వైఎస్సార్ జిల్లా (రాజంపేట టౌన్) : సమాజంలో కొందరి జీవితాలు అచ్చు సినిమాలో మాదిరిగానే ఉంటాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లే తన రెక్కల కష్టంతో పిల్లలను ప్రయోజకులను చేయడంలాంటివి నిజజీవితంలో కొందరికీ ఎదురవుతాయి. అలాంటి సంఘటనే రాజంపేటలోని కూచివారిపల్లె గ్రామానికి చెందిన వసుమతి జీవితంలో చోటు చేసుకుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలని కుతుహులంగా ఉంది కదా!
(చదవండి: పెళ్లికి ముందే గర్భం.. భర్తకు ఫోన్ చేసి...)
వివరాల్లోకెళితే.... రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామానికి చెందిన వసుమతి చిన్ననాటి జీవితం అచ్చు సినిమాల్లోలాగానే సాగింది. ఆమెకు ఏడాది వయస్సు ఉన్నప్పుడు, తన తమ్ముడు ఈ భూమ్మీద పడకమునుపే వసుమతి తండ్రి వెంకటయ్యనాయుడు చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా ఆకుటుంబంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. వ్యవసాయమే వారి జీవనాధారం. అయితే తల్లి లక్ష్మీకుమారి తన రెక్కల కష్టంతో ఇద్దరు బిడ్డలను పోషిస్తూ వచ్చారు. ఈక్రమంలో పాఠశాల స్థాయిలో జరిగే జిల్లా, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో వసుమతి ప్రతిభ కనబరిచేది. అప్పటి ప్రభుత్వ హైస్కూల్ పీటీ, వాలీబాల్ కోచ్ అయిన ఎస్. షామీర్ బాషా వసుమతిలోని ప్రతిభను పసిగట్టి మరింత ప్రోత్సహించసాగారు.
ఇదే సమయంలో తన బిడ్డ వాలీబాల్‌లో ప్రతిభ కనబరుస్తుండటం ఆనోట, ఈనోట విన్న తల్లి లక్ష్మీకుమారి తన బిడ్డను ఎలాగైనా మంచి క్రీడాకారిణిగా తయారు చేయాలనుకుంది. అయితే ఆడపిల్లను ఊరుకాని ఊరికీ పంపి ఆటలు ఆడించటం ఎందుకు అని వసుమతి తల్లిని నిరుత్సాహ పరిచినవారు లేక పోలేదు. అయితే ఆమెకు తన బిడ్డలోని ప్రతిభ మాత్రమే కనిపించేది. అందువల్ల ఆమె ఎవరి మాటలను పట్టించుకోలేదు. పాడిరైతు అయిన వసుమతి తల్లి సంపాదన అంతంత మాత్రమే కావడంతో ఆమె సోదరులు కూడా తమవంతు సహకరించారు. దీంతో ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన బిడ్డను ప్రోత్సహించింది. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో వసుమతి 18 మార్లు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ఆడారు.
అలాగే 2002వ సంవత్సరం వియాత్నంలో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికై ఆ పోటీల్లో ఆమె విశేష ప్రతిభ కనబర్చారు. ఫలితంగా 2005వ సంవత్సరంలో వసుమతి స్పోర్ట్ కోటా కింద సౌత్‌సెంట్రల్ రైల్వేలో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో ఆ కుటుంబం పేదరికానికి దూరమైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో సౌత్‌సెంట్రల్ రైల్వేలోనే ఆఫీస్ సూపరిండెంట్‌గా పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇదే జిల్లా నుంచి ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం విశేషం. ఇదే జిల్లాలో 1978లో బీయాబానీ, 1986లో కరిముల్లా తర్వాత మహిళల విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా వసుమతి నిలిచింది.
(చదవండి: దొమ్మరివారి నేల.. నేడు దొమ్మర నంద్యాల)
Comments
Please login to add a commentAdd a comment