volley ball
-
బ్లాక్ హాక్స్ ఖాతాలో మూడో విజయం
ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 3–2 (15–8, 13–15, 15–9, 15–12, 8–15) సెట్ల తేడాతో కోల్‌కతా థండర్బోల్ట్స్ను ఓడించింది. బ్లాక్ హాక్స్ ఆటగాడు ఎస్వీ గురుప్రసాద్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. తాజా గెలుపుతో బ్లాక్ హాక్స్ 6 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. -
వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కే రోజా.. వీడియో వైరల్
సాక్షి, చిత్తూరు: రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడిన రోజా క్రీడాకారుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. కాగా, నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 16 వరకు ఈ క్రీడా పోటీలు కొనసాగనున్నాయి. వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ మీట్‌కి సంబంధించి కమిటీ సభ్యులు, వాలీబాల్, స్పోర్ట్స్ ఇన్చార్జిలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు క్రీడా ఉత్సవాలలో పాల్గొన్నారు. చదవండి: (భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్) -
ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి..
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిపాలన పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. ఆ ఇంటర్యూలో.. కోచ్ అఫ్జలీ అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది. ( చదవండి: VIDEO: బాబోయ్ అంత పెద్ద కొండచిలువనా? ఈ వైరల్ వీడియో వెనుక కథేంటంటే.. ) ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో కూడా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత వారం, ఫిఫా, ఖతర్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు. మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. బాలికల్లోనూ అత్యధికులు సెకండరీ స్కూలుకు వెళ్లడం కూడా మానేశారు. భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. Mahjabin Hakimi, a member of the Afghan women's national volleyball team who played in the youth age group, was slaughtered by the Taliban in Kabul. She was beheaded. @EUinAfghanistan @unwomenafghan https://t.co/wit0XFoUaQ — Sahraa Karimi/ صحرا كريمي (@sahraakarimi) October 19, 2021 చదవండి: Woman Eats Her Dead Husband Ashes: భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మం కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ.. -
మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్-అమెరికా సైనికులు
వాషింగ్టన్: భారత్-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయుక్త విన్యాసాలు అమెరికాలోని అలాస్కాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి 29వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనున్న ఈ సంయుక్త విన్యాసాల్లో మన దేశం ఆర్మీ తరపున 350 మంది జవాన్లు పాల్గొంటుండగా.. అమెరికా నుంచి 300 మంది సైనికులు హాజరవుతున్నారు. అమెరికా బలగాలతో కలిసిపోయేందుకు... భారత సైన్యం వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో శనివారం ఇరు దేశాల సైనికులు కలిసిపోయి.. రెండు జట్లుగా ఏర్పడి కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాయి. అమెరికన్ సైన్యం మన కబడ్డీ కూత మోత మోగించగా.. భారత జవాన్లు ఫుట్‌బాల్ పోటీలో గోల్స్ మీద గోల్స్ చేశారు.. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు... నాలుగు మిశ్రమ జట్లుగా ఏర్పడి పోటీ పడి.. క్రీడా స్ఫూర్తిని చాటారు. (చదవండి: మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి) మంచులో సందడి ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు మంచును విసురుకుంటూ ఎంజాయ్ చేశారు.. భారత్-అమెరికా సైన్యాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించారు. ఇరుదేశాల సైన్యం ఒకరినినొకరు అర్థం చేసుకునేందుకు ఈ క్రీడలు బాగా ఉపయోగపడినట్లు సైనికాధికారులు తెలిపారు. భారత్- అమెరికా సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాలను 17వ సారి నిర్వహిస్తున్నారు. రెండు సైన్యాల మధ్య అవగాహన, పరస్పర సహకారం పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు జరగనున్నాయి. భారత్-అమెరికా సైన్యాల 16వ యుద్ధ్ అభ్యాస్ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికానేర్లో జరిగాయి. చదవండి: ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం #WATCH | As part of 'Ice-breaking activities', Indian Army contingent and American contingent participated in friendly matches of Kabaddi, American Football and Volleyball at Joint Base Elmendorf Richardson, Anchorage, Alaska (US) (Video Source: Indian Army) pic.twitter.com/Xe6uM0NigT — ANI (@ANI) October 17, 2021 -
పేదరికం నుంచి ...అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణిగా
వైఎస్సార్ జిల్లా (రాజంపేట టౌన్) : సమాజంలో కొందరి జీవితాలు అచ్చు సినిమాలో మాదిరిగానే ఉంటాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లే తన రెక్కల కష్టంతో పిల్లలను ప్రయోజకులను చేయడంలాంటివి నిజజీవితంలో కొందరికీ ఎదురవుతాయి. అలాంటి సంఘటనే రాజంపేటలోని కూచివారిపల్లె గ్రామానికి చెందిన వసుమతి జీవితంలో చోటు చేసుకుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలని కుతుహులంగా ఉంది కదా! (చదవండి: పెళ్లికి ముందే గర్భం.. భర్తకు ఫోన్ చేసి...) వివరాల్లోకెళితే.... రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామానికి చెందిన వసుమతి చిన్ననాటి జీవితం అచ్చు సినిమాల్లోలాగానే సాగింది. ఆమెకు ఏడాది వయస్సు ఉన్నప్పుడు, తన తమ్ముడు ఈ భూమ్మీద పడకమునుపే వసుమతి తండ్రి వెంకటయ్యనాయుడు చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆకుటుంబంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. వ్యవసాయమే వారి జీవనాధారం. అయితే తల్లి లక్ష్మీకుమారి తన రెక్కల కష్టంతో ఇద్దరు బిడ్డలను పోషిస్తూ వచ్చారు. ఈక్రమంలో పాఠశాల స్థాయిలో జరిగే జిల్లా, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో వసుమతి ప్రతిభ కనబరిచేది. అప్పటి ప్రభుత్వ హైస్కూల్ పీటీ, వాలీబాల్ కోచ్ అయిన ఎస్. షామీర్ బాషా వసుమతిలోని ప్రతిభను పసిగట్టి మరింత ప్రోత్సహించసాగారు. ఇదే సమయంలో తన బిడ్డ వాలీబాల్‌లో ప్రతిభ కనబరుస్తుండటం ఆనోట, ఈనోట విన్న తల్లి లక్ష్మీకుమారి తన బిడ్డను ఎలాగైనా మంచి క్రీడాకారిణిగా తయారు చేయాలనుకుంది. అయితే ఆడపిల్లను ఊరుకాని ఊరికీ పంపి ఆటలు ఆడించటం ఎందుకు అని వసుమతి తల్లిని నిరుత్సాహ పరిచినవారు లేక పోలేదు. అయితే ఆమెకు తన బిడ్డలోని ప్రతిభ మాత్రమే కనిపించేది. అందువల్ల ఆమె ఎవరి మాటలను పట్టించుకోలేదు. పాడిరైతు అయిన వసుమతి తల్లి సంపాదన అంతంత మాత్రమే కావడంతో ఆమె సోదరులు కూడా తమవంతు సహకరించారు. దీంతో ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన బిడ్డను ప్రోత్సహించింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో వసుమతి 18 మార్లు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆడారు. అలాగే 2002వ సంవత్సరం వియాత్నంలో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికై ఆ పోటీల్లో ఆమె విశేష ప్రతిభ కనబర్చారు. ఫలితంగా 2005వ సంవత్సరంలో వసుమతి స్పోర్ట్ కోటా కింద సౌత్‌సెంట్రల్ రైల్వేలో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో ఆ కుటుంబం పేదరికానికి దూరమైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో సౌత్‌సెంట్రల్ రైల్వేలోనే ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇదే జిల్లా నుంచి ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం విశేషం. ఇదే జిల్లాలో 1978లో బీయాబానీ, 1986లో కరిముల్లా తర్వాత మహిళల విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా వసుమతి నిలిచింది. (చదవండి: దొమ్మరివారి నేల.. నేడు దొమ్మర నంద్యాల) -
త్వరలోనే కొత్త లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహా 6 జట్లు
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడను మరింత ఆకర్షణీయంగా మార్చే క్రమంలో కొత్తగా మరో లీగ్ తెరపైకి వచ్చింది. ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో దీనిని నిర్వహించనున్నారు. ఇందులో హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెన్డోస్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్ పేర్లతో ఆరు నగరాలకు చెందిన జట్లు ఉంటాయి. ఈ టోర్నీ వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీ కోసం వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. 2019లో జరిగిన ప్రొ వాలీబాల్ లీగ్‌లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఈ టోర్నీని ముందుకు తెచ్చారు. ఫ్రాంచైజీల చేతుల్లోనే టోర్నీ మొత్తం యాజమాన్య హక్కులు ఉండే పద్ధతిలో తొలిసారి ఇలాంటి టోర్నమెంట్ జరగనుందని ప్రైమ్ వాలీబాల్ లీగ్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య వెల్లడించారు. ఆన్లైన్ కంపెనీ ఏ23, ప్లేయర్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ లీగ్‌లో ప్రధాన భాగస్వాములు కాగా... సోనీ నెట్వర్క్ ఈ లీగ్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. కార్యక్రమంలో టీమ్‌ల యజమానులు, సోనీ ప్రతినిధులతో పాటు భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు పీవీ రమణ కూడా పాల్గొన్నారు. చదవండి: Neeraj Chopra: ఒలింపిక్ రికార్డును సవరించాల్సి ఉంది -
ఆటలో వివాదం.. బాలుడి హత్య
ముప్పాళ్ల: వాలీబాల్ ఆటలో జరిగిన వివాదం బాలుడి హత్యకు దారితీసింది. గుంటూరు జిలా ముప్పాళ్లకు చెందిన షేక్ ఆఫ్రీది(16), ఖాజిల్ వాలీబాల్ ఆడుకుంటూ గొడవపడ్డారు. ఈ విషయాన్ని ఖాజిల్ తన పెదనాన్న షేక్ పెదబాజీకి తెలిపాడు. దీంతో పెదబాజీ కత్తితో ఆఫ్రీది ఇంటిపైకి వెళ్లాడు. అక్కడ బయట ఉన్న ఆఫ్రీదిపై దాడిచేశాడు. స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పెదబాజీని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయూబ్‌ఖాన్, సైదాబీల రెండో కుమారుడైన ఆఫ్రీది ఈ ఏడాది పదో తరగతి చదవాల్సి ఉంది. ఆఫ్రీది హత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
హోరాహోరీగా వాలీబాల్ టోర్నీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు రెండోరోజైన శనివారం హోరాహోరీగా సాగాయి. స్థానిక నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు సూపర్‌లీగ్ దశకు చేరుకున్నాయి. పామిడి, వైఎస్సార్ కడప, సంజీవరెడ్డి స్టేడియం జట్టు, అనంతపురం మెడికల్ జట్లు లీగ్ స్థాయి పోటీల్లో గెలిచి సూపర్‌లీగ్‌కు చేరుకున్నాయి. సూపర్‌లీగ్ మ్యాచ్‌లు శనివారం సాయంత్రం, ఆదివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. పోటీలకు సీఐలు సాయిప్రసాద్, రియాజ్, తబ్రేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆదివారం టోర్నీ ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొండారెడ్డి తెలిపారు. పోటీలకు మనోహర్‌రెడ్డి, జబీర్, గౌడ్, నసీమాబాను, ప్రవీణ్‌కుమార్, రమేష్, రామాంజినేయులు, సురేష్, నరేష్ రెఫరీలుగా వ్యవహరించారు. లీగ్ మ్యాచ్ వివరాలు.. - డీఎస్ఏ అనంతపురం జట్టును 25–21, 18–25, 15–6 (2–1) తేడాతో అనంతపురం మెడికల్ జట్టు ఓడించింది. - నెల్లూరు జట్టుపై 18–25, 25–20, 15–12 (2–1) తేడాతో వైఎస్సార్ కడప జట్టు గెలిచింది. - కర్నూలుపై 21–25, 25–23, 15–10 (2–1) తేడాతో వైఎస్సార్ కడప జట్టు విజయం సాధించింది. - చిత్తూరు జట్టును 25–17, 25–16 (2–0)తేడాతో పామిడి జట్టు ఓడించింది. - ఎస్ఆర్ స్టేడియం జట్టు 25–17, 25–16 (2–0) తేడాతో నార్పల జట్టును ఓడించింది. - చిత్తూరుపై ప్రకాశం 32–30, 25–18(2–0) తేడాతో గెలిచింది. సూపర్‌లీగ్ పోటీలు.. - పామిడిపై అనంతపురం మెడికల్ జట్టు 25–14, 25–20 (2–0) తేడాతో విజయం సాధించింది. - వైఎస్సార్ కడప జట్టుతో మ్యాచ్‌లో 24–26, 25–23, 15–13 (2–1) తేడాతో ఎస్ఆర్ స్టేడియం జట్టు గెలిచింది. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
అల్లూరు (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు అల్లూరు మంతెన సత్యనారాయణరాజు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అండర్ 17 వాలీబాల్ బాలికల విబాగంలో ఎ జీవననాగజ్యోతి, పి.భవాని (స్టాండ్‌బై ), వాలీబాల్ అండర్ 14 బాలికల విబాగంలో పి సదా,ఎ లీలా మాధవి , ఎస్కె ఫాతిమా (స్టాండ్‌బై )లు ఎంపికైనట్లు తెలిపారు. అండర్ 14 బాలుర విబాగంలో ఎన్హర్షవర్దన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు (స్టాండ్‌బైగా ) ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈనెల 8వ తేదీన నరసరావుపేటలో జరిగిన ఖేల్‌ఇండియా జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైయ్యారని తెలిపారు. -
వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక
తెనాలి: కడపలో నవంబరు 3–6 తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల జూనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లను ఆదివారం తెనాలిలో ఎంపిక చేశారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ క్రీడామైదానంలో ఈ ఎంపికలు చేశారు. ఎంపిక కమిటీ సభ్యులుగా ఎస్.నిరంజనరావు, జీకేఎస్ విజయ్‌చంద్, కె.రజనీనాయక్, షేక్ కరిముల్లా, రవి వ్యవహరించారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ పర్యవేక్షించారు. బాలుర జట్టు: కె.రాజేష్ (తెనాలి), ఎస్.శేషగిరి, పి.కిరణ్‌కుమార్ (నిజాంపట్నం), టి.మణికంఠ (ఈమని), పృథ్వీరామ్ (వడ్లమూడి), సీహెచ్ రవితేజ (పల్లపట్ల), పి.తిరుపతిరెడ్డి, డి.మల్లేష్‌రెడ్డి, ఎస్.పవన్‌కళ్యాణ్, జి.సాయిరామ్ (వెదుళ్లపల్లి), డి.ఏడుకొండలు, ఎం.మనోజ్‌కుమార్ (మంగళగిరి), పి.వినయ్‌కుమార్ (హాఫ్‌పేట), ఎ.సాయికిరణ్ (చిలకలూరిపేట), జి.నవీన్ (జముడుపాడు). కోచ్: కె.రజనీనాయక్ (వెదుళ్లపల్లి). బాలికల జట్టు: ఏవీఎస్ పార్వతి, కె.జీవననాగజ్యోతి, బి.మదర్‌థెరిసా (అల్లూరు), బి.బిందుమాధవి (సూరేపల్లి), ఎ.కావ్య, ఆర్.అఖిల (అమృతలూరు), సీహెచ్ హేమప్రియాంక, టి.లక్ష్మి (తాడేపల్లి), వి.విజయలక్ష్మి (అడవులదీవి), ఎం.సింధు (పిరాట్లంక), ఎన్.నవ్య (రేపల్లె), కె.ఉమామహేశ్వరి, ఎం.ప్రసన్న (ఖాజీపాలెం), టి.శృతి (పిట్టలవానిపాలెం). కోచ్: షేక్ కరీముల్లా (అమృతలూరు) -
ఉత్కంఠభరితంగా వాలీబాల్ పోటీలు
కుంకలగుంట (నకరికల్లు): జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు కుంకలగుంటలో ఘనంగా నిర్వహించారు. కుంకలగుంట పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే పోటీలు ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగాయి. పోటీలలో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. తొలిరోజు జరిగిన పోటీలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల (నరసరావుపేట), గోళ్లపాడు ముప్పాళ్ల, వాగ్దేవి గోల్డెన్బాయ్స్ (నరసరావుపేట) జట్లు విజేతలుగా నిలిచి లీగ్మ్యాచ్లలో ప్రవేసించాయి. రెండురోజు ఫైనల్ పోటీలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎస్పీ విశాల్ గున్నీ అట్టహాసంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం గూడూరు: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ విశాల్‌గున్నీ పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను గురువారం ఎస్పీ ప్రారంభించారు. తొలుత స్పోర్ట్స్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నారు. కేరళ యువతుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు గూడూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. అనంతరం వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణారావు, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి , ఎన్బీకేఆర్ విద్యా సంస్థల అధినేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మునిగిరీష్, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపాల్‌రావు, రొటేరియన్లు కేఎస్‌రెడ్డి, జానకిరాంరెడ్డి, సురేంద్రరెడ్డి, దయాకర్‌రెడ్డి, మనపాటి రవీంద్రబాబు, లక్ష్మీ పీఎంరావు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విజయనగరం జట్టు, విశాఖపట్నంపై ప్రకాశం, గుంటూరుపై అనంతపూర్ జట్లు విజయం సాధించాయి. అలాగే స్త్రీల విభాగంలో చిత్తూరు జట్టుపై కృష్ణా జట్టు , తూర్పు గోదావరిపై పశ్చిమ గోదావరి జట్టు విజయం సాధించాయి. -
వాలీబాల్ జట్లకు ముగిసిన శిక్షణ
తెనాలి: నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం నుంచి జరగనున్న సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ అంతర జిల్లాల పోటీల్లో పాల్గొనే గుంటూరు జిల్లా జట్లకు శిక్షణ శిబిరం వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ క్రీడాకారులకు క్రీడాదుస్తులు అందజేశారు. ఘనవిజయం సాధించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర జట్టులో జిల్లా నుంచి తగిన ప్రాతినిధ్యం ఉండేలా ప్రతిభను చాటాలని కోరారు. కాలేజి వ్యాయామ అధ్యాపకుడు ఎస్.నిరంజన్‌రావు, జిల్లా క్రీడాభివృద్ధి రిటైర్డు అధికారి రావి సత్యనారాయణ పాల్గొన్నారు. -
జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన క్రీడాకారులు 6 నుంచి గూడూరులో రాష్ట్రస్థాయి పోటీలు తెనాలి: రాష్ట్ర అంతర జిల్లాల సీనియర్ వాలీబాల్ పోటీల్లో పాల్గొననున్న వాలీబాల్ పురుషుల, మహిళల జిల్లా జట్లను ఆదివారం ఇక్కడ ఎంపిక చేశారు. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ మైదానానికి జిల్లావ్యాప్తంగా వచ్చిన క్రీడాకారుల నుంచి ఎంపిక నిర్వహించారు. అక్టోబరు 6– 9 తేదీల్లో నెల్లూరు జిల్లా గూడూరులో జరిగే అంతరజిల్లాల వాలీబాల్ పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఆయనతోపాటు ఎస్.నిరంజనరావు, జె.సింగారావు, జీకేవీఎస్ విజయ్‌చంద్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి జి.బుల్లిప్రసాద్, రిటైర్డ్ జిల్లా క్రీడాభివద్ధి అధికారి ఆర్.సత్యనారాయణ పాల్గొన్నారు. పురుషుల జట్టు ఇదీ.. షేక్ బాజీ (కొలనుకొండ), వి.సాయినితిన్, కె.ఉదయ్‌కుమార్, టి.తరుణ్ చమన్య (వడ్డేశ్వరం), కె.మధుసూదనరావు, టి.రవి (మంగళగిరి), కె.జెస్సిబాబు (మాచవరం), డి.సాయికృష్ణ, ఇ.రవీంద్ర (తెనాలి), షేక్ షమ్మీ సోహిల్, డి.సాయితేజ (వెదుళ్లపల్లి), ఎం.రాహుల్ (గుంటూరు), జి.కోదండరామయ్య (గంగవరం), జి.నవీన్ (వేమూరు), టి.నాగరాజు (ఈమని). ఇది మహిళల జట్టు.. వీఎస్ఎల్కే దుర్గ, ఎ.నందిని (నంబూరు), డి.నారూష, పి.మాధురి, సీహెచ్.జెష్మ (గుంటూరు), వి.ద్రాక్షాయని, బీఎల్ కాంతమ్మ, వి.శిరీష, డి.వాణి, ఎ.రమ్య (తెనాలి), బి.మదర్‌థెరిస్సా (భట్టిప్రోలు), ఎ.కావ్య (అమతలూరు), బి.పరిమళ, బి.వైష్ణవి (వడ్లమూడి). -
విజేత సెయింట్ జోసెఫ్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో సెయింట్ జోసెఫ్, షేర్వుడ్ స్కూల్స్ విజేతలుగా నిలిచాయి. బషీర్‌బాగ్‌లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్లో శనివారం జరిగిన జూనియర్ బాలికల ఫైనల్లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట) స్కూల్ 25-26, 25-11తో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) స్కూల్‌పై గెలుపొందగా... సీనియర్ బాలికల ఫైనల్లో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ 25-14, 25-20తో అభ్యాస స్కూల్‌ను ఓడించింది. అంతకు ముందు జరిగిన జూనియర్ బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ జోసెఫ్ (మలక్‌పేట) స్కూల్ 25-16, 25-16తో సెయింట్ ఆన్స్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 18-25, 25-18, 17-15తో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాయి. సీనియర్ బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ 25-22, 25-21తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) స్కూల్‌పై, అభ్యాస స్కూల్ 25-22, 25-11తో ఎన్ఏఎస్ఆర్ స్కూల్స్‌పై గెలుపొందాయి. -
అభ్యాస స్కూల్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో అభ్యాస స్కూల్, షేర్వుడ్ పబ్లిక్ స్కూల్స్ ముందంజ వేశాయి. బషీర్‌బాగ్‌లోని షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో అభ్యాస స్కూల్ 25-19, 25-17తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గెలుపొందగా... షేర్వుడ్ స్కూల్ 25-15, 25-17తో ఎన్ఏఎస్ఆర్ స్కూల్‌ను ఓడించింది. జూనియర్ బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌ల్లో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ 27-25, 25-11, 15-10తో జాన్సన్ గ్రామర్ స్కూల్‌పై, సెయింట్ ఆన్స్ 25-13, 25-14తో రమాదేవి పబ్లిక్ స్కూల్‌పై, సెయింట్ జోసెఫ్ స్కూల్ 25-11, 25-11తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై, షేర్వుడ్ పబ్లిక్ స్కూల్ 25-23, 26-24తో సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై విజయం సాధించాయి. -
సెమీఫైనల్‌కు సింగరేణి జట్టు
యైటింక్లయిన్‌కాలనీ/సెంటినరీకాలనీ : సెంటినరీకాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో జరుగుతున్న కోలిండియాస్థాయి వాలీబాల్ పోటీల్లో బీ-గ్రూప్‌లో ఉన్న సింగరేణి జట్టు 7 పాయింట్లు సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో బీసీసీఎల్పై 2-0 స్కోర్‌తో గెలుపొందింది. బీ-గ్రూప్‌లోని ఎస్ఈసీఎల్ జట్టు కూడా సెమీఫైనల్‌కు వెళ్లింది. గ్రూప్- ఏలోని ఎన్సీఎల్ జట్టు ఈసీఎల్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొందింది. డబ్ల్యూసీఎల్ జట్టు సీసీఎల్ జట్టుపై 2-0 పాయింట్లతో విజయం సాధించింది. ఆదివారం ఉదయం సెమీఫైనల్స్, సాయంత్రం ఫైనల్ జరగనుంది. సెమీఫైనల్స్‌లో సింగరేణి వర్సెస్ ఎన్సీఎల్, డబ్ల్యూసీఎల్ వర్సెస్ ఎస్ఈసీఎల్ జట్లు తలపడనున్నాయి. జట్ల వారీగా పాయింట్ల వివరాలిలా ఉన్నాయి. ఎన్సీఎల్-11, డబ్ల్యూసీఎల్-10, ఎస్ఈసీఎల్-8, సింగరేణి- 7, ఎంసీఎల్-4, సీసీఎల్-3, బీసీసీఎల్-3, ఈసీఎల్-2, సీఎంపీడీఐ-0 పాయింట్లు సాధించాయి. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
గుడివాడ రూరల్, న్యూస్‌లైన్ : నిర్మాణంలో ఉన్న కల్వర్టును బైక్‌ఢీకొన్న ఘట నలో ముగ్గురు యువకులు దుర్మరణంపాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎంఎన్కే రోడ్డుపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... మోటూరుకు చెందిన వేల్పూరి తేజ (22), చిరి చింతల గ్రామానికి చెందిన గజ్జల జగదీష్(18), గుడివాడ పెద్దవీధికి చెందిన మరో యువకుడు పంది హరీష్(17), అంగలూరు గ్రామానికి చెందిన కలిదిండి శివ(17) స్నేహితులు. వాలీబాల్ ఆడే క్రమంలో వీరందరూ స్నేహితులయ్యారు. పాలిటెక్నిక్ చదివి, మోటూరులోని తాతయ్య వద్ద ఉంటున్న వేల్పూరి తేజకు ఓ బైక్ షోరూమ్‌లో ఉద్యోగం వచ్చింది. వారంలో విధుల్లో చేరాలి. పంది హరీష్ తండ్రి మార్కెట్ సెంటరులో అరటి పళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆయన కష్టపడి హరీష్‌ను మాంటిస్సోరి స్కూల్లో పదో తరగతి చదివిస్తున్నారు. జగదీష్ ఐటీఐ విద్యార్థి. శివ ఐటీఐ చదివి ఆర్టీసీలో అప్రెంటీస్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా శనివారం రాత్రి ఒకే బైక్‌పై అంగలూరు బయలుదేరారు. కొంత కాలంగా ఎంఎన్కే రోడ్డు విస్తీర్ణంలో భాగంగా మరమ్మతులు చేస్తున్నారు. సిద్ధాంతం, అంగలూరుమధ్యలో హరియాలీ బంకు దాటిన తరువాత ఈ రోడ్డుపై ఓ కల్వర్టు నిర్మాణంలో ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాదక హెచ్చరికలు ఏర్పాటు చేయలేదు. చీకట్లో ఈ కల్వర్టు కనిపించకపోవడంతో ఆ యువకులు బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వేల్పూరి తేజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలువదిలాడు. గజ్జల జగదీష్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. పంది హరీష్ కొన ఊపిరితో ఉండగా 108 సిబ్బంది ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు పరీ క్షించి చనిపోయినట్లు నిర్థారించారు. కలిదిండి శివ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై బైఠాయించిన బంధువులు రోడ్డు మరమ్మతులు చేస్తున్నప్పుడు కనీస నియమాలు కూడా పాటించనందునే తమ బిడ్డలు ప్రాణాలు వదిలారంటూ మృతుల బంధువులు ఘటనాస్థలంలో రోడ్డుపై బైఠాయించారు. వాహనాలరాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వివాదం జరి గింది. అనంతరం పోలీసులు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. రూరల్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
పైకా జాతీయ క్రీడలు ప్రారంభం
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: పాలమూరు జిల్లా తొలిసారిగా అండర్-16 పైకా జాతీయ క్రీడలకు వేదిక అయింది. జిల్లా స్టేడియంలో మంగళవారం సాయంత్రం క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడలు ఈనెల 10వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో అథ్లెటిక్స్, వాలీబాల్, తైక్వాండో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీకి 18 రాష్ట్రాల నుంచి 1400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో బాల, బాలికలకు 100 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, 3వేల మీటర్ల పరుగుతోపాటు లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, 4ఁ100 మీటర్ల రిలే, 4ఁ400మీటర్ల రిలే పోటీలు నిర్వహిస్తారు. తైక్వాండోలో బాలురకు 48 కిలోల విభాగంతోపాటు, 51, 55, 59, 63, 68, 73, 73 కిలోలపైబడి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. బాలికలకు 44 కిలోలు, 47, 51, 55, 55కిలోలపైబడి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. -
ఖోఖో పోటీలు షురూ
ఖమ్మం వైరారోడ్, న్యూస్‌లైన్: మొన్నటి వరకు వాలీబాల్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియం సోమవారం నుంచి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు వేదికైంది. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు కొనసాగే 59వ అండర్-19 రాష్ట్రస్థాయి బాల, బాలికల ఖోఖో పోటీలను ముఖ్య అతిథి, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ క్రీడల్లో బాలుర విభాగంలో చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా 20 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. బాలికల విభాగంలో అనంతపురం, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, మెదక్, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి మినహా 15 జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ మూడురోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడలలో దాదాపు 600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడల ప్రారంభం సందర్భంగా వివిధ జిల్లాల క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. మొదటగా ఏలూరి శ్రీనివాసరావు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జెండా ను ఎగురవేసి టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. క్రీడ లు మానసికోల్లాసానికి దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తివిద్యాధికారి ఆండ్రూస్, డీఎస్డీవో కబీర్దాస్, కవిత డిగ్రీ కళాశాల క రస్పాండెంట్ కోటా అప్పిరెడ్డి, విజయ్‌బాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్యాంబాబు, అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.క్రిష్టఫర్‌బాబు, ఖోఖో ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతరాములు పాల్గొన్నారు. తొలిరోజు బాలికల విభాగంలో నాలుగు, బాలుర విభాగంలో ఐదు మ్యాచ్‌లు నిర్వహించారు. బాలుర విభాగంలో... తొలిమ్యాచ్‌లో నిజామాబాద్, గుంటూరు తలపడ్డాయి. నిజామాబాద్ పది పాయింట్ల ఆధిక్యంతో గెలుపొందింది. విజయనగరం, మహుబూబ్‌నగర్‌పై 11-2, ప్రకాశం, మెదక్‌పై 9-2, నల్లగొండ, నెల్లూరుపై 3-2, రంగారెడ్డి, కరీంనగర్‌పై 8-2 తేడాతో విజయం సాధించాయి. బాలికల విభాగంలో... బాలికల విభాగంలో తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించారు. తొలి మ్యాచ్‌లో కృష్ణా, కరీంనగర్‌పై 3-2, విజయనగరం, గుంటూరుపై 15-1, హైదరాబాద్-అనంతపురంపై 15-10, ఖమ్మం, తూర్పుగోదావరిపై 10-7 తేడాతో విజయం సాధించాయి.