‘భువన’ విజయం | Bhuvaneshwar Kumar leads Sunrisers Hyderabad to emphatic 32-run win against Rajasthan Royals in IPL 2014 | Sakshi
Sakshi News home page

‘భువన’ విజయం

Published Fri, May 9 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

‘భువన’ విజయం

‘భువన’ విజయం

 భువనేశ్వర్
 4-0-14- 4
 
 రాజస్థాన్‌ను మట్టికరిపించిన సన్‌రైజర్స్
 చెలరేగిన భువనేశ్వర్
 వాట్సన్ హ్యాట్రిక్ వృథా
 
 చేసింది కేవలం 134 పరుగులు... ప్రత్యర్థి రాజస్థాన్ జట్టులో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్. ఈ స్థితిలో సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలంటే అద్భుతమే జరగాలి. సరిగ్గా అదే అద్భుతం చేసి చూపించారు హైదరాబాద్ బౌలర్లు. భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్‌కు... స్పిన్నర్ల పొదుపు తోడవడంతో సీజన్‌లో మూడో విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగు విజయాలు సాధించిన రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది.

అహ్మదాబాద్ : స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ దిట్ట. గత ఏడాది ఐపీఎల్‌లో చిన్న లక్ష్యాలను కాపాడుకుని అనేక మ్యాచ్‌లు గెలిచినా... ఈ సీజన్‌లో మాత్రం ఇప్పటిదాకా స్టెయిన్ అండ్ కో గాడిలో పడలేదు. ఇలాంటి నేపథ్యంలో... తమ స్థాయికి తగ్గ బంతులతో చెలరేగిన సన్‌రైజర్స్... రాజస్థాన్‌పై విజయం సాధించింది.  గురువారం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సేన 32 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 134 పరుగులు చేసింది.
 
 శిఖర్ ధావన్ (20 బంతుల్లో 33; 7 ఫోర్లు) అందించిన శుభారంభాన్ని మిగతా బ్యాట్స్‌మెన్ అందుకోవడంలో విఫలమయ్యారు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) మెరిశాడు. షేన్ వాట్సన్ (3/13) రూపంలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రాజస్థాన్ హ్యాట్రిక్ నమోదు చేసింది. రజత్ భాటియాకు కూడా మూడు వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్థాన్... భువనేశ్వర్ (4/14) ధాటికి 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ (33 బంతుల్లో 22) టాప్ స్కోరర్. స్టెయిన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్  భువనేశ్వర్ కు లభించింది.

 
ధావన్ మినహా..
సన్‌రైజర్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలిచి దూకుడును కనబరచాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అయితే బంతిపై మంచి ఆధిపత్యం చూపుతున్న ధావన్‌ను వాట్సన్ నాలుగో ఓవర్ చివరి బంతికి దెబ్బ తీశాడు.  
 
 వన్‌డౌన్‌లో దిగిన లోకేశ్ రాహుల్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) కూడా జోరును చూపించడంతో పవర్‌ప్లే 6 ఓవర్లలో హైదరాబాద్ 50 పరుగులు చేయగలిగింది. అయితే స్వల్ప వ్యవధిలోనే హిట్టర్ ఫించ్ (10 బంతుల్లో 9; 1 ఫోర్)తో పాటు రాహుల్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో 67 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.
 
 ఇక 12వ ఓవర్‌లో సన్‌రైజర్స్‌కు అసలైన షాక్ తగిలింది. మిడిల్ ఓవర్ల కోసం బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి దిగిన డేవిడ్ వార్నర్ (7 బంతుల్లో 6) జట్టుకు ఉపయోగపడలేదు. సంచలన బౌలర్ ప్రవీణ్ తాంబే విసిరిన గూగ్లీకి తను స్టంప్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే నమన్ ఓజా (19 బంతుల్లో 17; 1 ఫోర్)ను భాటియా అవుట్ చేయడంతో 89 పరుగులకే సగం జట్టు డగౌట్‌లో కూర్చుంది.
 
  ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పు కనిపించలేదు. స్యామీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హెన్రిక్స్ (13 బంతుల్లో 9; 1 ఫోర్) ఏమాత్రం ప్రభావం చూపలేదు. చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (21 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు) పోరాడాడు.
 
 ఆదిలోనే ఝలక్
 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను ప్రారంభంలో సన్‌రైజర్స్ బౌలర్లు వణికించారు. తొలి ఓవర్ మూడో బంతికే అజింక్యా రహానేను భువనేశ్వర్ దెబ్బతీశాడు. అప్పటికి జట్టు ఇంకా పరుగుల ఖాతా తెరువలేదు. శామ్సన్ (16 బంతుల్లో 16; 1 ఫోర్; 1 సిక్స్), కరుణ్ నాయర్ (9 బంతుల్లో 12; 3 ఫోర్లు), కెప్టెన్ వాట్సన్ (10 బంతుల్లో 11; 1 ఫోర్) నాలుగు ఓవర్ల వ్యవధిలో  వెనుదిరగడంతో 41 పరుగులకే రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
 
 ఈ పరిస్థితిలో స్టువర్ట్ బిన్ని (19 బంతుల్లో 12), స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా... వార్నర్ డెరైక్ట్ హిట్‌తో బిన్నీని రనౌట్ చేశాడు.  ఇక్కడి నుంచి సన్‌రైజర్స్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థికి పరుగులు రావడం కష్టమైంది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో స్టెయిన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్మిత్ అవుట్ కాగా... భువనేశ్వర్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్ వెన్నువిరిచాడు. దీంతో వాట్సన్ సేన పరాజయం ఖాయమైంది.
 
 వాట్సన్ హ్యాట్రిక్
 రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ హ్యాట్రిక్ సాధించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆఖరి బంతికి ధావన్‌ను బౌల్డ్ చేసిన వాట్సన్... మళ్లీ 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. ఈసారి తొలి రెండు బంతుల్లో హెన్రిక్స్, కరణ్‌శర్మలను అవుట్ చేశాడు. దీంతో మూడు వరుస బంతుల్లో వాట్సన్ మూడు వికెట్లు తీసినట్లయింది. రాజస్థాన్ ఆడిన గత మ్యాచ్ (కోల్‌కతాతో)లో తాంబే హ్యాట్రిక్ సాధించగా... ఈసారి వాట్సన్ ఈ ఘనత సాధించాడు. సీజన్‌లో నమోదైన రెండు హ్యాట్రిక్‌లూ రాజస్థాన్ బౌలర్ల నుంచి రావడం విశేషం.
 
 13 ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో ఇది 13వ హ్యాట్రిక్
 
 మిశ్రా ‘సిల్లీ’ రనౌట్
 ఒక బ్యాట్స్‌మన్ ఇంత నిర్లక్ష్యంగా కూడా రనౌట్ అవుతాడా? సన్‌రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను చూస్తే ఇదే అనిపిస్తుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగో బంతిని ఆడబోయిన మిశ్రా మిస్ అయ్యాడు. కానీ బై కోసం పరిగెత్తాడు. బంతిని పట్టుకున్న కీపర్ శామ్సన్ వికెట్ల వైపు విసిరాడు. అది మిస్ అయి బౌలర్ ఫాల్కనర్ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ ఫాల్క్‌నర్ విసిరాడు. వికెట్లు మిస్ అయి మళ్లీ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఈ లోగా మామూలుగా కూడా పరుగు వస్తుంది. కానీ మిశ్రా వెనక్కి చూసుకుంటూ క్రీజులోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. ఇది గమనించిన కీపర్ శామ్సన్ మళ్లీ బంతిని విసిరాడు. ఈసారి స్టంప్‌లకు తగిలింది. మిశ్రా రనౌట్ అయ్యాడు.
 
 స్కోరు వివరాలు
 సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) వాట్సన్ 33; ఫించ్ (సి) రహానే (బి) భాటియా 9; రాహుల్ (బి) భాటియా 18; నమన్ ఓజా (బి) భాటియా 17; వార్నర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) తాంబే 6; హెన్రిక్స్ (సి) రహానే (బి) వాట్సన్ 9; ఇర్ఫాన్ నాటౌట్ 21; కరణ్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 0; స్టెయిన్ (రనౌట్) 9; మిశ్రా (రనౌట్) 0; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134.
 
 వికెట్ల పతనం: 1-37; 2-55; 3-67; 4-85; 5-89; 6-106; 7-106; 8-125; 9-129.
 బౌలింగ్: రిచర్డ్‌సన్ 4-0-28-0; కులకర్ణి 2-0-19-0; వాట్సన్ 2-0-13-3; ఫాల్క్‌నర్ 4-0-20-0; భాటియా 4-0-23-3; తాంబే 4-0-21-1.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 0; నాయర్ (సి) ఓజా (బి) స్టెయిన్ 12; శామ్సన్ (బి) శర్మ 16; వాట్సన్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 11; బిన్ని (రనౌట్) 12; స్మిత్ (సి) ఇర్ఫాన్ (బి) స్టెయిన్ 22; భాటియా (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 4; ఫాల్క్‌నర్ (సి) ఫించ్ (బి) భువనేశ్వర్ 4; రిచర్డ్‌సన్ (సి అండ్ బి) భువనేశ్వర్ 1; కులకర్ణి నాటౌట్ 7; తాంబే (సి) స్టెయిన్ (బి) ఇర్ఫాన్ 3; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102.
 వికెట్ల పతనం: 1-0; 2-27; 3-37; 4-41; 5-78; 6-82; 7-89; 8-89; 9-91; 10-102. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-14-4; స్టెయిన్ 4-0-31-2; కరణ్ శర్మ 4-0-20-1; హెన్రిక్స్ 2-0-11-1; మిశ్రా 4-0-13-0; ఇర్ఫాన్ 1.5-0-8-1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement