ట్రంప్‌ కారు ప్రత్యేకతలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! | Donald Trump Sticks To The Beast For Spectacular Gujarat Roadshow | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కారు ప్రత్యేకతలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Published Mon, Feb 24 2020 6:19 PM | Last Updated on Mon, Feb 24 2020 9:32 PM

Donald Trump Sticks To The Beast For Spectacular Gujarat Roadshow - Sakshi

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కొనసాగుతోంది. భారత్‌ చేరుకున్న ట్రంప్‌ మెలనియా దంపతులకు మోదీ ఘనస్వాగతం పలికారు. అయితే అమెరికా అధ్యక్షడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో ఆయన ప్రయాణించే కారు 'ద బీస్ట్‌' గురించి తెలుసుకుంటేనే అర్థమైపోతుంది. భారత్‌లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణం మొత్తం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చిన కార్లలోనే కొనసాగింది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారు 'ది బీస్ట్'. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. దీన్ని కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా పిలుస్తుంటారు. చదవండి: చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్‌ అందాలు వీక్షిస్తూ..

1963లో అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించింది. దీని వినియోగానికి భారీగానే ఖర్చుపెడుతున్నారు. ప్రస్తుతం ట్రంప్‌ వాడుతున్న కాడిలాక్‌ మోడల్‌ 2018 సెప్టెంబర్‌ 24న ఆయన కాన్వాయ్‌లోకి చేర్చారు. అధునాతన సౌకర్యాలతో, మెరుగైన భద్రతా ప్రమాణాలతో దీనిని తయారు చేశారు. ఆయన ఏ దేశంలో పర్యటించినా ఇది కూడా అక్కడకి చేరుకోవాల్సిందే. చదవండి: నేను, ప్రథమ మహిళ.. ట్రంప్‌ మరో హిందీ ట్వీట్‌!

కారు ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిస్తే..
దీని ఖరీదు దాదాపు వందకోట్ల రూపాయలు. బీస్ట్‌ టెక్నాలజీ అత్యంత దుర్భేద్యంగా ఉంటుంది. శత్రుదుర్బేధ్యమైన బీస్ట్ కారును బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీ గ్లాస్‌తో ఈ కారును డిజైన్ చేశారు. బీస్ట్ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. అమెరికా కేంద్ర నిఘా సంస్థ సీఐఏ ఎంపిక చేసిన సీక్రెట్ ఏజెంట్ మాత్రమే ఈ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తారు. మిగిలిన వారికి ఈ కారును కనీసం ముట్టుకునేందుకు కూడా అవకాశం ఉండదు. శక్తివంతమైన బాంబులు బీస్ట్‌కు సమీపంలోనే పేలినా లోపల ఉన్న ప్రెసిడెంట్ కుదుపులకు కూడా లోనుకారు. ఇందులో రాత్రి సమయాల్లో ప్రయాణించేటపుడు నైట్‌ విజన్‌ కెమెరాలు ఉంటాయి. కారు డోర్స్ మందం 8 అంగుళాలుగా ఉంటుంది. శక్తివంతమైన బాంబు దాడులను సైతం ఇది తట్టుకుంటుంది.  చదవండి: ట్రంప్‌ విమాన సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే..!

ఈ బీస్ట్ మరో ప్రత్యేకత ఏంటంటే రసాయన ఆయుధ దాడిని కూడా తట్టుకోగల సామర్ధ్యం దీని సొంతం. ఎవరైనా ఈ కారుకి అడ్డుపడితే టియర్ గ్యాస్ వదిలే ఏర్పాటు కూడా ఉంది. ఏదైనా దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. బీస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ఎంతటి బ్లాస్ట్‌ని అయినా తట్టుకుంటుంది. టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి పగిలిపోవు పంక్చర్ కావు. ఒకవేళ డ్యామేజ్ అయినా లోపల ఉండే స్టీల్ రిమ్ లతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ కారులో నుంచే అవసరమైతే షాట్ గన్ ద్వారా గుళ్ల వర్షాన్ని కూడా కురిపించవచ్చు.

అనూహ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే అధ్యక్షుడిని కాపాడటానికి ఆక్సిజన్ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్ రక్తం వంటి సదుపాయాలు ఈ కార్లలో ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ పరిస్థితిలో అధ్యక్షుడు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నా కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో, పెంటగాన్‌తో  మాట్లాడడానికి వీలుగా శాటిలైట్ ఫోన్ ఉంటుంది. డ్రైవర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో కమ్యూనికేషన్ సెంటర్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటాయి. కారులోనే చిన్నపాటి సెల్ టవర్ కూడా ఉంటుంది. ఈ కారును జనరల్ మోటార్స్ సంస్థ తయారు చేసింది. ఇలాంటివి మొత్తం 12 కార్లు ట్రంప్ కాన్వాయ్‌లో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement