాలుర విభాగం: కె.అరవింద్, వై.హరికృష్ణ, పి.హనుమంత్ నాయక్, వి.దుర్గారావు, డి.సతీష్, ఆర్.సంతోష్ రాథోడ్(రంగారెడ్డి); డి.కుమార్, వి.సాంబశివరావు(ఖమ్మం); టి.శివకుమార్, టి.సురేష్, ఎస్.సుఖ్బీర్(కరీంనగర్); డి.తిరుమలేష్ యాదవ్, కె.లక్ష్మణ్(మహబూబ్‌నగర్); ఎం.వెంకటేష్(నల్గొండ); జె.నవీన్(ఆదిలాబాద్); కె.శ్రీనివాస్, ఎం.శ్రీకాంత్ నాయక్(వరంగల్). -
బ్యాడ్మింటన్ చాంపియన్ ‘తెలంగాణ’
ఖమ్మం స్పోర్ట్స్: నాలుగు రోజుల పాటు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి మహిళా, పురుష షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు మంగళవారం ముగిశాయి. మహిళా విభాగంలో సింగిల్స్, డబుల్స్, పురుష సింగిల్స్, డబుల్స్ చాంపియన్ షిప్‌ను తెలంగాణకు చెందిన క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. విజేతలందరూ గోపీచంద్ అకాడమీకి చెందిన వారే కావడం విశేషం. ఖమ్మం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి రుత్వికా శివాని, హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి రితు పూర్ణా దాస్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మూడో సెట్లో రితు పూర్ణా దాస్ విజయం సాధించింది. విజేతలు వీరే... పురుష సింగిల్స్ విభాగంలో ఎ. ఎస్. ఎస్. సిరిల్ వర్మ (మెదక్) ప్రథమ, ఎన్. సృ జన్(చిత్తూరు) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళా సింగిల్స్‌లో రితుపూర్ణదాస్ (హైదరాబాద్) ప్రథమ, జి. రుత్వికాశివాని(ఖమ్మం) ద్వితీయ స్థానాన్ని సాధించుకున్నారు. మహిళా డబుల్స్‌లో బి. సుమీత్‌రెడ్డి, టి.హేమనాగేంద్రబాబు(రంగారెడ్డి) ప్రథమ, బి. వెంకటేష్ (శ్రీకాకుళం), కె. చైతన్యరెడ్డి(తూర్పుగోదావరి) ద్వితీయ స్థానంలో నిలిచారు. మహిళా డబుల్స్‌లో జె. మేఘన, కె. మనీషా(హైదరాబాద్) ప్రథమ, జి. వృశాలి, రితూపూర్ణదాస్ (హైదరాబాద్) ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్స్‌లో తలపడినవారంతా అంతర్జాతీయ క్రీడకారులే కావడం విశేషం. విజేతలకు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ రమణకుమార్, డీఎస్పీ బాలకిషాన్రావు, డీఎస్డీఓ కబీర్దాసు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సిరిపురపు సుదర్శన్‌రావు, జూబ్లీక్లబ్ మాజీ సెక్రటరీ కె.ఈ. సత్యనారయణమూర్తి, జూబ్లీక్లబ్ సెక్రటరీ కర్నాటి వీరభద్రం, చీఫ్ రిఫరీ ఫణీరావు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంటావెంకట్రావు, పాటిబండ్ల యుగంధర్, కోశాధికారి ఉప్పల్‌రెడ్డి, నాయకులు కమర్తపు మురళి, వనమా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
‘భువన’ విజయం
భువనేశ్వర్ 4-0-14- 4 రాజస్థాన్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్ చెలరేగిన భువనేశ్వర్ వాట్సన్ హ్యాట్రిక్ వృథా చేసింది కేవలం 134 పరుగులు... ప్రత్యర్థి రాజస్థాన్ జట్టులో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్. ఈ స్థితిలో సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. సరిగ్గా అదే అద్భుతం చేసి చూపించారు హైదరాబాద్ బౌలర్లు. భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్‌కు... స్పిన్నర్ల పొదుపు తోడవడంతో సీజన్లో మూడో విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగు విజయాలు సాధించిన రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. అహ్మదాబాద్ : స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ దిట్ట. గత ఏడాది ఐపీఎల్లో చిన్న లక్ష్యాలను కాపాడుకుని అనేక మ్యాచ్‌లు గెలిచినా... ఈ సీజన్లో మాత్రం ఇప్పటిదాకా స్టెయిన్ అండ్ కో గాడిలో పడలేదు. ఇలాంటి నేపథ్యంలో... తమ స్థాయికి తగ్గ బంతులతో చెలరేగిన సన్‌రైజర్స్... రాజస్థాన్‌పై విజయం సాధించింది. గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సేన 32 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 134 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (20 బంతుల్లో 33; 7 ఫోర్లు) అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ అందుకోవడంలో విఫలమయ్యారు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) మెరిశాడు. షేన్ వాట్సన్ (3/13) రూపంలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రాజస్థాన్ హ్యాట్రిక్ నమోదు చేసింది. రజత్ భాటియాకు కూడా మూడు వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్థాన్... భువనేశ్వర్ (4/14) ధాటికి 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ (33 బంతుల్లో 22) టాప్ స్కోరర్. స్టెయిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ భువనేశ్వర్ కు లభించింది. ధావన్ మినహా.. సన్‌రైజర్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలిచి దూకుడును కనబరచాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే బంతిపై మంచి ఆధిపత్యం చూపుతున్న ధావన్‌ను వాట్సన్ నాలుగో ఓవర్ చివరి బంతికి దెబ్బ తీశాడు. వన్‌డౌన్‌లో దిగిన లోకేశ్ రాహుల్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) కూడా జోరును చూపించడంతో పవర్‌ప్లే 6 ఓవర్లలో హైదరాబాద్ 50 పరుగులు చేయగలిగింది. అయితే స్వల్ప వ్యవధిలోనే హిట్టర్ ఫించ్ (10 బంతుల్లో 9; 1 ఫోర్)తో పాటు రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో 67 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఇక 12వ ఓవర్లో సన్‌రైజర్స్‌కు అసలైన షాక్ తగిలింది. మిడిల్ ఓవర్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి దిగిన డేవిడ్ వార్నర్ (7 బంతుల్లో 6) జట్టుకు ఉపయోగపడలేదు. సంచలన బౌలర్ ప్రవీణ్ తాంబే విసిరిన గూగ్లీకి తను స్టంప్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే నమన్ ఓజా (19 బంతుల్లో 17; 1 ఫోర్)ను భాటియా అవుట్ చేయడంతో 89 పరుగులకే సగం జట్టు డగౌట్లో కూర్చుంది. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు కనిపించలేదు. స్యామీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హెన్రిక్స్ (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఏమాత్రం ప్రభావం చూపలేదు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) పోరాడాడు. ఆదిలోనే ఝలక్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను ప్రారంభంలో సన్‌రైజర్స్ బౌలర్లు వణికించారు. తొలి ఓవర్ మూడో బంతికే అజింక్యా రహానేను భువనేశ్వర్ దెబ్బతీశాడు. అప్పటికి జట్టు ఇంకా పరుగుల ఖాతా తెరువలేదు. శామ్సన్ (16 బంతుల్లో 16; 1 ఫోర్; 1 సిక్స్), కరుణ్ నాయర్ (9 బంతుల్లో 12; 3 ఫోర్లు), కెప్టెన్ వాట్సన్ (10 బంతుల్లో 11; 1 ఫోర్) నాలుగు ఓవర్ల వ్యవధిలో వెనుదిరగడంతో 41 పరుగులకే రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిలో స్టువర్ట్ బిన్ని (19 బంతుల్లో 12), స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా... వార్నర్ డెరైక్ట్ హిట్‌తో బిన్నీని రనౌట్ చేశాడు. ఇక్కడి నుంచి సన్‌రైజర్స్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థికి పరుగులు రావడం కష్టమైంది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో స్టెయిన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్మిత్ అవుట్ కాగా... భువనేశ్వర్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నువిరిచాడు. దీంతో వాట్సన్ సేన పరాజయం ఖాయమైంది. వాట్సన్ హ్యాట్రిక్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ హ్యాట్రిక్ సాధించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆఖరి బంతికి ధావన్‌ను బౌల్డ్ చేసిన వాట్సన్... మళ్లీ 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఈసారి తొలి రెండు బంతుల్లో హెన్రిక్స్, కరణ్శర్మలను అవుట్ చేశాడు. దీంతో మూడు వరుస బంతుల్లో వాట్సన్ మూడు వికెట్లు తీసినట్లయింది. రాజస్థాన్ ఆడిన గత మ్యాచ్ (కోల్‌కతాతో)లో తాంబే హ్యాట్రిక్ సాధించగా... ఈసారి వాట్సన్ ఈ ఘనత సాధించాడు. సీజన్లో నమోదైన రెండు హ్యాట్రిక్లూ రాజస్థాన్ బౌలర్ల నుంచి రావడం విశేషం. 13 ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది 13వ హ్యాట్రిక్ మిశ్రా ‘సిల్లీ’ రనౌట్ ఒక బ్యాట్స్‌మన్ ఇంత నిర్లక్ష్యంగా కూడా రనౌట్ అవుతాడా? సన్‌రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను చూస్తే ఇదే అనిపిస్తుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగో బంతిని ఆడబోయిన మిశ్రా మిస్ అయ్యాడు. కానీ బై కోసం పరిగెత్తాడు. బంతిని పట్టుకున్న కీపర్ శామ్సన్ వికెట్ల వైపు విసిరాడు. అది మిస్ అయి బౌలర్ ఫాల్కనర్ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ ఫాల్క్‌నర్ విసిరాడు. వికెట్లు మిస్ అయి మళ్లీ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ లోగా మామూలుగా కూడా పరుగు వస్తుంది. కానీ మిశ్రా వెనక్కి చూసుకుంటూ క్రీజులోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. ఇది గమనించిన కీపర్ శామ్సన్ మళ్లీ బంతిని విసిరాడు. ఈసారి స్టంప్‌లకు తగిలింది. మిశ్రా రనౌట్ అయ్యాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) వాట్సన్ 33; ఫించ్ (సి) రహానే (బి) భాటియా 9; రాహుల్ (బి) భాటియా 18; నమన్ ఓజా (బి) భాటియా 17; వార్నర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తాంబే 6; హెన్రిక్స్ (సి) రహానే (బి) వాట్సన్ 9; ఇర్ఫాన్ నాటౌట్ 21; కరణ్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 0; స్టెయిన్ (రనౌట్) 9; మిశ్రా (రనౌట్) 0; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1-37; 2-55; 3-67; 4-85; 5-89; 6-106; 7-106; 8-125; 9-129. బౌలింగ్: రిచర్డ్సన్ 4-0-28-0; కులకర్ణి 2-0-19-0; వాట్సన్ 2-0-13-3; ఫాల్క్‌నర్ 4-0-20-0; భాటియా 4-0-23-3; తాంబే 4-0-21-1. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 0; నాయర్ (సి) ఓజా (బి) స్టెయిన్ 12; శామ్సన్ (బి) శర్మ 16; వాట్సన్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 11; బిన్ని (రనౌట్) 12; స్మిత్ (సి) ఇర్ఫాన్ (బి) స్టెయిన్ 22; భాటియా (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 4; ఫాల్క్‌నర్ (సి) ఫించ్ (బి) భువనేశ్వర్ 4; రిచర్డ్సన్ (సి అండ్ బి) భువనేశ్వర్ 1; కులకర్ణి నాటౌట్ 7; తాంబే (సి) స్టెయిన్ (బి) ఇర్ఫాన్ 3; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1-0; 2-27; 3-37; 4-41; 5-78; 6-82; 7-89; 8-89; 9-91; 10-102. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-14-4; స్టెయిన్ 4-0-31-2; కరణ్ శర్మ 4-0-20-1; హెన్రిక్స్ 2-0-11-1; మిశ్రా 4-0-13-0; ఇర్ఫాన్ 1.5-0-8-1. -
ఖోఖో పోటీలు షురూ
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: మొన్నటి వరకు వాలీబాల్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియం సోమవారం నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు వేదికైంది. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు కొనసాగే 59వ అండర్-19 రాష్ట్రస్థాయి బాల, బాలికల ఖోఖో పోటీలను ముఖ్య అతిథి, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ క్రీడల్లో బాలుర విభాగంలో చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా 20 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. బాలికల విభాగంలో అనంతపురం, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, మెదక్, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా 15 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ మూడురోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడలలో దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడల ప్రారంభం సందర్భంగా వివిధ జిల్లాల క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. మొదటగా ఏలూరి శ్రీనివాసరావు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జెండా ను ఎగురవేసి టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. క్రీడ లు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తివిద్యాధికారి ఆండ్రూస్, డీఎస్డీవో కబీర్దాస్, కవిత డిగ్రీ కళాశాల క రస్పాండెంట్ కోటా అప్పిరెడ్డి, విజయ్‌బాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్యాంబాబు, అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.క్రిష్టఫర్‌బాబు, ఖోఖో ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతరాములు పాల్గొన్నారు. తొలిరోజు బాలికల విభాగంలో నాలుగు, బాలుర విభాగంలో ఐదు మ్యాచ్‌లు నిర్వహించారు. బాలుర విభాగంలో... తొలిమ్యాచ్‌లో నిజామాబాద్, గుంటూరు తలపడ్డాయి. నిజామాబాద్ పది పాయింట్ల ఆధిక్యంతో గెలుపొందింది. విజయనగరం, మహుబూబ్‌నగర్‌పై 11-2, ప్రకాశం, మెదక్‌పై 9-2, నల్లగొండ, నెల్లూరుపై 3-2, రంగారెడ్డి, కరీంనగర్‌పై 8-2 తేడాతో విజయం సాధించాయి. బాలికల విభాగంలో... బాలికల విభాగంలో తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించారు. తొలి మ్యాచ్‌లో కృష్ణా, కరీంనగర్‌పై 3-2, విజయనగరం, గుంటూరుపై 15-1, హైదరాబాద్-అనంతపురంపై 15-10, ఖమ్మం, తూర్పుగోదావరిపై 10-7 తేడాతో విజయం సాధించాయి. -
వాలీబాల్ విజేత ఖమ్మం
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సర్దార్‌పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న అండర్-17 రాష్ట్రస్థాయి బాలబాలికల వాలీబాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలుర విభాగంలో విజేతగా ఖమ్మం జిల్లా జట్టు నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణ జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ మొదలు, సెమీస్, ఫైనల్స్ ఇలా మొత్తం 26 మ్యాచ్‌లను ఒకేరోజు నిర్వహించారు. క్రీడాకారులు తీవ్ర అలసటకు లోనయ్యారని ఆయా టీమ్‌ల యాజమాన్యాలు వాపోయాయి. బాలుర విభాగంలో ద్వితీయస్థానంలో వరంగల్, తృతీయస్థానాన్ని విజయనగరం దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో వరంగల్, నిజామాబాద్ ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. విజేతలకు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ డీఈఓ బాలరాజు, డీఎస్డీవో కబీర్దాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ జి.శ్యాంప్రసాద్, కె.క్రిష్టపర్‌బాబు, షఫీ, క్రీడల పరిశీలకులు బాలరాజు, ఖమ్మం టూటౌన్ సీఐ సారంగపాణి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఈటీలు డీఈఓను సన్మానించారు. పీఈటీలు, క్రీడాకారులు సమన్వయంతో వ్యవహరించినప్పుడే విజయాలు సాధ్యమని డీఈఓ అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనన్నారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. జాతీయ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.శ్యాంబాబు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న క్రీడాకారులు కె. రాందాస్ (నల్లగొండ), ఎమ్. సృజన్ (వరంగల్), కె.నరేష్ (ఖమ్మం), రాజు (ఖమ్మం), ఎస్.జగపతిబాబు (వరంగల్), ఎన్.రామకృష్ణ (గుంటూరు), కె.పాల్రాజు (శ్రీకాకుళం), నరేష్ (రంగారెడ్డి), ఎమ్.రామారావు (విజయనగరం), కె.పాల్‌రాజ్ (ప్రకాశం), మణికుమార్ (ఖమ్మం), బాషామియా (కర్నూల్), స్టాండ్‌బై గా ఎమ్.తిరుపతి (కరీంనగర్), మణికంఠ (తూర్పుగోదావరి), సాకిబ్ బాషా (చిత్తూర్) ఎంపికయ్యారు. జాతీయ జట్టుకు ఎంపికైన బాలికలు: యు. హంస (నిజామాబాద్), ఎమ్. శ్రీప్రియ (క్రిష్ణా), ఎస్కె. ఈస్తర్‌రాణి (క్రిష్ణా), ఎమ్.అఖిల (నిజామాబాద్), ఎ.జ్యోతి (వరంగల్), ఇ. నిర్మలాదేవి (వరంగల్), డి.నిరూషా (వరంగల్), ఎ.సాహితీరెడ్డి (రంగారెడ్డి), ఎస్. ఐశ్వర్య (తూర్పుగోదావరి), ఎస్.లావణ్య (నల్లగొండ), కె.లక్ష్మీశిరీష (కడప), బి.శ్రావణి (ఖమ్మం), స్టాండ్ బైగా షర్మిల (ప్రకాశం), ఆర్.వరలక్ష్మి (మెదక్), ఎమ్.భవాని (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు.