రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
గుడివాడ రూరల్, న్యూస్‌లైన్ : నిర్మాణంలో ఉన్న కల్వర్టును బైక్‌ఢీకొన్న ఘట నలో ముగ్గురు యువకులు దుర్మరణంపాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎంఎన్‌కే రోడ్డుపై శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు... మోటూరుకు చెందిన వేల్పూరి తేజ (22), చిరి చింతల గ్రామానికి చెందిన గజ్జల జగదీష్(18), గుడివాడ పెద్దవీధికి చెందిన మరో యువకుడు పంది హరీష్(17), అంగలూరు గ్రామానికి చెందిన కలిదిండి శివ(17) స్నేహితులు. వాలీబాల్ ఆడే క్రమంలో వీరందరూ స్నేహితులయ్యారు.
పాలిటెక్నిక్ చదివి, మోటూరులోని తాతయ్య వద్ద ఉంటున్న వేల్పూరి తేజకు ఓ బైక్ షోరూమ్‌లో ఉద్యోగం వచ్చింది. వారంలో విధుల్లో చేరాలి. పంది హరీష్ తండ్రి మార్కెట్ సెంటరులో అరటి పళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆయన కష్టపడి హరీష్‌ను మాంటిస్సోరి స్కూల్‌లో పదో తరగతి చదివిస్తున్నారు. జగదీష్ ఐటీఐ విద్యార్థి. శివ ఐటీఐ చదివి ఆర్‌టీసీలో అప్రెంటీస్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా శనివారం రాత్రి ఒకే బైక్‌పై అంగలూరు బయలుదేరారు. కొంత కాలంగా ఎంఎన్‌కే రోడ్డు విస్తీర్ణంలో భాగంగా మరమ్మతులు చేస్తున్నారు.
సిద్ధాంతం, అంగలూరుమధ్యలో హరియాలీ బంకు దాటిన తరువాత ఈ రోడ్డుపై ఓ కల్వర్టు నిర్మాణంలో ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాదక హెచ్చరికలు ఏర్పాటు చేయలేదు. చీకట్లో ఈ కల్వర్టు కనిపించకపోవడంతో ఆ యువకులు బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వేల్పూరి తేజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలువదిలాడు. గజ్జల జగదీష్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. పంది హరీష్ కొన ఊపిరితో ఉండగా 108 సిబ్బంది ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్లు పరీ క్షించి చనిపోయినట్లు నిర్థారించారు. కలిదిండి శివ తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డుపై బైఠాయించిన బంధువులు
రోడ్డు మరమ్మతులు చేస్తున్నప్పుడు కనీస నియమాలు కూడా పాటించనందునే తమ బిడ్డలు ప్రాణాలు వదిలారంటూ మృతుల బంధువులు ఘటనాస్థలంలో రోడ్డుపై బైఠాయించారు. వాహనాలరాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వివాదం జరి గింది. అనంతరం పోలీసులు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. రూరల్ ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.