అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు వస్తున్నారంటే ఊరూవాడా ఒకటే సంబరం. ఇంట్లో పెళ్లి జరుగుతున్న హడావుడి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధిపతి అయిన ట్రంప్‌ని సాదరంగా ఆహ్వానించడానికి అహ్మదాబాద్ ముస్తాబవుతోంది. నమస్తే ట్రంప్ అంటూ స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎంతమంది అమెరికా అధ్యక్షులు భారత్‌కి వచ్చారు ? ఆనాటి విశేషాలేంటో ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం..
డ్వైట్ డి ఐసన్‌హోవర్, 1959
డిసెంబర్ 9 – 14
సరిగ్గా 60 ఏళ్ల క్రితం నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెట్టారు. ఆరు రోజుల పాటు మన దేశంలో పర్యటించారు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఐసన్‌హోవర్ పర్యటన ఇరు దేశాల సంబంధాల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 21 సార్లు తుపాకులు గాల్లో పేల్చి సైనిక వందనంతో ఐసన్‌హోవర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ని సందర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
రిచర్డ్ ఎం నిక్సన్, 1969
జూలై–31
1969లో రిచర్డ్ ఎం నిక్సన్ తన ఆసియా పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. జులై 31న ఢిల్లీలో 22 గంటలు మాత్రమే గడిపారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీతో నెలకొన్న అపోహల్ని తొలగించుకొని, అమెరికా, భారత్ మధ్య సాన్నిహిత్యం పెంచుకోవడానికే నిక్సన్ భారత్‌కు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన అమెరికా వెళ్లిపోయాక భారతీయులపై నీచమైన కామెంట్లు కూడా చేశారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో నిక్సన్ పాకిస్తాన్‌కే కొమ్ముకాశారు.
జిమ్మీ కార్టర్, 1978
జనవరి 1 – 3
1978 జనవరిలో జిమ్మీ కార్టర్ భారత్‌కు వచ్చారు. అప్పట్లో మొ రార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నారు. 1971లో బంగ్లా యుద్ధం, 1974లో భారత్ అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించడం కోసమే కార్టర్ వచ్చారు. తల్లితో కలిసి వచ్చిన ఆయన పార్లమెంటులో ప్రసంగించారు. వివిధ రాజకీయ నాయకుల్ని కలుసుకున్నారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాల్సిందిగా భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా సర్కార్ తిరస్కరించడంతో ఆయన పర్యటన ఫలప్రదం కాలేదు.
బిల్ క్లింటన్, 2000
మార్చి 19–25
ఆ తర్వాత రెండు దశాబ్దాలు భారత్, అమెరికా సం బంధాల మధ్య స్తబ్ధత నెలకొంది. దానిని తొలగించడం కోసం 2000లో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సేతో కలిసి భారత్‌లో పర్యటించారు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బిల్ క్లింటన్‌కి రాచమర్యాదలు చేశారు. క్లింటన్ హయాంలోనే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. ఆగ్రా, జైపూర్, ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్‌కి కూడా క్లింటన్ వచ్చారు. ప్రతీచోటా ఆయనకు అఖండ స్వాగతం లభించింది.
జార్జ్ డబ్ల్యూ బుష్, 2006
మార్చి 1–3
2006లో జార్జ్ డబ్ల్యూ బుష్, ఆయన సతీమణి లారా బుష్ భారత్‌కు వచ్చి మూడు రోజులు పర్యటించారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బుష్ పర్యటనని గొప్పగా తీసుకున్నా, లెఫ్ట్ పార్టీలు అధ్యక్షుడి రాకను వ్యతిరేకించడంతో బుష్ పార్లమెంటుని ఉద్దేశించి ప్రసంగించలేదు. అప్పుడే రెండు దేశాల మధ్య అణు ఒప్పందం ఖరారైంది.
బరాక్ ఒబామా 2010, 2015
2010, నవంబర్ 6–9
2015, జనవరి 25–27
అమెరికా, భారత్‌ల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు బరాక్ ఒబామా హయాంలోనే నెలకొన్నాయి. మహాత్మాగాంధీ బోధనల నుంచి స్ఫూర్తిని పొందిన ఆయన తన ఎనిమిదేళ్ల పాలనలోనూ భారత్‌తో సంబంధాలకు అత్యంత విలువ ఇచ్చారు. మన్మోహన్ హయాంలో 2010లోనూ , తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో 2015లో పర్యటించి భారత్‌తో సంబంధాలు తమకెంత కీలకమో చాటి చెప్పారు. తొలిసారి పర్యటనలో రక్షణ రంగంలోనూ , అంతరిక్ష పరిశోధనల్లోనూ, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులోనూ భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ రంగంలో వ్యూహాత్మక సంబంధాలు బలపడడానికి ఒబామాయే చొరవ తీసుకున్నారు. అంతేకాదు నిరంతరం మన్మోహన్ సింగ్‌తో టచ్‌లో ఉంటూ సన్నిహితంగా మెలిగారు ఆ తర్వాత మోదీ ప్రధాని అయ్యాక 2015 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఒబామా విచ్చేశారు. ఇలా గణతంత్ర ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు హాజరుకావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా ఒబామా 400 కోట్ల ఆర్థిక సాయాన్ని కూడా భారత్‌కు ప్రకటించారు.
అగ్రరాజ్యాధీశుల భారతీయం
Published Sun, Feb 23 2020 5:20 AM | Last Updated on Mon, Feb 24 2020 1:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment