ఖోఖో పోటీలు షురూ | kho kho tourney started | Sakshi
Sakshi News home page

ఖోఖో పోటీలు షురూ

Published Tue, Dec 17 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM

kho kho tourney started

 ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్:
 మొన్నటి వరకు వాలీబాల్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియం సోమవారం నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు వేదికైంది. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు కొనసాగే 59వ అండర్-19 రాష్ట్రస్థాయి బాల, బాలికల ఖోఖో పోటీలను ముఖ్య అతిథి, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ క్రీడల్లో బాలుర విభాగంలో చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా 20 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. బాలికల విభాగంలో అనంతపురం, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, మెదక్, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా 15 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ మూడురోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడలలో దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడల ప్రారంభం సందర్భంగా వివిధ జిల్లాల క్రీడాకారులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. మొదటగా ఏలూరి శ్రీనివాసరావు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జెండా ను ఎగురవేసి టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. క్రీడ లు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తివిద్యాధికారి ఆండ్రూస్, డీఎస్డీవో కబీర్‌దాస్, కవిత డిగ్రీ కళాశాల క రస్పాండెంట్ కోటా అప్పిరెడ్డి, విజయ్‌బాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్యాంబాబు, అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.క్రిష్టఫర్‌బాబు, ఖోఖో ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతరాములు పాల్గొన్నారు. తొలిరోజు బాలికల విభాగంలో నాలుగు, బాలుర విభాగంలో ఐదు మ్యాచ్‌లు నిర్వహించారు.
 
 బాలుర విభాగంలో...
 తొలిమ్యాచ్‌లో నిజామాబాద్, గుంటూరు తలపడ్డాయి. నిజామాబాద్ పది పాయింట్ల ఆధిక్యంతో గెలుపొందింది. విజయనగరం, మహుబూబ్‌నగర్‌పై 11-2, ప్రకాశం, మెదక్‌పై 9-2, నల్లగొండ, నెల్లూరుపై 3-2, రంగారెడ్డి, కరీంనగర్‌పై 8-2 తేడాతో విజయం సాధించాయి.
 
 బాలికల విభాగంలో...
 బాలికల విభాగంలో తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించారు. తొలి మ్యాచ్‌లో కృష్ణా, కరీంనగర్‌పై 3-2, విజయనగరం, గుంటూరుపై 15-1, హైదరాబాద్-అనంతపురంపై 15-10, ఖమ్మం, తూర్పుగోదావరిపై 10-7 తేడాతో విజయం సాధించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement