ముర్షిదాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను అలనాటి బాలీవుడ్ విలన్ అమ్రిష్ పురితో పోల్చారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి క్యారెక్టర్ మొగాంబోగా వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలో 'ఖుష్ హోగయా' అనే డైలాగ్‌ను సంతోషం వ్యక్తం చేస్తూ అమ్రిష్ పురి వాడుతుంటాడు. అదే తరహాలో ట్రంప్‌ను సంతోష పెట్టేందుకు భారత ప్రభుత్వం నానా అవస్థలు పడుతుందని అధీర్ రంజన్ ఎద్దేవా చేశారు. (వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్)
ట్రంప్‌ను సంతోషం పెట్టేందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందని ? మురికి వాడల్లో నివసిస్తున్న పేదవారిని అంతగా దాచిపెట్టాల్సిన పని ఏంటని? మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. అభివృద్ధికి ఓ నమూనాగా గుజరాత్‌ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ... అక్కడ పేదలను మాత్రం దోపిడీకి గురి చేస్తుందని మండిపడ్డారు. మొగాంబోను సంతోషం పెట్టడానికి మేం ఏదైనా చేస్తామన్న రీతిలో కేంద్రం ప్రవర్తించడం సిగ్గుచేటరన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసనకు దిగుతామన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 25 న డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం ఏర్పాటు చేస్తున్న విందు కోసం రాష్ట్రపతి భవన్ చేసిన ఆహ్వానాన్ని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ప్రశ్నించారు.
'ట్రంప్ భారత్‌కు వస్తున్నారు. భారతదేశం ఆయన కోసం గ్రాండ్ డిన్నర్ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదు. సోనియా గాంధీని ట్రంప్‌తో విందుకు ఆహ్వానం లేదు. 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారు. అయితే ఇక్కడ మోదీ మాత్రమే ట్రంప్‌తో ఉంటారు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ' అని చౌదరి కేంద్ర సర్కార్‌ను నిలదీశారు. తాను వ్యక్తిగతంగా మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానని, నిజంగా ట్రంప్ భారతదేశానికి రావడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్‌ను మేము మనస్పూర్తిగానే స్వాగతిస్తున్నమని తెలిపారు.అయితే భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని, వాటి లక్షణాలను గౌరవించాల్సిందేనని చౌదరి పేర్కొన్నారు. (అవును నేను పాకిస్తానీనే.. బీజేపీకి సవాల్)
Comments
Please login to add a commentAdd a comment