
న్యూఢిల్లీ: హౌడీ మోడీ తరహాలో అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనే భారీ కార్యక్రమం ‘‘కెమ్ ఛో ట్రంప్’ ’పేరును ‘నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్’గా మార్చాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లిష్‌లో హౌ డూ యూడూ అనే అర్థం వచ్చేలా గుజరాతీ భాషలో కెమ్ ఛో (ఎలా ఉన్నారు? ట్రంప్) అని పేరు పెట్టారు. కానీ అది స్థానిక భాషలో ఉండడంతో ఒక ప్రాంతానికి పరిమితమైనట్టుగా ఉంది. అగ్రరాజ్యాధిపతి పాల్గొనే ఆ కార్యక్రమానికి జాతీయ భావాన్ని తలపించడం కోసం కేంద్రం ఆదేశాల మేరకు నమస్తే, ప్రెసిడెంట్ ట్రంప్ అని మార్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచ అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూడా ట్రంప్ సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ప్రతీకారం తీర్చుకుంటాం: జైషే మొహమ్మద్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఒక వీడియో విడుదల చేసింది. ‘‘ముస్లింలను వేధిస్తే ఇక చూస్తూ కూర్చోం. క్షమించడమన్నదే లేదు’’ అని ఒక వ్యక్తి వీడియో ద్వారా హెచ్చరించాడు. ట్రంప్ పర్యటనకి కాస్త ముందు పాకిస్తానే ఈ పని చేసినట్టు భావిస్తున్నారు.