సుచిన్‌..షోజే..చీవాలా!! | US President Donald Trump stumbles on Indian names | Sakshi
Sakshi News home page

సుచిన్‌..షోజే..చీవాలా!!

Published Tue, Feb 25 2020 4:55 AM | Last Updated on Tue, Feb 25 2020 4:55 AM

US President Donald Trump stumbles on Indian names - Sakshi

ఎయిర్‌పోర్టులో జానపద కళాకారుల నృత్యాల మధ్య ట్రంప్‌ దంపతులకు సాదర స్వాగతం పలుకుతున్న మోదీ

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రసంగం విషయంలో బాగానే ప్రిపేరయినట్లున్నారు. ఎందుకంటే దీన్లో ఆయన బోలెడన్ని భారతీయ పేర్లు, పండుగలు, హిందీ సినిమాలను కూడా జొప్పించారు. కాకపోతే వాటిని పలకటంలో మాత్రం తడబడ్డారు. నరేంద్రమోదీని ఛాయ్‌ వాలాగా సంభోదించబోయి ‘చీవాలా’ అన్నారు. ఇక వేదాలను వేస్టాస్‌గా... స్వామి వివేకానంద పేరును వివేకాముందగా... సచిన్‌ టెండూల్కర్‌ను సుచిన్‌ టెండూల్కర్‌గా పేర్కొన్నారు. దీంతో పాటు షోలే సినిమాను షోజే అని అన్నారు.

దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా పేరును షార్ట్‌కట్‌లో చక్కగా డీడీఎల్‌జే అని పలికేశారు. ఈ తప్పులపై ట్విటర్‌లో ట్రోలింగ్‌ బాగానే జరిగింది. కాకపోతే ఇన్ని పేర్లను పలకటానికి ట్రంప్‌ బాగానే హోమ్‌ వర్క్‌ చేసి ఉంటారంటూ చాలామంది వీటిని తేలిగ్గానే తీసుకున్నారు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ పేరును సుచిన్‌ టెండూల్కర్‌గా పలికినందుకు ట్రంప్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శించింది. అయినా అమెరికాలో సగం మంది క్రికెట్‌ అంటేనే... ‘అదేం ఆట?’ అని అడిగే పరిస్థితి ఉంది. అలాంటిది ట్రంప్‌ ఏకంగా సచిన్‌ పేరునే బట్టీపట్టినందుకు ప్రశంసించాలంటూ కొందరు పేర్కొనటం కొసమెరుపు!!.

ట్రంప్‌ తొలిరోజు పర్యటన సాగిందిలా
►  ఉదయం 11.40కి అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్‌ దంపతులు చేరుకున్నారు.
►   12.10: సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు
►  12.50: మొటెరా స్టేడియంకు వెళ్లారు
►  1.15: ట్రంప్‌ ప్రసంగం ప్రారంభించారు.
►   2.50: అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.
►  4.15: ఆగ్రా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు.
►  4.50: తాజ్‌మహల్‌ సందర్శనకు వచ్చారు
►  6.45: తిరిగి ఆగ్రా ఎయిర్‌ బేస్‌కు వెళ్లారు
►  7.40: ఢిల్లీలోని పాలమ్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు
►  8.00: మౌర్య హోటల్‌లో రాత్రి బస   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement