మెలనియా గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో మెలనియాను న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చూశాడు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అతడి వయసు 52 ఏళ్లు. ఇద్దరికీ ఇరవై నాలుగేళ్లు తేడా. బిజినెస్‌మ్యాన్. టెలివిజన్ పర్సనాలిటీ. అప్పటికే రెండో భార్యతో వేరుగా ఉంటున్నాడు. ‘వావ్.. ఎవరీ అమ్మాయి!’ అని ఆరా తీశాడు. మనమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్ వచ్చినట్లు చెప్పింది మెలనియా. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలనియా ఇవ్వలేదు! అతడి పక్కనే సెలీనా మిడెల్‌ఫార్ట్ అనే అమ్మాయి ఉంది. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి ఫోన్ నెంబర్ అడుగుతాడేంటి అని కోపం వచ్చి నెంబర్ ఇవ్వలేదు. ట్రంప్ వదిలిపెట్టలేదు.
మెలనియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు. చివరికి ‘ఎస్’ అంది. తర్వాత కొన్నాళ్లకు ‘నో’ అంది. అలా కొంతకాలం ‘ఎస్’లు, ‘నో’ లతో వాళ్ల రిలేషన్ నడిచింది. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే బహిరంగంగా నడుస్తూ బయటపడ్డారు. తమ రిలేషన్ గురించి ట్రంప్ 2005లో ఓ టీవీ చానెల్‌లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. ఆ ముందు ఏడాదే వీళ్ల ఎంగేజ్‌మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలనియా తల్లి అయింది. కొడుకు పుట్టాడు.
మెలనియాకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. ఆమె తండ్రి స్లొవేనియా ప్రభుత్వ మోటార్ వెహికల్స్ డీలర్. స్లొవేనియా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. తల్లికి బట్టల కంపెనీ ఉంది. మెలనియాకు ఒక చెల్లి ఉంది. అన్న ఉన్నాడు. సొంత అన్న కాదు. తండ్రి మొదటి భార్య కొడుకు. మెలనియా ఆ అన్నను ఎప్పుడూ చూడలేదు. మెలనియా డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్‌లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలనియా. ఇన్ని భాషలు వచ్చినా... ట్రంప్‌పై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టడానికి ఆమెకు ఏ భాషలోనూ బలం సరిపోయేది కాదు. నాలుగేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌పై దాడి మొదలైంది. ముఖ్యంగా అమెరికన్ మహిళల వైపు నుంచి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో మహిళా వచ్చి ట్రంప్ తమతో ఎంత అసభ్యంగా ప్రవర్తించిందీ మీడియా ముందు వెళ్లగక్కారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని మెలనియా ఆయన వైపు స్థిరంగా నిలబడ్డారు.
‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు’’ అని వెనకేసుకొచ్చారు. ఎంత వెనకేసుకొచ్చినా.. మొదటి భార్య కూతురు ఇవాంక విషయంలో తన భర్త చేసిన కామెంట్‌లను మాత్రం ఆమె నిజాయితీగా ఖండించారు. కూతురు గురించి ఒక తండ్రి అనవలసిన మాటలు కాదని కూడా అన్నారు. (‘ఇవాంకా నా కూతురు కాకపోయుంటే నేను తనతో డేటింగ్‌కి వెళ్లేవాడిని. అంత అందంగా ఉంటుంది తను’ అని ట్రంప్ అన్నాడని వచ్చిన వార్తలపై). ట్రంప్ ధోరణి గురించి అడిగితే ఆమె ఎప్పుడూ ఒకే మాట చెబుతారు: ‘సెన్సేషన్ కోసం ఆయన్ని మాట్లాడిస్తారు తప్ప, సెన్సేషన్ కోసం ఆయనకై ఆయన మాట్లాడరు’ అని. ఆ మధ్య ఇంకో ఒక అందమైన మాట కూడా అన్నారు మెలనియా. ఇంట్లో తనకు ఇద్దరు కొడుకు లట. తన కొడుకు. తన భర్త.
Comments
Please login to add a commentAdd a comment