లెగ్‌ పీస్‌ డిప్లొమసీ ! | America President Donald Trump Visits India | Sakshi
Sakshi News home page

లెగ్‌ పీస్‌ డిప్లొమసీ !

Published Sun, Feb 23 2020 3:50 AM | Last Updated on Mon, Feb 24 2020 2:01 PM

America President Donald Trump Visits India - Sakshi

అమెరికా అధ్యక్షుడు రేపు భారత పర్యటనకు వస్తు న్నారు. అయితే ఏమిటి? ఇంతకుముందు ఐదుగురు అగ్ర రాజ్యాధినేతలు భారత్‌లో పర్యటించారు. వారిలో బరాక్‌ ఒబామా రెండుసార్లు వచ్చారు. కానీ, ఇప్పుడు వస్తున్నది డొనాల్డ్‌ ట్రంప్‌. మిగతా అధ్యక్షుల కంటే చాలా తేడా. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుని పర్యటనపై ఆసక్తిని సృష్టించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం, భారత మీడియా చేపట్టేవి. ట్రంప్‌ మాత్రం ఆ పని కూడా తానే చేపట్టారు. ‘ఇండియాలో నన్ను చూసేందుకు పది మిలి యన్ల (కోటి) మంది వస్తున్నారు తెలుసా?’... అంటూ అడిగిన వారికీ అడగని వారికీ పిలిచి మరీ చెబుతున్నా రట. మంచి తరుణం మించిన దొరకదు టీవీలో తప్పక చూసి తరించండి అంటూ ఉచిత సలహాలను కూడా పారే స్తున్నారట. దీంతో భారత ప్రభుత్వానికి బీపీ పెరిగింది. అసలీ కోటి గొడవ ఏమిటని ప్రభుత్వాధికారులు ఆరా తీశారట. ఏదో సందర్భంలో ప్రధాని మోదీ అహ్మదాబా  ద్‌లో మీకు దాదాపు పది లక్షలమంది స్వాగతం పలుకు తారని ట్రంప్‌తో చెప్పారట. అమెరికాలో వేలు, మిలి యన్లు, బిలియన్లలోనే గణిస్తారు. వాళ్ల లెక్కల్లో లక్షల వ్యవహారం ఉండదు. మోదీ చెప్పిన లక్షల సంఖ్యను మిలి యన్లుగా ఊహించుకొని ట్రంప్‌ ‘మూన్‌వాక్‌’ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ‘అపూర్వ’ సంఘ టన ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే లెక్కల్లో కూడా ట్రంప్‌ బృందం బిజీగా ఉందట.

ట్రంప్‌–మోదీ ఇద్దరూ కూడా ‘థింక్‌ బిగ్‌’ కేటగిరీకి చెందినవాళ్లు. చిన్న చిన్న అంకెలు వాళ్లకు నచ్చవు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్నదనీ, వృద్ధిరేటు ఐదు శాతం కంటే తక్కువ నమోదు కానున్నదనీ ఎవరెన్ని చెప్పినా మోదీ మాత్రం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం మానలేదు. ట్రంప్‌ కూడా అంతే. చిన్నచిన్న అంకెలూ నచ్చవు, చిన్నచిన్న మనుషులూ నచ్చరు. అందుకే ట్రంప్‌ రోడ్‌షో దారిలో చిన్న మనుషులూ, చిన్నచిన్న ఇళ్లూ ఆయనకు కనిపించకుండా ఆగమేఘాల మీద ఏడడుగుల గోడను నిర్మించారని ప్రతిపక్షాలు, మోదీ అంటే గిట్టనివాళ్లు విమర్శిస్తున్నారు. మోదీ మద్దతు దారులు మాత్రం వేరే కథను వినిపిస్తున్నారు. స్వభా వాల్లో వున్న సారూప్యత కారణంగా మోదీ–ట్రంప్‌ల మధ్య మంచి స్నేహం కుదిరింది. మోదీ రెండోసారి ప్రధా నమంత్రి అయిన తర్వాత అమెరికా వెళ్లినప్పుడు డాలస్‌ నగరంలో జరిగిన పౌర సన్మానంతో పోల్చదగిన స్వాగతం ఏ ఇతర దేశాధ్యక్షునికీ ఇంతవరకూ లభించ లేదట. పైగా స్వయంగా అమెరికా అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అరుదైన స్నేహ సంకేతమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అటువంటి తన అరు దైన మిత్రునికి ఘనమైన స్వాగతాన్ని అందివ్వాలని మోదీ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

స్వాగతంతోపాటు ఒక మరపురాని బహుమతిని కూడా ఇవ్వాలని మోదీ అను కొని ఉండవచ్చు. స్వతహాగా శ్రీమంతుడైన ట్రంప్‌కు ఏ బహుమతి ఇస్తే గొప్పగా ఫీలవుతాడు?. ఆలోచించగా... చించగా ట్రంప్‌కు పెద్దపెద్ద గోడలంటే ఇష్టమనే సంగతి తట్టింది. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల రంగంలోకి అడుగుపెడుతూనే అమెరికన్ల మనసుల్లోనూ, అమెరికా మనుషుల మధ్య గోడలు నిర్మిస్తూ నెగ్గుకొచ్చారు. ఎన్ని కైన తర్వాత మెక్సికో సరిహద్దు వెంట ఒక మూడువేల కిలోమీటర్ల భారీ గోడను నిర్మించాలని పగటి కలలు కంటూనే ఉన్నారు. అందుకని ట్రంప్‌ స్వాగత మార్గం వెంట కిలోమీటర్ల పొడవునా ఒక సరికొత్త గోడను నిర్మించి, ఆ గోడ నిండా ట్రంప్‌కు స్వాగతం పలికే పెయింటింగ్‌లు వేస్తే..? తక్షణమే ఈ ఐడియా అమల్లోకి వచ్చింది. హాలీవుడ్‌ ‘వాల్‌’ స్వాప్నికునికి బాలీవుడ్‌ ‘దీవార్‌’ తోఫా! మోదీ అంటే ప్రేమ ఉన్నవాళ్లు ఇంత ప్రిస్టేజీ గోడను ఎలా కాదనగలరు?. ట్రంప్‌ కనుక ఆ సమయంలో అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే బెర్లిన్‌ గోడను కూలకుండా ఆపేవారా? అనే డౌటు కొందరికి రావచ్చు. కానీ, అంతర్జాతీయ రాజకీయాల్లో ఇటువంటి విపరీతపు ఆలోచనలకు తావుండదు.

అమెరికా అధ్యక్షుని రెండు రోజుల పర్యటనలో ఒక రోజు పూర్తిగా అహ్మదాబాద్‌లో స్వాగత సత్కార కార్య క్రమం, రెండో రోజు ఆగ్రాలో అధినేతల మధ్య వాణిజ్య చర్చలు ఉంటాయని తెలుస్తున్నది. గతంలో పోలిస్తే ఇప్పుడు రెండు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగుతున్నట్టే లెక్క. అయినప్పటికీ ఐదారు అంశాలు మాత్రం పరిష్కరించలేని కొరకరాని కొయ్యలుగా రెండు దేశాలకు సవాల్‌ విసురుతున్నాయి. వీటిలో ప్రధానమై నవి: 1. వాణిజ్య సుంకాల వివాదం, 2. హెచ్‌–1 బి వీసాల సమస్య, 3. డేటా లోకలైజేషన్, 4. మేధో హక్కుల సమస్య, 5. విదేశీ పెట్టుబడుల విషయంలో భారత పరి మితులు, 6. ఇరాన్‌ విషయంలో అమెరికా వైఖరితో భార త్‌కు ఎదురౌతున్న ఇబ్బందులు. రేపటి భేటీలో కచ్చి తంగా చర్చకు వస్తాయంటున్న అంశాలు మాత్రం మొదటి రెండే. కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత్‌తో జరిగే చర్చల్లో ట్రంప్‌కు ఒక అడ్వాంటేజ్‌ పాయింట్‌ కావాలి. ఆ పాయింట్‌ను వాణిజ్య సుంకాల వివాదంలో ట్రంప్‌ సాధించాలి. దాని ఫలితంగా అమెరికా రైతాంగంలో ట్రంప్‌ పలుకుబడి పెరుగుతుంది. బదులుగా భారతీయ వృత్తి నిపుణులకు వీసాలు ఇచ్చే విషయంలో అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి నుంచి కొంత సడలింపును భారత్‌ కోరుకోవడం సహజం.

ప్రస్తుతం రెండుదేశాల మధ్య జరుగుతున్న వార్షిక వర్తక లావాదేవీల విలువ 14,500 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇదికాకుండా భారత ప్రభుత్వం అమెరికా విపణిలో రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు గత పదిహే నేళ్లలో వెచ్చించిన మొత్తాన్ని లెక్కిస్తే అది సగటున ఏటా రూ. పదివేల కోట్లుగా తేలింది. భారత్‌–అమెరికా సుంకాల వివాదంలో ముందుగా కాలు దువ్వింది అమెరి కాయే. ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై పన్నులు పెంచేసింది. ‘అభివృద్ధి చెందుతున్న’ దేశాల జాబితా లోంచి భారత్‌ను తొలగించి అప్పటివరకు ఉన్న కొన్ని రాయితీలను ఎత్తివేసింది. ఫలితంగా భారత్‌కు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న  వస్తువులపై కూడా సుంకాలు పెంచింది. దీని ప్రభావం అమెరికాలోని వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ రంగాలపై పడింది. ఆ రంగాల నుంచి ట్రంప్‌పై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. అమెరికన్లకు చికెన్‌ లెగ్స్‌ తినే అలవాటు లేదు. దాంతో అవి గుట్టలుగా పేరుకు పోతున్నాయి. లెగ్‌ పీసెస్‌ను ఇష్టపడే భారత మార్కెట్‌ను వాటితో నింపేయా లని అక్కడి పౌల్ట్రీ రంగం ఆశ పడుతున్నది. అయితే భారత్‌ ఆ లెగ్‌ పీస్‌లపై నూరుశాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నది. దీన్ని ఇరవై నుంచి ముప్ఫై శాతానికి తగ్గించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నది. అమెరికా ఒత్తిడికి తలొగ్గితే దేశీయ పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతుందని ఆ రంగం ఆందోళన చెందుతున్నది. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సంకేతాలను బట్టి ట్రంప్‌తో జరిగే సమావేశంలో లెగ్‌పీస్‌లపై అమెరికాకు అనుకూ లంగా ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని తెలు స్తోంది. ఇదే జరిగితే భారతీయ మార్కెట్‌ను అమెరికా చికెన్‌ లెగ్‌పీస్‌లు ఆక్రమించడం ఖాయం. సంవత్సరీకం పూర్తి చేసుకున్న కోడి కాళ్లు, ఐదో వర్ధంతి, పదో వర్ధంతి జరుపుకున్న కోడి కాళ్లను మనం ఆరగించేయవచ్చు. స్కాచ్‌ విస్కీలా చికెన్‌ లెగ్స్‌ కూడా ఎంత ఓల్డ్‌ అయితే అంత గోల్డ్‌ అని అమెరికా వాడు ప్రచారంతో ఊదరగొట్ట వచ్చు. మనవాళ్లు విలాసంగా రెస్టారెంట్లో కూర్చొని ‘ఏక్‌ తంగ్డీ కబాబ్‌ లా... బారా సాల్‌ కా’ అంటూ ఆర్డర్‌ చేసే రోజులు తొందర్లోనే వస్తాయేమో. చికెన్‌ లెగ్స్‌తో పాటు బాదంపప్పు, వాల్‌నట్స్, ఆపిల్స్‌ వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ట్రంప్‌ కోరే అవకాశం ఉంది.

అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగులు, వారితో పాటు భారతీయ ఐటీ కంపెనీలు, వీసాలకు సంబంధించి కొన్ని కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వృత్తి నిపుణులను నియమించుకోవడానికి ఇచ్చే వీసాల సంఖ్యను భారీగా కత్తిరించడం వల్ల టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీల విస్తరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. హెచ్‌1బి వీసాలతో పాటు భారతీయ కంపెనీలకు ఇచ్చే ఎల్‌–1 వీసాలను కూడా 90 శాతం తగ్గించారు. హెచ్‌–4 ఈఏడి పై పనిచేస్తున్న లక్ష మంది భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల మెడపై ట్రంప్‌ కత్తి వేలాడుతున్నది. భారతీయ ఇంజనీర్లు గ్రీన్‌ కార్డుల కోసం దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ అంశా లను పరిష్కరించాలన్న ఒత్తిడి కూడా మోదీపై ఉన్నది. కనుక ఎజెండాలో వాటికి స్థానం లభించవచ్చు. ఇందులో ఏ ఒక్క విషయంలో ట్రంప్‌ను ఒప్పించినా అది మోదీకి ప్లస్‌ పాయింటే. లేకపోతే ట్రంప్‌ పర్యటన కేవలం లెగ్‌పీస్‌ డిప్లొమసీగానే మిగిలిపోతుంది.


ఈ చర్చల ఫలితాలు ఏ రకంగా వున్నా మునుపె న్నడూ లేనంత బలంగా ఇప్పుడు ఇండో–అమెరికన్‌ సంబంధాలు అల్లుకున్నాయి. ఇది క్రమంగా జరిగిన పరిణామం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానిగా ఉన్నంతకాలం ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉండేది. భారత్‌ అలీనోద్యమంలో కీలకపాత్ర పోషించేది. అందువల్ల అమెరికా వైపో, రష్యా వైపో పూర్తిగా మొగ్గకుండా తటస్థంగా నిలబడగలిగింది. ఈ సమయంలోనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ భార త్‌లో పర్యటించి గాంధీ పథాన్ని అధ్యయనం చేశారు. అనంతరం అహింసా పద్ధతుల్లో పౌరహక్కుల ఉద్య మాన్ని సాగించి అమెరికన్‌ సమాజాన్ని ఉర్రూతలూగిం చారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న మొదటి పదకొం డేళ్లు పూర్తిస్థాయి రష్యా మిత్రదేశంగా భారత్‌ వ్యవహ రించింది. రాజీవ్‌ గాంధీ పదవీకాలం ముగిసే సమయా నికి రష్యా శిబిరం పతనమైంది. అంతర్జాతీయ సంబం ధాల్లో మళ్లీ ఏకధ్రువ శకం మొదలైంది. భారత్‌లో మొద లైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా లక్షలాది మంది విద్యా ర్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి పొందారు. దేశంలోని ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి కుటుంబాల వారికి పిల్లల్ని అమె రికా చదువుకు పంపించడం ధ్యేయంగా మారింది. ఈ క్రమం ఇంకా కొనసాగుతున్నది. ఇప్పుడు రిటైరైన ఏ ఉద్యోగిని పలకరించినా అమ్మాయి టెక్సాస్‌లో, అబ్బాయి కాలిఫోర్నియాలో ఉంటున్నారని అమెరికాలోని రాష్ట్రాల పేరు చెబుతున్నారు దేశం పేరు వదిలేసి. భారత మధ్య తరగతికి ఇప్పుడు అమెరికా అంత దగ్గరైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అమెరికాతో అణు ఒప్పందం పై సంతకం చేసి భారత్‌ రాజకీయంగా చేరువైంది.


నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే నాటికి అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా చైనా ఎదగడం మొదలైంది. ఆర్థికంగా, సైనికంగా రెండో అతి పెద్ద శక్తిగా అవతరించింది. పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో పెత్తనం చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆఫ్రికా ఖండపు తూర్పు తీరం నుంచి అమెరికా ఖండపు పశ్చిమ తీరం వరకు విస్తరించిన ఈ రెండు మహాసముద్రాల గుండానే మూడింట రెండొంతుల ప్రపంచ వర్తక వాణిజ్యాలు జరుగుతున్నాయి. పసిఫిక్‌లో భాగమైన దక్షిణ చైనా సముద్రంలో జపాన్, కొరియా తదితర దేశాలను ఇప్పటికే బీటు కానిస్టేబుల్లాగ బెది రించడం మొదలు పెట్టింది. అక్కడ్నుంచి ‘ఏసియాన్‌’ సభ్యదేశాలను చుట్టుకుంటూ హిందూ మహాసముద్రంలో భాగమైన బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో మైన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌లలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసి భారత్‌ను దిగ్బంధనం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ పరిస్థితుల్లో భారత్‌కు అమెరికా సహజ మిత్రునిగా ఆవిర్భవించింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ)తో విస్తరిస్తున్న చైనాకు ఇండో–పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో చెక్‌ పెట్టడా నికి అమెరికా ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి బ్లూ డాట్‌ నెట్‌వర్క్‌ (బీడీఎన్‌)ను ప్రారంభించింది. భార త్‌ను కూడా భాగం కావాలని ఆహ్వానిస్తున్నది. ఇందులో చేరడం వల్ల భారత కంపెనీలకు బహుశా పెద్దపెద్ద ఇన్‌ఫ్రా కాంట్రాక్టులు దక్కవచ్చు. మన వృత్తి నిపుణులకు మంచి ఉద్యోగాలు కూడా దొరకవచ్చు. కానీ, అంతి మంగా పసిఫిక్‌ను పక్కన పెట్టినా, హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఎటువంటి కూటమి ఏర్పడినా భారత్‌ అందులో నిర్ణయాత్మక శక్తిగా ఉండాలన్నదే ఈ దేశప్రజల ఆకాంక్ష. ప్రభుత్వ ఆకాంక్ష కూడా అదే. ఈ దేశ గత చరిత్ర, సంస్కృతి, వనరులు, జనాభా, నైపుణ్యాలకు అనులోమానుపాతంలో ఈ దేశ అంతర్జాతీయ ప్రతిష్ట ఉండాలని ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ కోరుకుంటు న్నాడు. రోడ్‌షోలో వెళ్తున్నప్పుడు తనకు స్వాగతం చెప్పే గోడను చూసి ట్రంప్‌కు బహుశా ఒక డౌట్‌ రావచ్చు. ‘దీవార్‌ కే పీచే క్యాహై... దీవార్‌ కే పీచే’. అందుకు బదు లుగా గోడ ఆవలి నుంచి వినిపించే హృదయ స్పందనను ట్రంప్‌ వినగలిగితే విషయం అర్థమవుతుంది. ‘దీవార్‌ కే పీచే దిల్‌ హై భారత్‌ కా’.


muralivardelli@yahoo.co.in
వర్ధెల్లి మురళి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement