ట్రంప్‌ భారత్‌ టూర్‌లో రాజభోగాలు | Donald Trump India Visit On Air Force One | Sakshi
Sakshi News home page

ఎగిరే శ్వేతసౌధం

Published Thu, Feb 20 2020 3:17 AM | Last Updated on Mon, Feb 24 2020 2:06 PM

Donald Trump India Visit On Air Force One - Sakshi

వాషింగ్టన్, న్యూఢిల్లీ : ప్రపంచానికే పెద్దన్న దేశం విడిచి వస్తున్నాడంటే ఆయన రాజభోగాలకు కొరతేం ఉండదు. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అందుకే ఆయన ప్రయాణించే విమానం, కారు, హెలికాప్టర్‌ వేటి ప్రత్యేకతలు వాటికే ఉన్నాయి. ఎలాంటి దాడులనైనా తట్టుకుంటాయి. ఆత్మరక్షణ కోసం ఆయుధాలుగా కూడా మారుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25న భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రయాణ సాధనాలు, వాటి ప్రత్యేకతలు...  (వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు)


ఎయిర్‌ఫోర్స్‌ వన్‌
► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్‌ఫోర్స్‌ 1 అనే పిలుస్తారు.
► ప్రస్తుతం ట్రంప్‌ భారత్‌కు వస్తున్న విమానం బోయింగ్‌ 747–200. ఈ విమానంపై యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అన్న అక్షరాలు, అమెరికా జాతీయ జెండా ఉంటాయి.  
► ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా మారుతుంది.  
► నాలుగు జెట్‌ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది  
► గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది.  
► 70 మంది వరకు ప్రయాణించవచ్చు. 
► గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు.  
► విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్‌ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి.  
► అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్‌ గది, డైనింగ్‌ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్‌ సహా సకల సౌకర్యాలు ఉంటాయి.  
► ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది
►  ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు.  


అద్దాలే ఆయుధాలు
ది బీస్ట్‌
అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి ట్రంప్‌ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో ఆయన తన వెంట తెచ్చుకున్న కారులోనే వెళతారు. బీస్ట్‌ అని పిలిచే ఈ కారుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.  
► ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కారు తొలిసారి వాడకంలోకి వచ్చింది.  
► ఈ కారుని కాడలిక్‌ 1 అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఏర్పాట్లున్న కారు ఇదే
► ఇలాంటి బీస్ట్‌ కార్లు 12 అధ్యక్షుడు వెళ్లే కాన్వాయ్‌లో ఉంటాయి  

► 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారు చేశారు.  
► దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. ఈ కారు అద్దాలు అవసరమైతే గుళ్ల వర్షాన్ని కురిపించగలవు
► అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌కు చెందిన వారు మాత్రమే ఈ కారుని నడుపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో, 180 డిగ్రీల్లో కారుని తిప్పడం, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడం వంటి వాటిలో డ్రైవర్‌కి శిక్షణ ఇస్తారు
► ఈ కారు పక్కనే బాంబు పేలినా లోపల ప్రయాణించే అధ్యక్షుడికి ఏమీ కాదు.  
► జీవరసాయన దాడుల నుంచి కూడా తట్టుకొనే సౌకర్యం ఈ కారుకి ఉంది.  
► రాత్రిపూట ప్రయాణాల్లో కనిపించే నైట్‌ విజన్‌ కెమెరాలు, గ్రనేడ్‌ లాంచర్స్, ఆక్సిజన్‌ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్‌ రక్తం .వంటి సదుపాయాలుంటాయి.  
► అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆ సీటు కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో మాట్లాడడానికి వీలుగా శాటిలైట్‌ ఫోన్‌ ఉంటుంది.


హెలికాప్టర్‌.. మెరైన్‌ వన్‌
అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా మెరైన్‌ వన్‌ హెలికాఫ్టర్‌ కూడా వెంట వస్తుంది. ఆయా దేశాల్లో చిన్న చిన్న దూరాలకు, తాను బస చేసే హోటల్‌కి వెళ్లడానికి ఈ హెలికాప్టర్‌ని వినియోగిస్తారు.  
► వీహెచ్‌–3డీ సీ కింగ్‌ లేదంటే వీహెచ్‌–60ఎన్‌ వైట్‌ హాక్‌ హెలికాప్టర్లే అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు.  
► క్షిపణి దాడుల్ని సైతం ఈ హెలికాప్టర్లు తట్టుకుంటాయి. ఆ హెలికాప్టర్‌లో అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంటుంది.
► అధ్యక్షుడి భద్రత కోసం ఒకేసారి అయిదువరకు ఒకే రకంగా ఉండే హెలికాప్టర్లు ప్రయాణిస్తాయి. ఒక దాంట్లో అధ్యక్షుడు ఉంటే, మిగిలినవి ఆయనకు రక్షణగా వెళతాయి.
► అధ్యక్షుడు ప్రయాణిస్తున్న మెరైన్‌ వన్‌ ఎటు వెళుతోందో ఈ అయిదు హెలికాప్టర్లు ఒకదానికొకటి సమాచారాన్ని అందించుకుంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement