న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారత్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ట్రంప్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్, రోడ్‌షో నిర్వహించనున్న మార్గాల్లో ఇప్పటికే పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ మార్గ్, మౌర్య హోటల్ సమీపంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వందల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మౌర్య హోటల్ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్‌లోని ప్రతి ఫ్లోర్‌లో ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అమెరికాకు చెందిన సీక్రెట్ సర్వీస్ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్‌ఎస్‌జీ), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం వీరికి జతకలిశారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు.
25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, స్టేట్ రిజర్వ్ పోలీసులు, చేతక్ కమాండోలు, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌లు సైతం వీరికి జతకలిశాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొటెరా స్టేడియం వరకు దాదాపు 22 కి.మీ. మేర ట్రంప్, మోదీల రోడ్‌షో జరగనున్న నేపథ్యంలో పరిసరాలను గమనించేందుకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బాంబు పేలుళ్లు వంటివి సంభవించకుండా అధునాతన పరికరాల సాయంతో రోడ్డు మార్గాన్ని పలుమార్లు జల్లెడ పట్టారు. రోడ్‌షో జరిగే మార్గంలో 100 వాహనాలతో రిహార్సల్ నిర్వహించారు.
మెలానియాకు సైతం..
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటించనున్న అన్ని మార్గాల్లో డబుల్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గాలపై వైమానిక నిఘా ఉంచారు.
సబర్మతి ఆశ్రమానికి
తొలిసారిగా భారత్ పర్యటనకు వస్తున్న ట్రంప్ సోమవారం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నట్లు సిటీ పోలీసు కమిషనర్ ఆశిష్ భాటియా వెల్లడించారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ రోడ్‌షోలో పాల్గొననున్న ట్రంప్.. మార్గమధ్యంలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారని చెప్పారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఆశ్రమంలో గడపనున్నారని పేర్కొన్నారు.
ఆ తర్వాత తిరిగి రోడ్‌షోను కొనసాగిస్తారని వెల్లడించారు. ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా సందర్శించనున్నట్లు తెలిపారు. ట్రంప్‌తో పాటు ప్రధాని మోదీ సైతం సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ట్రంప్ హృదయ్ కుంజ్‌ను సందర్శించనున్నారని సబర్మతీ ఆశ్రమం సెక్రటరీ అమృత్ మోదీ వెల్లడించారు. ట్రంప్ రాక సందర్భంగా ఆశ్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సీక్రెట్ ఏజెన్సీ ఏం చేస్తుంది?
అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీదే. ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది. అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది. అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్ నల్లటి బ్రీఫ్‌కేస్ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్ భద్రపరిచి ఉంటుంది.
అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనుసరిస్తూనే ఉంటాడు. చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుం టారు. ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు. సీక్రెట్ సర్వీస్ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట!
గంటకు 1.02 కోట్లు
రష్యా అధ్యక్షుడి మెర్సిడెంజ్ బెంజ్ కారు, చైనా అధ్యక్షుడి హాంగ్‌కి ఎల్5 కారుతో పోల్చుకుంటే అమెరికా అధ్యక్షుడి కారు బీస్ట్ చాలా ఖరీదైంది. అధునాతనమైంది కూడా. అలాగే, అమెరికా అధ్యక్షుడి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం గంట ప్రయాణానికి రూ.1.02 కోట్లు ఖర్చవుతుందట. ఈ విమానంలో పెద్ద ఆఫీసు, కాన్ఫరెన్స్ హాల్, వంద మందికి సరిపడా ఆహారం వండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అధ్యక్షుడికి విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన సూట్ ఉంటుంది. మొత్తంగా ఇది ఒక విమానం మాదిరిగా కాకుండా హోటల్‌గా ఉంటుంది. అణ్వస్త్రం, క్షిపణి దాడిని సైతం తట్టుకునేలా ఇందులో ఏర్పాట్లుంటాయి.
అమెరికాపై దాడి జరిగినప్పుడు ప్రతిస్పందించేలా ఎయిర్ ఫోర్స్ వన్ సంచార కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వీటితోపాటు అధ్యక్షుడి భారీ కారు లిమోజిన్, వెయ్యి మంది సిబ్బంది, ప్రత్యేక రక్షణ పరికరాలు.. వీటన్నిటికీ సీ5 రకం కార్గో విమానం ఉంటుంది. 2017లో ట్రంప్ జెరుసలేం పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్ డేవిడ్ హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్‌లో ఒక్క రాత్రికి రూ.3.95 లక్షలుండే సూట్‌లతోపాటు సిబ్బంది కోసం 1,100 రూంలను బుక్ చేయాల్సి వచ్చిందట.
Comments
Please login to add a commentAdd a comment