న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో ఆయన కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో పాటు పలువురు అధికారులు సహా అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ కూడా భారత్‌కు వస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. వీరితో పాటు ఇవాంకా, ఆమె భర్త జారేద్ కుష్నర్ కూడా వస్తున్నట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్, మెలానియా, ఇవాంకా తొలుత అహ్మదాబాద్ వెళ్లి.. ఆ తర్వాత ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించి.. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా మెలానియాతో కలిసి ఇవాంకా విదేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక 2017లో ఇవాంకా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ పారిశ్రామికవేత్తల ఎనిమిదో శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)’ కు ఆమె హాజరయ్యారు.
చదవండి: భారత పర్యటన: ట్రంప్ నిష్ఠూరం
మరోవైపు.. ట్రంప్ తాజా పర్యటనలో భాగంగా వాణిజ్యపరంగా భారత్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారని భావిస్తున్న తరుణంలో.. వాణిజ్యం విషయంలో భారత్ సరిగ్గా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇతర దేశాలతో వాణిజ్యం విషయంలో అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ వ్యవహరిస్తున్న విషయం ప్రపంచానికి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment