చేతిలో చెయ్యేసి | Taj Mahal The Monument of Love Says Donald Trump | Sakshi
Sakshi News home page

చేతిలో చెయ్యేసి

Published Tue, Feb 25 2020 5:56 AM | Last Updated on Tue, Feb 25 2020 8:17 AM

Taj Mahal The Monument of Love Says Donald Trump - Sakshi

ప్రేమసౌథం వద్ద అమెరికా ప్రథమ పౌరుడు ట్రంప్, ఆయన భార్య మెలానియా

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో చల్లని సాయంత్రం సమయంలో   చిరుగాలులు మోముని తాకుతూ ఉంటే   తన నెచ్చెలి మెలానియా చేతిలో చెయ్యేసి   వెండికొండలా మెరిసిపోయే ప్రపంచ అద్భుతాన్ని  తనివితీరా చూసి తన్మయత్వం చెందారు అగ్రరాజ్యాధీశుడు

ఆగ్రా
మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచి ప్రఖ్యాతివహించింది. తాజ్‌మహల్‌ని సందర్శించడమంటే అదో అద్భుతమైన ప్రేమ భావన. అమెరికా ఇతర అధ్యక్షుల్లా మాదిరి కాదు.. ట్రంప్, మెలానియా ఎక్కడికి వెళ్లినా చేతులు పట్టుకొని కనిపించరు. కానీ ఈ తాజ్‌ ఏ మాయ చేసిందో ఏమో మెలానా చేతిలో చెయ్యి వేసుకుంటూ తాజ్‌ ఉద్యానవనంలో కలియతిరుగుతూ అలౌకికమైన ఆనందానికి లోనయ్యారు ట్రంప్‌. ఆ తన్మయత్వంలోనే సందర్శకుల పుస్తకంలో ‘‘తాజమహల్‌ వావ్‌ అనిపించింది.

సుసంపన్నమైన, విలక్షణ విభిన్నమైన భారతీయ సంస్కృతికి ఈ కట్టడం కాలాతీతంగా నిలిచిన పవిత్ర శాసనం. థాంక్యూ ఇండియా’’అని రాశారు. ట్రంప్‌ దంపతులు తాజ్‌మహల్‌లో గంటకు పైగా కలియతిరుగుతూ అణువణువు సౌందర్యంతో నిండిపోయిన ఆ కట్టడం అందాలను ఆస్వాదించారు. ప్రపంచ వారసత్వ కట్టడమైన తాజ్‌మహల్‌ గొప్పతనాన్ని ఒక గైడ్‌ వారికి వివరించి చెప్పారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌ కూడా వారి వెంట ఉన్నారు. అయితే ఇతర ప్రతినిధుల బృందంతో పాటు వారు దూరం నుంచి తాజ్‌మహల్‌ అందాలను వీక్షించారు. తాజ్‌ అందాలను ఇవాంకా తన మొబైల్‌ ఫోన్లో బంధిస్తూ కనిపించారు.

ఆగ్రా వీధుల్లో ఘన స్వాగతం  
అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆగ్రా ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా ట్రంప్‌ కారు బీస్ట్‌ క్షణ కాలమైనా కనిపిస్తుందని ఆత్రుతగా ఎదురుచూశారు. అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రాలో ఖేరియా ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఆయనకి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. తాజ్‌మహల్‌కి సమీపంలోని ఓబరాయ్‌ అమర్‌విలాస్‌ హోటల్‌కి తన కాన్వాయ్‌లోనే చేరుకున్నారు. మొత్తం 13కి.మీ. దూరం ఉన్న ఈ ప్రయాణంలో 15 వేలకు మందికి పైగా విద్యార్థులు, సాధారణ ప్రజలు రోడ్డుకిరువైపులా అమెరికా, భారత్‌ జెండాలు పట్టుకొని ఉత్సాహంతో చేతులు ఊపారు. ఆ హోటల్‌ నుంచి తాజ్‌మహల్‌కి తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్‌ ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లో వెళ్లారు.

కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాజ్‌మహల్‌ గేటు నుంచి 500 మీ పరిధి వరకు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలను సుప్రీం కోర్టు నిషేధించింది. అందుకే అధ్యక్షుడు ట్రంప్‌ తన బీస్ట్‌ కారుని హోటల్‌ ఆవరణలో ఉంచి ఎకో ఫ్రెండ్లీ వాహనాల్లోనే వెళ్లారు. తాజ్‌ కట్టడం దగ్గర మెలానియాతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడు వస్తూ ఉండడంతో తాజ్‌ని అద్దంలా ఉంచడానికి మరింత మెరుగులు దిద్దారు. వందలాది మంది పనివాళ్లు ముల్తానీ మిట్టీతో తాజ్‌ని శుభ్రం చేశారు. తాజ్‌మహల్‌ని సందర్శించిన అధ్యక్షుల్లో చివరి వాడు బిల్‌ క్లింటన్‌. 2000 సంవత్సరంలో తన కుమార్తె చెల్సీతో కలిసి ఆయన తాజ్‌ని సందర్శించారు. 2015లో బరాక్‌ ఒబామా తాజ్‌ని చూద్దామని భావించారు కానీ, భద్రతా కారణాల రీత్యా సందర్శించలేదు.

ఇవాంకా మళ్లీ అదే డ్రెస్‌
సాధారణంగా సెలిబ్రిటీలు ఒకసారి వేసుకున్న డ్రెస్‌తో మళ్లీ బయట ప్రపంచానికి కనిపించరు. పూటకో ఫ్యాషన్‌తో డ్రెస్సులు మారుస్తూ ఉంటారు. కానీ ఇవాంకా గత ఏడాది ఫ్యాషన్‌నే మళ్లీ కొనసాగించారు. 2019 సెప్టెంబర్‌ అర్జెంటీనా పర్యటనలో ఏ మిడీ అయితే వేసుకున్నారో అదే మళ్లీ భారత పర్యటనలోనూ ధరించారు. బేబి బ్లూ రంగు పైన ఎరుపు రంగు పెద్ద పెద్ద పువ్వులున్న వీ నెక్‌ డ్రెస్‌ వేసుకున్నారు. ఇలా మళ్లీ అదే డ్రెస్‌ వేసుకోవడానికీ ఒక కారణం ఉంది. ఒక చిన్న వస్త్రం తయారు చెయ్యాలంటే దాని వెనుక ఎన్నో సహజవనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. సహజవనరుల్ని కాపాడాలంటే సెలిబ్రిటీలు కూడా వేసుకున్న డ్రెస్‌లే మళ్లీ ధరించాలన్న సందేశాన్ని పంపడానికే ఇవాంకా అదే డ్రెస్‌ ధరించారు. ఈ విధంగా ప్రకృతి పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజ్‌ వద్ద ఇవాంకా, కుష్నర్‌ దంపతులు

సాధారణ టూరిస్టులకు నో
ట్రంప్‌ రాక సందర్భంగా సోమవారం ఆగ్రాలోని ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహల్‌లో సాధారణ టూరిస్టుల సందర్శనను నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 5.15 గంటలకు ట్రంప్‌ తాజ్‌మహల్‌ రాగా.. ఉదయం 11.30 గంటలకే తాజ్‌ను సాధారణ సందర్శకులకు దూరం చేశారు. ట్రంప్‌ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు  అధికారులు తెలిపారు. ట్రంప్‌ రాకను పురస్కరించుకుని తాజ్‌మహల్‌ను అందం గా అలంకరించామని, ఉద్యానవనంలో మరిన్ని పూలమొక్కలు నాటడంతోపాటు ఫౌంటేన్లు  మరమ్మతు చేయించామన్నారు.


ట్రంప్‌ దంపతులకు సీఎం యోగి బహుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement