గెలిపిస్తే లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదు..  | Shiv Sena Slams BJP For Renaming Motera Stadium After PM Modi | Sakshi
Sakshi News home page

మోదీ గొప్ప నాయకుడే.. కానీ వారికంటే గొప్పవాడని భావిస్తే..

Published Sat, Feb 27 2021 1:20 AM | Last Updated on Sat, Feb 27 2021 11:20 AM

Shiv Sena Slams BJP For Renaming Motera Stadium After PM Modi - Sakshi

సాక్షి, ముంబై: అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ క్రికెట్‌ స్టేడియం పేరు మార్పుపై శివసేన తమ సామ్నా పత్రికలో స్పందించింది. ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తే అది ఇష్టారీతిన వ్యవహరించడానికి లైసెన్స్‌ ఇచ్చినట్లు కాదని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించింది. పటేల్‌ పేరును చరిత్ర నుంచి తొలగించడానికి గాంధీ–నెహ్రూ కుటుంబాలు కుట్రలు చేస్తున్నాయని గత ఐదేళ్లుగా ఆరోపణలు వస్తున్నాయని, కానీ వాస్తవంగా ఆ కుట్రలు ఎవరు చేస్తున్నారో స్టేడియం పేరు మార్పుతో ఇప్పుడు స్పష్టమైందని మండిపడింది. ఈ మేరకు శివసేనకు చెందిన పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. పెద్దవన్నీ గుజరాత్‌లోనే ఉండాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతోందని పేర్కొంది. అందులో తప్పు లేనప్పటికీ తాము దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని చురకలంటించింది. ఇన్నాళ్లూ ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియం ఉండేదని, ఇప్పుడు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం పేరును మోదీ పేరుతో మార్చాక నరేంద్ర మోదీ స్టేడియమే ప్రపంచంలో పెద్దదని తెలిపింది.  

మోదీ గొప్ప నాయకుడే.. కానీ.. 
ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని, కానీ మహాత్మ గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్, ఇందిరా గాంధీల కంటే గొప్ప నాయకుడని అంధ అనుచరులు భావిస్తే అది మరో స్థాయి గుడ్డి నమ్మకం అవుతుందని పేర్కొంది. మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు పెట్టడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించారని అభిప్రాయం వ్యక్తం చేసింది. మోదీ చాలా ప్రజాదరణ గల నాయకుడని, ఆయనకు ప్రజల నుంచి మంచి మద్దతుందని రాసుకొచ్చింది. పటేల్, నెహ్రూలకు కూడా జనాల నుంచి మంచి మద్దతు లభించిందని, దాంతో వారు దేశాభివృద్ధికి పునాది వేశారని వివరించింది. ఐఐటీలు, బార్క్, భాక్రానంగల్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలను నెహ్రూ జాతికి అంకితం చేశారని, కానీ మోదీ పాలనలో ఏం చేశారని ప్రశ్నించింది. సర్దార్‌ పటేల్‌ పేరిట ఉన్న స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరు మీదకు మార్చుకున్నారని ఎద్దేవా చేసింది.

ఇప్పుడు పటేల్‌.. రేపు నేతాజీ.. 
నిన్న మొన్నటి వరకు పటేల్‌ను ప్రశంసించినవారు ఇప్పుడు స్టేడియం పేరు మార్పు విషయానికి వచ్చేసరికి వ్యతిరేకిస్తున్నారని సామ్నా పత్రిక తమ సంపాదకీయంలో దుయ్యబట్టింది. నేటి రాజకీయాల్లో పటేల్‌ ప్రాముఖ్యతను ఎలా తగ్గించారో, పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు కూడా ఇలానే చేస్తారని మండిపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోజనాల కోసం ఛత్రపతి శివాజీ పేరును కూడా వాడుకున్నారని గుర్తుచేసింది. సర్దార్‌ పటేల్‌ తీసుకొచ్చిన ఏ పాలసీలను ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోందో చెప్పాలని ప్రశ్నించింది. రైతుల హక్కుల కోసం పటేల్‌ బార్దోలి సత్యాగ్రహం ముందుండి నడిపించారని, కానీ ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటని అడిగింది. బార్దోలి సత్యాగ్రహం ముగిసిన రెండేళ్ల తర్వాత కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో.. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న పటేల్‌ తాను రైతునని ప్రకటించుకున్నారని తెలిపింది.  

బహుశా అందుకేనేమో.. 
గత నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు సర్దార్‌ పటేల్‌ను ప్రశంసిస్తున్నారని పేర్కొంది. బహుశా అందుకే మొతేరా క్రికెట్‌ స్టేడియం పేరును మార్చి పటేల్‌ పేరును తుడిచేద్దామని చూస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేసింది. కానీ ప్రజలు కోరుకున్నది ఇదేనని, గుజరాత్‌ పౌరులు ఈ మార్పును అంగీకరించారని వ్యాఖ్యానించింది. గుజరాత్‌ ప్రజలకు వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పట్ల గౌరవం లేకపోతే, ఈ నిర్ణయాన్ని విమర్శించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు కూడా లేదని అభిప్రాయపడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement